ఆకతాయి వీడియోపై టీటీడీ సీరియస్.. ముమ్మరంగా గాలింపులు

తిరుమల శ్రీవారి సన్నిధిలో కొందరు ఆకతాయిలు చేసిన ప్రాంక్ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రాంక్ పేరిట భక్తులను ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనేకమంది కోరారు.

Update: 2024-07-12 12:17 GMT

తిరుమల శ్రీవారి సన్నిధిలో కొందరు ఆకతాయిలు చేసిన ప్రాంక్ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రాంక్ పేరిట భక్తులను ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనేకమంది కోరారు. అంతేకాకుండా దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌లోకి వాళ్లు ఫోన్‌ ఎలా తీసుకొచ్చారు? అందుకు ఎవరు అనుమతించారు? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతుండటంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలించే వారిని, శ్రీవారి భక్తులను ఇబ్బంది పెట్టేవారిని వదిలే ప్రసక్తే లేదని వెల్లడించారు. ప్రాంక్‌లంటూ దర్శనానికి వెళ్లే క్యూలైలన్లో వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

ముమ్మరంగా గాలింపులు

ఈ నేపథ్యంలోనే సదరు యువతను అదుపులోకి తీసుకోవడానికి పోలీసుల సహాయంతో టీటీడీ ముమ్మరంగా గాలింపులు చేపట్టింది. వారు ఎక్కడ దాక్కుని ఉన్నా పట్టుకుని తీరుతామని తెలిపింది. ఇందుకోసమే ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని తమిళనాడుకు కూడా పంపినట్లు ప్రకటించింది టీటీడీ. ‘‘భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య. ఇలాంటి చర్చలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. వారు ఎవరైనా వెనకడుగు వేసేది లేదు’’ అని స్పష్టం చేసింది. టీడీపీ స్పందనపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలేమైందంటే

టీటీఎఫ్ వాసన్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లాడు. అక్కడ దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌లో ప్రాంక్ వీడియోను చిత్రీకించాడు. క్యూ కాంప్లెక్స్ గేట్లు తెరవడం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. అప్పుడే టీటీడీ అధికారిలా వెళ్లి తలుపులు తెరుస్తున్నట్లు నటించారు వీరు. వారిని అధికారులే అనుకున్న భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ లేచి నిలబడ్డారు. ఇంతలో వాసన్, అతని మిత్రులు నవ్వుకుంటూ వెనక్కి పరుగులు పెట్టడంతో ప్రాంక్ అని అర్థమై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు భక్తులు. అంతేకాకుండా అక్కడకు ఫోన్ ఎలా వచ్చిందని కూడా కొందరు ప్రశ్నించారు.

ఫోన్ సమస్య ఏంటి?

సాధారణంగా తిరుమలలో నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించే ముందే భక్తుల దగ్గర నుంచి ఫోన్‌లు, కెమెరాలు వంటి డిజిటల్ వస్తువులు అన్నింటినీ అధికారులు తీసేసుకుంటారు. నిత్యం శ్రీవారిని దర్శించుకునే లక్షల మంది భక్తులు ఇదే విధంగా తమ ఫోన్లను అక్కడే డిపాజిట్ చేసేసి క్యూ లైన్లలోకి వెళ్తారు. దీనిని తూచా తప్పకుండా పాటిస్తుంది టీటీడీ. అలాంటప్పుడు ఈ ఆకతాయిలు క్యూ లైన్ కాంప్లేక్స్ లోపలికి ఎలా ఫోన్ తీసుకెళ్లాడు? ఫోన్‌తో వీడియోలు చిత్రీకరిస్తున్నా అక్కడ ఉండే సిబ్బంది ఎవరూ చూడలేదా? ఒకవేళ చూసి ఉంటే ఎందుకు అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకోలేదు? అని అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ప్రశ్నలపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతేకాకుండా ఫోన్‌లను లోపలికి అనుమతించకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా తీసుకుంటుందేమో కూడా వేచి చూడాలి.

Tags:    

Similar News