సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు
గతంలో ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు.;
By : The Federal
Update: 2025-03-12 07:30 GMT
మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడు పోర్టు వాటాల కేసులో విజయవాడ సీఐడీ రీజినల్ కారాల్యయంలో బుధవారం విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. అయితే విజయసాయిరెడ్డిని ఒక్కరినే అనుమతించిన సీఐడీ పోలీసులు తక్కిన వారిని లోపలికి రానీ లేదు. జయసాయిరెడ్డితో వచ్చిన ఆయన న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించ లేదు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిరెడ్డి మీద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరైన నేపథ్యంలో అటు రాజీయ వర్గాల్లో, ఇటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విచారణలో పోలీసులకు విజయసాయిరెడ్డి ఏమి చెబుతారు? వాటి మీద సీఐడీ పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనే విషయాల మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పాత్ర పోషిస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి మీద దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కాకినాడ సీ పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉండగా, కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ సంస్థ యజమాని కేవీరావును బెదిరించి అక్రమంగా వాటాలు రాయించుకున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల మీద కేవీరావు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ కేసులో ఏ1గా విక్రాంత్‌రెడ్డిని, ఏ2గా విజయసాయిరెడ్డిని, ఏ3గా శరత్‌చంద్రారెడ్డిని చేర్చుతూ సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఇది వరకు ఈడీ చేపట్టిన విచారణకు కూడా విజసాయిరెడ్డి హాజరయ్యారు. ఇదే కేసుకు సంబంధించి విక్రాంత్‌రెడ్డికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే తనపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ మేరకు విజయసాయిరెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన శేష జీవితమంతా వ్యవసాయం చేసుకుంటూ గడుపుతానని వెల్లడించారు.