ఎవరికీ పట్టని అన్నదాత ఆవేదన!

అధిక దిగుబడుల పేరుతో రసాయన ఎరువులు, పురుగు మందులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. దిగుబడులు వచ్చినా ధరలు లేక నష్టపోతున్నారు.;

Update: 2025-01-30 10:55 GMT

రైతులకు నష్టం వచ్చిందంటే ఆలోచించే వారు కానీ, ఆదుకునే వారు కానీ కనిపించడం లేదు. ఒక వ్యాపార వేత్తకు నష్టం వచ్చిందంటే రాయితీలపై రాయితీలు ఇచ్చి బ్యాంకు రుణాలు రద్దుచేసి నీకు మేమున్నామనే భరోసా ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతులు పండించే పంటల అధిక దిగుబడుల పేరుతో విపరీతంగా రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో వ్యాపారులకే కాకుండా పాలకుల పాపం కూడా ఉంటోంది. డిఏపీ, 28-28-28 వంటి బలం మందులు, ఇతర కీటక నాశని మందులు నాలుగేళ్ల నాటికి ఇప్పటికీ రెట్టింపు ధరలు అయ్యాయి. దీంతో ఒక ఎకరా వరిధాన్యం పండించాలంటే కనీసం రూ. 20వేలు రసాయన ఎరువులు, పురుగు మందులకు ఖర్చవుతోంది. ట్రాక్టర్ లేని వ్యవసాయ దారునికి దున్నకం ఖర్చులు ఎకరాకు పది వేల వరకు అవుతున్నాయి. నాట్లు వేసేందుకు ఐదు వేలు ఖర్చవుతున్నాయి. ఇక నారు పోసి పెంచే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటోంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు పదివేలు పైన మిగిలాయంటే బాగా పంట పండినట్లు గా రైతులు భావిస్తున్నారు.

బాగా దెబ్బతీసిన ప్రకృతి విపత్తులు

ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులను తుఫాన్ లు బాగా దెబ్బతీశాయి. రెండు సార్లు వరుసగా వచ్చిన వర్షాలకు వరి ధాన్యం రంగు మారింది. కొన్ని చోట్ల తాలు వచ్చాయి. కొన్ని చోట్ల గింజ పనికి రాకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ కంటే ఈ సంవత్సరం రైతుల వద్ద నుంచి ఏ గ్రేడ్ ధాన్యాన్ని వ్యాపారులు క్వింటా రూ. 1700ల వరకు ధర ఇచ్చి కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యాన్ని రూ. 12 వందల నుంచి 14 వందల మధ్య ధర పెట్టి కొనుగోలు చేశారు. సన్న వరి రకాలకు మంచి డిమాండ్ ఉంది. నెంబర్లకు ధర చాలా తక్కువ వచ్చింది. గోదావరి జిల్లాల్లో వరి పంట పూర్తిగా రైతులు ఈ ఏడాది నష్టపోయారు. ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక ప్రకాశం నుంచి అనంతపురం, కర్నూలు వరకు ధాన్యం క్వాలిటీగానే దిగుబడి వచ్చిందని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా ఈ సారి వరి ధాన్యాన్ని మంచి ధరకే కొనుగోలు చేసింది. ఎక్కువ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం విశేషం.

పప్పు ధాన్యాలపై తీవ్ర ప్రభావం

రాష్ట్ర వ్యాప్తంగా పప్పు ధాన్యాల ధరలు బాగా తగ్గాయి. మూడు నుంచి ఐదు శాతం ఎంఎస్పీ కంటే తగ్గినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మార్కెటింగ్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త వై రాధ తెలిపారు. కందులు క్వింటా ధర ఎంఎస్పి ప్రకారం రూ. 7550లు ఉండగా మార్కెట్లో రూ. 7,000 కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయలేక పోయారు. వ్యాపారులు కూడా ఎంత ప్రయత్నించినా అంతకంటే ఎక్కువ ధర ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అంటే రైతు క్వింటాకు రూ. 377.5 లు కోల్పోయారు. అలాగే పెసర పంట కూడా ధర తగ్గింది. క్వింటా పెసలు ఎంఎష్పి ప్రకారం క్వింటా రూ. 8,682లు ఉండగా రూ. 342.28లు ధర తగ్గింది.

