BHAVANI'S | ఎర్రసంద్రంగా ఇంద్రకీలాద్రి, భవానీలతో కిటకిట

చేతిలో దీపారాదలు, తలపై ఇరుముడులు, మెడలో దండలు, వంటిపై ఎర్రటి వస్త్రాలతో ఓ పద్దతి ప్రకారం నడుస్తూ వాళ్లు వస్తుంటే కనులారా చూడాల్సిందే.;

Update: 2024-12-25 10:12 GMT
చేతిలో దీపారాదలు, తలపై ఇరుముడులు, మెడలో దండలు, వంటిపై ఎర్రటి వస్త్రాలతో ఓ పద్దతి ప్రకారం నడుస్తూ వాళ్లు వస్తుంటే కనులారా చూడాల్సిందే. జై భవానీ.. జై, జై భవానీ..అంటూ వాళ్లు చేస్తున్న జగన్మాత నామ స్మరణ విన్న వారందరూ ఎక్కడికక్కడ ఆగి వినాల్సిందే. డిసెంబర్ 25న విజయవాడ వీధుల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భవానీలతో బెజవాడ కిటకిటలాడుతోంది. ఇంద్రకీలాద్రి జగన్మాత నామస్మరణతో మార్మోగుతోంది.
దీక్ష విరమణకు డిసెంబర్ 25 చివరి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భవానీలు తరలివస్తున్నారు. దీంతో విజయవాడ (Vijayawada)లోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై విపరీతమైన రద్దీ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడుగంటల వరకు సమయం పడుతోంది. జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది.

అమ్మవారి దర్శనం అనంతరం భవానీ ఘాట్‌, పున్నమి ఘాట్‌, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక కేశఖండనశాల వద్ద దీక్షాదారులు తలనీలాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. ఇవాళ పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తం కానుంది.
తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివస్తోన్న భవానీలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి భక్తుల రద్దీ, దర్శనాలు, ఇతర సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
డిసెంబర్ 21వ తేదీ నుంచి దీక్షల విరమణ ప్రారంభిస్తారు. 25వ తేదీ వరకు దీక్షల విరమణ కొనసాగుతుంది. దీక్షల ముగింపు నేపథ్యంలో అగ్ని ప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షణ, భవానీ దీక్షల విరమణ చేపడతారు. డిసెంబర్ 25న ఉదయం పది గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయి.
భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ తరలి రానున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవల్ని రద్దు చేస్తారు. అమ్మవారికి జరిగే సేవల్ని ఏకాంత సేవలు నిర్వహిస్తారు.
Tags:    

Similar News