మునిసిపాటీల్లో మారిన కుర్చీలు
హిందూపురం, ఏలూరు, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికలు నిర్వహించగా, తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామలో వాయిదా పడ్డాయి.;
By : The Federal
Update: 2025-02-03 08:27 GMT
అధికారంలో ఉన్న పార్టీలే స్థానిక సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాటిగా మారింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం, మద్ధతు తెలపడం ఆంధ్రప్రదేశ్‌లో సహజ పరిణామంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన పలు కార్పొరేషన్‌ల డిప్యూటీ మేయర్ పదవులు, మునిసిపల్ చైర్మన్ల పోస్టులను అధికార టీడీపీ వశం చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మునిసిపల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకుంది. చైర్మన్‌గా రమేష్ ఎన్నియ్యారు. హిందూపురం ఎమ్మెల్యే, ఎంపీ పార్థసారథి ఓటింగ్‌లో పాల్గొన్న ఈ ఎన్నికల్లో 40 మంది సభ్యులు హాజరయ్యారు. టీడీపీకి 23 మంది సభ్యులు మద్దతు తెలపగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 మంది సపోర్టు చేశారు. ముగ్గురు సభ్యులు హాజరయ్యారు. మెజారిటీ సాధించిన రమేష్ హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవిని కూడా టీడీపీ వశం చేసుకుంది. తహసీన్‌ను డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ మద్దతిచ్చిన తహసీన్‌కు 41 ఓట్లు రాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు రావడంతో తహసీన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌ల పదవులను కూడా టీడీపీ సొంతం చేసుకుంది. టీడీపీ మద్దతుదార్లు పదవులను దక్కించుకున్నారు. మొదటి వైస్ చైర్మన్‌గా ఎరటపల్లి శివకుమార్‌రెడ్డి, రెండో వైస్ చైర్మన్‌గా పటాన్ నస్రీన్‌లు ఎన్నికయ్యారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదటి డిప్యూటీ మేయర్‌గా ఉమామహేశ్వరరావును, రెండో డిప్యూటీ మేయర్‌గా దుర్గాభవానిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అయితే తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామలో ఎన్నికలు వాయిదా వేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సమావేశం నిర్వహణకు అవసరమైన సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా వేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం లేదని, దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శించారు. ఈ పరిస్థితులపై ఈసీకి ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీలో టీడీపీకి బలం లేదని, 32 సీట్లల్లో టీడీపీ గెలిచింది కేవలం ఎనిమిది స్థానాలే అని, అలాంటిది వైఎస్ చైర్మన్ పదవిని లాక్కునేందుకు టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతోందని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు విమర్శలు చేశారు.