ఇక మినుము, పల్లీలు, పొద్దు తిరుగుడు, సోయాబీన్ (పసుపు), నువ్వులు, గడ్డి నువ్వుల ధరలు కూడా మూడు నుంచి ఐదు శాతం తగ్గాయి. ఈ పంటలకు సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు మంచి వాతావరణం ఉండాలి. నీరు సమపాళ్లలో కావాల్సి ఉంటుంది. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని పండిస్తే దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ పంటలకు కూడా ధరలు తగ్గిపోతే రైతుల పరిస్థితి ఏమిటనేది కూడా ఆలోచించాల్సి ఉంది.

Delete Edit

దిక్కుతోచని పత్తి రైతు

రాష్ట్రమంతా పత్తి పంట ఈ ఏడాది దిగుబడులు పరవాలేదనుకున్నా వర్షాల కారణంగా క్వాలిటీ తగ్గింది. దీంతో ధరలో తీవ్రమైన వ్యత్యాసాలు వచ్చాయి. గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వారే ఏ గ్రేడ్ తప్ప మిగిలిన గ్రేడ్ పత్తి కొనుగోలు చేయలేమని తేల్చేశారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాల్లో నే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఇప్పటికీ పత్తి తీతలు జరుగుతూనే ఉన్నాయి. పత్తి దిగుబడి (ఈల్డ్‌) పై విత్తన కంపెనీలు ఊదరకొడుతున్నంత సీన్‌ వాస్తవంలో లేదు. ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి (కాయలు) దిగుబడి వస్తుందని నమ్మబలికి విత్తనాలు అంటగట్టి విత్తన కంపెనీలు రైతుల నుంచి సొమ్ము చేసుకుంటున్నాయి.

దిగుబడి పెరిగితే తమ విత్తనాల గొప్పతనంగా, తగ్గితే వాతావరణం మీద, రైతుల మీద నెపం వేస్తున్నాయి. 2019-20లో అత్యధికంగా ఎకరాకు 7.78 క్వింటాళ్ల దిగుబడి లభించింది. ఉత్పత్తి పరంగా చూస్తే 2019-20లో అత్యధికంగా 24.97 లక్షల బేళ్ల పత్తి (లింట్‌) ఉత్పత్తి జరిగింది. అత్యల్పంగా గత ఏడాది (2023-24) లో 7.23 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో 11.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 9.41 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి లభిస్తుందని ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టులో మొదటి ముందస్తు అంచనా వేసింది. కానీ సాగు 3.99 లక్షల ఎకరాలకు తగ్గింది. ఎకరాకు దిగుబడి 4.23 క్వింటాళ్ల దిగుబడి (కాయలు) వస్తుందని తొలి అంచనాలో పేర్కొన్నారు. వర్షాభావం, డ్రైస్పెల్స్‌, వర్షాలు, వరదల వలన వేసిన పంట చాలాచోట్ల దెబ్బతిన్నది. ఒక వైపు సాగు తగ్గడం మరో వైపు ప్రకృతి విపత్తులతో పంట దెబ్బతినడంతో అంచనాలు తారుమారయ్యాయి.

పొడవు పింజ పత్తి క్వింటా ఎంఎస్పీ రూ. 7521లు కాగా ఈ పత్తి ప్రస్తుతం రూ. 6 నుంచి 7వేల లోపులో మాత్రమే కొనుగోలు జరుగుతోంది. పొట్టి పింజ పత్తి ఎంఎస్పి ప్రకారం రూ. 7,121 లు ఉంటే క్వింటా మార్కెట్లో రూ. 5 వేలకు మంచి అమ్ముడు పోవడం లేదు. గ్రేడ్ ల ఆధారంగా ప్రస్తుతం రూ. 4వేల నుంచి రూ. 9,650ల వరకు రైతులు కొనుగోలు చేస్తున్నారు. కనీసంగా క్వింటా రూ. 14వేలు పైన అమ్మితే కాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు.

