TTD | ఆలయ వ్యవస్థకు ఆదర్శం టీటీడీనే
శ్రీవారి దర్శనంలో టీటీడీకి పటిష్ట వ్యవస్థ ఉంది. ITCX అంతర్జాతీయ సదస్సులో అదనపు ఈఓ ఇంకా ఏమి చెప్పారంటే..;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-18 14:53 GMT
దేశంలోని అన్ని దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నిర్వహణ ఆదర్శమని అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో జరుగుతున్నఅంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ ఎక్స్‌పో (ITCX)లో రెండవ రోజు మంగళవారం సాయంత్రం అదనపు ఆయన 35 నిమిషాలపాటు టిటిడి చరిత్ర, పాలన, శ్రీవారి దర్శన నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగులు, సిబ్బంది, టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సంస్థలు, ట్రస్టులు, ఇతర సేవలను వివరించారు.
2.50 కోట్ల మందికి దర్శనం
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సంవత్సరంలో సగటున 2.50 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వెల్లడించారు. వారికి మెరుగైన దర్శనం, వసతి కల్పించడానికి టిటిడిలో 66 శాఖల ద్వారా భక్తులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సరాసరిగా 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. క్యూలో ఉన్న యాత్రకులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంతమంది వచ్చే తిరుమలలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు కూడా తీసుకున్నంటున్న శ్రద్ధను వివరించారు.
తొక్కిసలాట లేని క్యూ
తిరుమలలో భక్తులు వేచి ఉండడానికి రెండు క్యూ కాంప్లెక్స్ లలో 63 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"రోజులో ఎక్కువ శాతం సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం కేటాయించాం. భక్తులకు సాధారణ దర్శన సమయం దాదాపు 12 గంటలు, శనివారాలు మరియు ఆదివారాల్లో 17 గంటలకు పైగా ఉంటుంది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, రోజువారీ వచ్చే భక్తుల సంఖ్య ఆధారంగా దర్శన ప్రణాళికలు మారుతుంది" అని వివరించారు.
వసతి సదుపాయం
శ్రీవారి దర్శనానికి తిరుమలకు రోజుకు సగటున సుమారు 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు 7,600 గదులు, ఐదు పీఏసీలు అందుబాటులో ఉన్నాయని వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో రోజూ సగటున 80 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నాం. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు మూడు వంటశాలలు ఉన్నాయని చెప్పారు. శ్రీవారి దర్శనానంతరం యాత్రికులకు రోజూ 3.5 లక్షల లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య సేవలు అందించటమే కాకుండా వివిధ ధార్మిక - సామాజిక-సంక్షేమ కార్యకలాపాలను కూడా టిటిడి నిర్వహిస్తుందని అదనపు ఈవో వివరించారు. ''టిటిడి కేవలం ఆలయ పరిపాలనకే పరిమితం కాదు, విస్తృత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
"దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తృతంగా తీసుకెళ్లేందుకు అన్నమాచార్య, దాస సాహిత్యం, ఆళ్వార్ దివ్యప్రబంధం, హిందూ ధర్మ ప్రచార మరియు ఇతర ప్రాజెక్టులు ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం" అని వివరించారు.
టీటీడీ మాధ్యమాలు
శ్రీవారి వైభవాన్ని విస్తృతం చేయడానికి టీటీడీలోని మాధ్యమాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. అందులో తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషలో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారాలు ఉంటాయని చెప్పారు. ఆరు భాషలలో సప్తగిరి మాసపత్రిక అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీ వైద్యం సేవలకు కూడా ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రస్తుతం 14 ఆసుపత్రులు, డిస్పెన్సరీలు నిర్వహిస్తోందన్నారు.
ఉచిత సేవలు
టీటీడీ ప్రధానంగా తిరుమలలో పారిశుధ్యం మెరుగుదలకు ప్రత్యేక వ్యవస్థ ఉందన్నారు. రోజు 1914 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు, 207 టాయిలెట్ బ్లాక్‌లు ఉన్నాయి, రోజూ 90 టన్నుల వ్యర్థాల చెత్త పోగు అవుతుందన్నారు. తిరుమలలో భక్తులకు ధర్మ రథం ద్వారా ఉచిత రవాణా అందిస్తున్నాం. అంతేకాకుండా ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుపతి నుంచి రోజూ ఆర్టీసీ బస్సులు ద్వారా సాధారణ భక్తులు తిరుమల చేరుతున్నారు. దాదాపు 1600 ఆర్టీసీ బస్సులు సేవలందిస్తున్నాయి. ప్రత్యేక సందర్భాలలో 2400 ఆర్టీసీ బస్సుల సేవలు అందిస్తున్నాయని వివరించారు.
టీటీడీలో ఉన్న సేవలు, విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం అందుబాటులో ఉన్న వసతులు, సదుపాయాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వివిరించారు. ఆయన ఏమన్నారంటే..
"35 విద్యా సంస్థలలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దేశవ్యాప్తంగా 61 దేవాలయాలు ఉన్నాయి. నాలుగు గోసంరక్షణ శాలలు ఉన్నాయి. వేద, వారసత్వ సంరక్షణతో సహా ఎనిమిది ట్రస్టులు ఉన్నాయి" అని వివరించారు.
టీటీడీలో 7000 మంది రెగ్యులర్ ఉద్యోగులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, శ్రీవారి సేవ వాలంటీర్లు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు.
సామాజిక కార్యకలాపాలు
టీటీడీ ద్వారా కుష్ఠు రోగుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న విషయాన్ని ఆయన ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు వివరించారు. ఎస్వీ పేదల గృహం, వృద్ధులు, నిరాదరణకు గురైన వారికి కరుణాధామం, అనాధలకు విద్య , వసతి, భోజనంతో ఎస్వీ బాలమందిరం, చెవిటి మరియు మూగ పాఠశాల, ప్రత్యేక సామర్థ్యం ఉన్న విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కళాశాల నిర్వహిస్తున్నామని వివరించారు.
టిటిడి అన్ని సేవలను డిజిటలైజేషన్ ద్వారా ముందుకు సాగుతోందని, రాబోయే రెండు మూడు సంవత్సరాలలో మరింతగా డిజిటలైజేషన్ వినియోగించి సేవలు అందిస్తామన్నారు. భక్తులకు పారదర్శక సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఐటీ కార్యకలాపాలను జోడించి 100% సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.