నమ్మలేని నిజాల ‘ఆరంభం’ ఓటీటీ సినిమా రివ్యూ

సమయం కథా వస్తువుగా ‘ఆరంభం’ సినిమా రూపొందింది. మనిషి జీవితంలో జరిగే నమ్మలేని నిజాన్ని తెరకెక్కించారు దర్శకులు అజయ్ నాగ్ వి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

Update: 2024-07-07 02:10 GMT

హత్య కేసులో ఓ గ్రామానికి చెందిన మిగిల్ జైలు జీవితం అనుభవిస్తుంటాడు. రెండున్నర సంవత్సరాలుగా కాలఘాటి కారాగారంలో ఉన్నాడు. ఒక రోజు తన వద్ద ఉన్న డైరీని తోటి ఖైదీ పై నుంచి కిందకు విసిరేస్తాడు. ఎప్పుడూ ఎవ్వరి గురించి పట్టించుకోని మిగిల్ డైరీ విసిరేసిన ఖైదీని చితక్కొడతాడు. పోలీసులు అడ్డుకుని వారిద్దరినీ పక్కకు తీస్తారు. ఇప్పుడేంది ఇల్లు ఖాళీ చేయాలి కదా.. అంతే కదా.. రేపే చేస్తా అంటూ అక్కడి నుంచి జైలు గదికి వెళతారు. మరుసటి రోజు ఉరిశిక్ష అనగా అక్కడ నుంచి అదృశ్యమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచలేదు, గోడలు బద్దలు కొట్టలేదు. ఎలా తప్పించుకున్నాడో జైలు అధికారులకు అర్థం కాలేదు. అంతా తలలు పట్టుకున్నారు. ఎలాగైనా విషయం బయటకు రాకుండా దర్యాప్తు జరిపించేందుకు డిటెక్టివ్ చేతన్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించారు పోలీసులు. అలా రంగంలోకి దిగిన చేతన్, అతని అసిస్టెంట్ కు మిగిల్ రాసిన డైరీ అందుతుంది. మిగిల్ తన డైరీలో జైల్లో తన మొదటి స్నేహితుడు గణేష్ అని వివరిస్తాడు. అందుకే గణేష్ ను టిడెక్టివ్ పిలిపించి విచారించడం మొదలు పెడతారు. వారి ఇన్వెస్టిగేషన్ కథా కమామిషే సినిమా కథ. డైరీ చదువుతూ సినిమా చూపిస్తారు. హంతకులు ఎవరు? ఎందుకు హీరో జైలుకు రావాల్సి వచ్చిందనే అశాలపై సినిమా ముగింపులో తెలుస్తాయి.నమ్మలేని నిజాల ‘ఆరంభం’ ఓటీటీ సినిమా రివ్యూ

Delete Edit

ఈ క్రమంలో డెజావు ప్రయోగం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అసలు డెజావు ప్రయోగం ఏమిటి? ప్రాణాలకు ముప్పు ఉన్న ఆ ఎక్స్‌పెరిమెంట్‌కు నాంది పలికిన ఫ్రొఫెసర్‌ సుబ్రహ్మణ్య రావుతో మిగిల్‌కు ఉన్న సంబంధమేంటి? హీరో జీవితంలో తన తల్లి లీలమ్మ, హీరొఇన్ శారద పాత్రలేంటి? చేతన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎంత వరకు పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ముగింపు ఇచ్చాడు? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

డెజావు నేపథ్యం టైమ్‌ లూప్‌ కాన్సెప్టు తరహాలోనిది. సవాలుతో కూడుకున్న ఇలాంటి చిత్రాలు చాలా తక్కువ సంఖ్యలో రూపొందుతుంటాయి. ఎందుకంటే ఈ కథలు కొందరికి నచ్చుతాయి. మరికొందరికి అర్థం కావు. నచ్చడం వేరు, అర్థం కాకపోవడం వేరు. సినిమా మధ్యలో గతంలోకి వెళ్లి జరిగినదంతా ఒకసారి హీరో చూస్తాడు. జరగబోయేది తెలుసుకుంటాడు. కన్న తల్లి త్వరలో చనిపోతుందని తెలుసుకున్న హీరో ఆమె కోర్కె మేరకు పట్నానికి తీసుకెళ్లి సినిమా చూపించి చిన్నప్పుడు తాగిన షోడా తాపించి ఇంటికి తీసుకొస్తాడు. తల్లి కొడుకు బాంధవ్యం, గతాన్ని, జరగబోయే దాని గురించి తెలిసినప్పుడు బంధాలు, బంధుత్వాలకు హీరో ఇచ్చే విలువ కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. తల్లి కొడుకుపై చూపే ఆప్యాయత, అనురాగం పల్లెల్లో ఎలా ఉంటాయో మనసు లోతుల్లో నుంచి దర్శకుడు బయటకు తీసి చూపిస్తాడు. కన్నడ నవల ‘నీను నిన్నోళగి ఖైదీ’ ఆధారంగా దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

చిత్రమంతా మంచి వాతావరణంలో సాగింది. జైలు కానీ, ఔట్ డోర్ షూటింగ్ స్పాట్స్, పచ్చని చెట్లు, గడ్డి, చల్లని వాతావరణంలో ఊరి అందాలు చాలా బాగా చూపించారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. పాటలు కానీ, డైలాగులు కానీ, మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. డిటెక్టివ్, ఆయన శిశ్యుడి పాత్రలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. వారి ముఖ వర్చస్సు కూడా పేలవంగా కనిపించింది. డిటెక్టివ్ ల ముఖంలో నెక్ట్స్ ఏమి జరుగుతుందోననే ఆత్రుత కనిపించకపోవడంతో వారి పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేక పోయాయి.

