తిరుపతి: 'డీజీపీల మీట్' లక్ష్యం, అజెండా ఏమిటంటే..

వ్యవస్థీకృత నేరాల అదుపు లక్ష్యంగా దక్షిణాది రాష్ట్రాల డీజీపీల మీట్ ప్రారంభమైంది. తీవ్రవాద కలాపాల నిరోధంపై సమీక్షించనున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-18 07:37 GMT

దక్షిణాది రాష్ట్రాల డీజీపీ (director general of police) ల సమావేశం తిరుపతిలో మంగళవారం ప్రారంభమైంది. 2021 నవంబరు 14వ తేదీ కూడా తిరుపతిలోనే డీజీపీల సమావేశం జరగడం గమనార్హం. ఈ డిజిపిల మీట్ కు తిరుపతి మరోసారి ఆతిథ్యం ఇస్తోంది. తిరుపతిని కేంద్రంగా ఎంచుకోవడం వెనక కూడా పోలీస్ శాఖకు ఒక నిర్దిష్ట లక్ష్యం ఉందనేది విశ్వసనీయ సమాచారం.

దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు సోమవారం రాత్రికి తిరుపతి చేరుకున్నారు. నగరంలోని మానస సరోవర హోటల్ వేదికగా నిర్వహిస్తున్న ఈ మీట్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అజెండా ఏమిటి?
దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ప్రధాన అజెండాగా కొన్ని అంశాలపై సమీక్షించనున్నారు. అందులో ప్రధానంగా ఉగ్రవాదం, తీవ్రవాద ప్రాబల్యాన్ని నిరోధించడంతోపాటు ఈ అంశాలలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా డీజీపీల తోపాటు సమావేశానికి హాజరైన హోం మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి అధికారులు సమీక్షించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పోలీసు శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే అంశాలపై చర్చించనున్నట్టు పోలీసు అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. అంతేకాకుండా
వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల మధ్య భద్రతా చర్యలు. ఈ తరహా నేరాల నియంత్రణకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం పై సమీక్షించే విధంగా హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) అధికారులు సమాయత్తమై వచ్చారని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లోనికి అక్రమంగా ఆయుధాలు చేరవేత నివారణ కోసం తీర ప్రాంత భద్రతపై కూడా దృష్టి సారించాల్సిన అంశాలే కాకుండా, ఇందులో కూడా అన్ని రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పని చేసే దిశగా చర్చించనున్నారు. వ్యవస్థీకృత నేరాలను (Organized crime) గుర్తించడంతోపాటు వాటిని నిరోధించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే తీరుపై కూడా సమీక్షించనునట్లు తెలిసింది.
తిరుపతి కేంద్రమైంది..
దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు, హోం మంత్రిత్వ శాఖ ల అధికారుల ఉన్నతస్థాయి సమీక్షకు తిరుపతిని కేంద్రంగా ఎంపిక చేయడం వెనక కూడా ప్రత్యేక కారణం ఉన్నట్లు కనిపిస్తోంది. 2021 నవంబర్ 14 వ తేదీ తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతున్న సమావేశం రెండవది. వాస్తవానికి డీజీపీలు, హోం మంత్రిత్వ శాఖల ఉన్నతస్థాయి అధికారుల సమావేశం ఎక్కడ జరుగుతుందనే విషయం రెండేళ్లకు ముందే ఖరార్ అవుతుందనేది పోలీసు వర్గాల సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న సమావేశం కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
తీవ్రవాద ప్రాబల్యంపై చర్చ
దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు సరిహద్దులో ఉన్న తమిళనాడు ( Tamil Nadu) కర్ణాటక (, Karnataka) రాష్ట్రాలను పక్కన ఉంచితే, ఉత్తరాన ఉన్న ఒడిస్సా, చతిస్గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపే లక్ష్యంగా కగార్ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. నక్సలైట్ల అణచివేతలో ఆంధ్రకు సరిహద్దులో ఉన్న ఒడిశా అంతకంటే ప్రధానంగా ఛత్తీస్గఢ్ భద్రత దళాలకు దన్నుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇంకొన్ని సాయుథ బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే వరుస ఎన్ఎన్కౌంటర్ లతో మావోయిస్టు ఉద్యమాన్ని పోలీసు శాఖ కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఆపరేషన్ మరింత ఉధృతంగా సాగించే లక్ష్యంగా డిజిపిల మీట్లో సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ కారణమే..?
చతిస్గడ్ వద్ద ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో చిత్తూరు జిల్లా తవణం పల్లె మండలం పైపల్లె గ్రామానికి చెందిన చలపతి రెడ్డి మరణించారు. అత్యంత మారుమూల గ్రామం నుంచి వెళ్లిన చలపతి ఒడిశా రాష్ట్ర మావోయిస్టు (Maoist) పార్టీ కార్యదర్శిగా ఉన్నారనే విషయాన్ని భద్రత బలగాలే ధ్రువీకరించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి అనేది పోలీస్ శాఖ అంచనా. అకస్మాత్తుగా చలపతి రెడ్డి ఎన్కౌంటర్ తో జిల్లా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి లక్ష్యంగానే డీజీపీల మీట్లో కూడా రాష్ట్ర అధికారులు సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా..
రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా పోలీసు శాఖకు సవాళ్లు ఎదురవుతున్నాయి అందులో ప్రధానంగా.. మాదకదవ్యాల (Drugs) అక్రమ రమాణాతోపాటు మారణాయుధాలు కూడా కట్టడి చేసే దిశగా తీరప్రాంత (Coastline) భద్రతపై డీజీపీల సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అటు తెలంగాణ పొరుగునే ఉన్న ఒడిశా, చత్తీస్గడ్ సరిహద్దుల్లో చెక్ పోస్టులను (Chek Post) పటిష్టం చేసే దిశగా సమీక్షించనున్నారు. రాష్ట్రమంచి ఆ ప్రాంతాలకు నిత్యం భారీగానే గంజాయి సరఫరా అవుతున్నట్లు భావిస్తున్నారు. అందుకు నిదర్శనం నిత్యం ఏదో ఒక ప్రదేశంలో వాహనాలలో గాంజా (Ganjaa) తరలిస్తూ పట్టుబడుతున్న అంశాలే. ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడంలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు శాఖల మధ్య పరస్పర సమన్వయం, సహకారం అందిపుచ్చుకునే విధంగా సమీక్షించనన్నట్లు సమాచారం.

Similar News