Delete
Edit

మిర్చి ధరలు కూడా దారుణంగా పడిపోయాయి

మిర్చి పంట భారీగానే వేసినప్పటికీ దిగుబడులు రాలేదు. తెగుళ్లు పంటను దెబ్బతీశాయి. ఆకుముడుత, బొబ్బెర, నల్లి, జెమినీ వైరస్‌, కొమ్ముకుళ్లు తెగుళ్లు సోకాయి. ఒక్కసారిగా మూడు, నాలుగు రకాల తెగుళ్లు వ్యాపించడంతో చెట్టంతా ముడుచుకుపోయి దిగుబడి తగ్గింది. పైగా సీజన్ ప్రారంభం నుంచే తుఫాన్ ల ప్రభావం కారణంగా కాయల్లో పెరుగుదల లేకుండా పోయింది. బాగా వచ్చిన కాయలు కూడా సరైన రంగు, కారం లేకుండా పోవడంతో ధర పాతాళాన్ని చూసింది. ఎకరాకు రైతులు పెట్టుబడి ఖర్చుల కింద కనీసంగా రూ. 1.50 లక్షలు ఖర్చు చేశారు. తీరా అమ్మే సరికి క్వింటా రూ. 4వేల నుంచి ప్రారంభమవుతోంది.

ఏ గ్రేడ్ మిర్చి ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో రూ. 11,883 లు పడుతోంది. ఇక కాస్త తాలు వచ్చినా, రంగు మారినా మంచి మిర్చే అయినా క్వింటా ధర రూ. 4వేలకు మించడం లేదు. నాలుగు నుంచి పదివేల లోపులో వివిధ గ్రేడ్స్ కింద వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది క్వింటా ధర దాదాపు రూ. 20వేల వరకు అమ్మింది. దీంతో రైతులు చాలా మంది చివరి కాపు ధర తగ్గిందని, తరువాత అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ఆ నిల్వ ఉన్న కాయ సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు వ్యాపారుల అంచనా. ఇక ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న మిర్చి పంట కూడా భారీగానే ఉంది. దీంతో ధర పూర్తిగా పడిపోయింది. కనీస ధర క్వింటా రూ. 15,000లు లేనిది బతికే పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని నరసింహారావు ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ మిర్చి పంట రైతులను బాగా దెబ్బతీసిందని, ఎకరా మిర్చి అమ్మితే రూ. 70 నుంచి 80వేల వరకు మాత్రమే వస్తున్నాయని, పెట్టుబడులు లక్షన్నర వరకు అయినట్లు తెలిపారు. అమ్మకం జరగకుండా మార్కెట్లో నే ఉంచడం వల్ల పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు అప్పు ఇచ్చిన వ్యాపారులు తమను పీక్కు తింటున్నారని, ఈ బాధలు భరించలేకే ఆత్మహత్యలకు రైతులు పాల్పడాల్సి వస్తోందన్నారు.

మొత్తంగా పంటల ధరలు ఈ సంవత్సరం ఆశాజనకంగా లేవని రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కూడా పత్తిని గ్రేడ్స్ గా విభజించి కొనుగోలు చేసి రైతును మరిన్ని కష్టాల్లోకి నెట్టిందంటున్నారు. మిర్చి పంట తీవ్రస్థాయిలో రైతులను దెబ్బతీసిందని, ధాన్యం పండించిన వారికి మాత్రమే ఈ సంవత్సరం కాస్త ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. వర్షాల కారణంగా కొందరు ధాన్యం రైతులు కూడా పూర్తిగా నష్టపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ కాని, పంట నష్ట పరిహారం కానీ ఎందుకూ పనికి రావన్నారు.

Tags:    

Similar News