మిగిల్‌ బాల్యం, అతడి అమాయకత్వం, ఊరి నేపథ్యం, ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యరావుకు హీరో పరిచయమయ్యే సన్నివేశం ఆకట్టుకుంటాయి. సుబ్రమణ్యరావు తన ప్రయోగం కోసం చూస్తున్న వ్యక్తి కళ్లముందు కనిపించే సరికి ఆయన ముఖంలో ఆనందానికి అవధులు ఉండవు. ప్రయోగం పూర్తి చేసే క్రమంలో భార్యా పిల్లలకు దూరమై ఒక పల్లెటూరును ఎంపిక చేసుకుని అద్దెకు ఇల్లు తీసుకుని ప్రయోగ శాల అక్కడే ఏర్పాటు చేస్తాడు. ఆ ఇంట్లో ఉన్న టీవీ యాంటెనా లాక్కెళుతూ హీరో సైంటిస్ట్ సుబ్రమణ్య రావుకు కనిపిస్తాడు. అప్పటి నుంచి తన ప్రయోగాన్నిమిగిల్ ద్వారా నెరవేరుస్తాడు. పేరుకి సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ అయినా ఎమోషన్స్‌కు పెద్దపీట వేశారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది. మధ్య మధ్యలో చిన్న చరణాలతో మనిషి గిట్టక మానడు అనే అంశంపై పాటలు ఆకట్టుకున్నాయి. మనిషిని చేరక... మరణం ఆగదు.. అంటూ సాగిన గీతం తల్లి చనిపోతుందని తెలిసిన తరువాత తల్లి చావకూడదని, అయినా ఆపలేమని చెప్పే ఆవేదన ఎంతో ఆకట్టుకుంది.

అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. సైన్సు, లాజిక్స్‌ వగైరా గురించి లోతుగా చర్చించకుండా సింపుల్‌గా డెజావు కాన్సెప్ట్‌ని పరిచయం చేశారు. కానీ ప్రొఫెసర్‌ లక్ష్యమేంటన్నది వివరించ కుండానే కన్నుమూస్తాడు. టైమ్‌ ట్రావెల్‌ మూవీస్‌ చూసిన వారికి ఇది కొత్తగా అనిపించకపోవచ్చుగానీ చూడనివారికి కొత్త అనుభూతి ఇస్తుంది. గతాన్ని చెబుతూనే.. మిగిల్‌ గురించి తనకు తెలిసింది డిటెక్టివ్‌లకు గణేశ్‌ వివరించే ఎపిసోడ్‌ని కనెక్ట్‌ చేసిన విధానం మెప్పిస్తుంది. అక్కడ ఎదురయ్యే ట్విస్ట్‌లు సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తాయి. అయితే, కథలో ముందుకెళ్లేకొద్దీ ఆ టెంపో కొనసాగించలేకపోయారు. అనవసర సన్నివేశాలతో సాగదీశారు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అనేలా హీరోయిన్‌, విలన్‌ పాత్రలను క్రియేట్‌ చేశారు. క్లైమాక్స్‌ కర్తికట్టించింది. పలువురితో బాగుందనిపించింది. సైంటిస్ట్ సుబ్రమణ్యరావు కుమార్తె హీరోఇన్ శారద కావడం విశేషం. బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే ఇంటిని వదిలి వచ్చేసిన సుబ్రమణ్యరావు కుమార్తె పెద్దయ్యాక తండ్రి చేస్తున్న ప్రయోగాన్ని తెలుసుకునేందుకు వచ్చి ఉంటుంది.

సమయం అనేది ప్రవహిస్తున్న నది లాంటిది. ఆ నదిపై ఒక వైపు కాలువ తవ్వి గుండ్రంగా తిప్పి తీసుకొచ్చి కాలువ తవ్విన చోటే కలిపితే నదిలో పూర్తిగా ముందుకు సాగకుండా గుండ్రంగా తిరుగుతూ ఎలా గడుపుతామో చెప్పేదే ఈ సినిమా. దీనినే డెజావు కాన్సెప్ట్ అంటారు. ప్రక్రుతి అందాలకు కొదవలేదు. సరదాగా హీరో, హీరోఇన్ గడిపే ప్రాంతంలో మంచు, మిరుగుడు పూలు వాలుతున్నద్రుశ్యాలు ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం. మదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేవు.

ఏ పాత్రలో ఎవరు నటించారు: అమాయకత్వంతో కూడిన మిగిల్‌ పాత్రలో మోహన్‌ భగత్‌ ఒదిగిపోయారు. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ భూషణ్‌ కల్యాణ్‌ ప్రొఫెసర్‌గా, హీరో తల్లిగా సురభి ప్రభావతి ఆకట్టుకున్నారు. ఖైదీగా లక్ష్మణ్‌, డిటెక్టివ్‌గా రవీంద్ర విజయ్‌ ఫర్వాలేదనిపించారు. హీరోయిన్‌ది పెద్దగా చెప్పుకోదగిన పాత్ర కాదు. దర్శకుడు అజయ్‌ నాగ్‌ తొలి ప్రయత్నంలోనే కొత్త పాయింట్‌ని టచ్‌ చేయడం ప్రశంసనీయం.

చిత్రంలో తారాగణం: మోహన్‌ భగత్‌, సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి ముఖ్యులు. సంగీతం: సిన్జిత్‌ యర్రంమిల్లి. ఛాయాగ్రహణం: దేవ్‌దీప్‌ గాంధీ. కూర్పు: ఆదిత్య తివారీ, ప్రీతమ్‌ గాయత్రి, నిర్మాత: అభిషేక్‌ వి తిరుమలేశ్‌. దర్శకత్వం: అజయ్‌ నాగ్‌ వి.

Tags:    

Similar News