బాదుడులో టీడీపీ,వైసీపీ దొందూ దొందే
నాడు చెప్పింది ఏమిటి? నేడు చేస్తున్నది ఏమిటి అని సీఎం చంద్రబాబును కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు.;
By : The Federal
Update: 2025-02-01 12:54 GMT
అదనపు పన్నులు వేసి, చార్జీలు పెంచి ప్రజలను బాధడంలో టీడీపీ కూటమి, వైసీపీ దొందూ దొందేనని రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీసీపీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే చార్జీలు పెంచం, అదనపు పన్నులు వేయమని వైఎస్ జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు 2019 ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు వారిని నమ్మి ఓట్లు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చాక మాట తప్పింది. మడమ తిప్పింది. బాదుడు కార్యక్రమం ప్రారంభించింది. 5 ఏళ్ల పాలనలో దాదాపు లక్షా నలభై వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపిందని తులసిరెడ్డి మండిపడ్డారు.
పెట్రోల్, డీజల్‌పై అదనపు వ్యాట్, రోడ్డు సెస్ ద్వారా రూ. 40,000 కోట్లు, 3 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి రూ. 5243 కోట్లు, 8 సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ. 30000 కోట్లు, ఇసుక ధర పెంచి రూ. 4200 కోట్లు, ఆస్తి పన్ను పెంపు ద్వారా రూ. 956 కోట్లు, మద్యం ధర పెంపు ద్వారా రూ. 34000 కోట్లు, చెత్త పన్ను ద్వారా రూ. 400 కోట్లు, మీ సేవ రుసుం పెంపు ద్వారా రూ. 130 కోట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా రూ. 1000 కోట్లు, వాహనాల పన్ను పెంపు ద్వారా రూ. 1022 కోట్ల అదనపు భారం మోపిందని ద్వజమెత్తారు.
కూటమి అధికారంలోకి వస్తే.. అదనపు పన్నుల భారం వేయం, చార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తాం అని 2024 ఎన్నికల సందర్భంగా టీడీపీ, ఎన్డీఏ కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు వారిని నమ్మి ఓట్లు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. మాట తప్పింది. మడమ తిప్పింది. బాదుడు కార్యక్రమం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై రూ. 15,485 కోట్లు అదనపు భారం మోపింది. కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతోందని మండపడ్డారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు 20 శాతం పెరగబోతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో భూముల, నిర్మాణాల విలువ 20 శాతం పెంచబోతన్నారు. రేకుల షెడ్లు, మట్టి మిద్దెలపై కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగుతాయి. త్వరలో పట్టణాలు, నగరాలలో యూజర్ చార్జీలు విధించబోతున్నారు. అదనంగా 1 శాతం వరద సెస్ విధించబోతున్నారు. ఇది ఖచ్చితంగా నమ్మక ద్రోహమని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. దీనిపైన కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 జోన్లు ఉన్నాయి. 1వ జోన్ క్రింద పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వున్నాయి. 2వ జోన్ క్రింద తూర్పు గోదావరి,ç ³శ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలు ఉన్నాయి. 3వ జోన్ క్రింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. 4వ జోన్ క్రింద 4 రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. రాజధాని అమరావతి 3వ జోన్ క్రింద వస్తుంది. రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అక్కడ విద్యా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.