పెరిగిన మహిళల హత్యలు దేనికి సంకేతం

మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆంధ్రరాష్ట్రంలో పెరుగుతున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాలే ఇందుకు సాక్ష్యం. ఎందుకు ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి.

Update: 2024-12-29 11:37 GMT

మహిళలను అత్యాచారం చేసి హత్యలు చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఈ ఏడాది 49 మంది హత్యకు గురయ్యారు. గత సంవత్సరం హత్యకు గురైన వారి సంఖ్య 40గా ఉంది. పైగా అత్యాచారాలు కూడా జరిగాయి. యువతులను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన సంఘటనలు చూశాం. కర్నూలు జిల్లాలో ఒక విద్యార్థినిని నిలువునా కాల్చి వేశారు. చీరాల వద్ద ఒక యువతిని గ్యాంగ్ రేప్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తలో జరిగిన రేప్ కేస్ ఇది. స్వయంగా హోం శాఖ మంత్రి అక్కడికి నడుచుకుంటూ వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకున్నారు. మట్టి మరకలతో విడిచేసిన బట్టలు వారిని పట్టించాయి.

మరో సంఘటన ఎంత దారుణమంటే కుటుంబంలోని మగ వారిని ఇంట్లోనే కట్టేసి అత్తా కోడళ్లను గ్యాంగ్ రేప్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఉన్నారు. చట్టం ఉంది. నేరం చేస్తే శిక్ష తప్పదని తెలుసు. అయినా దోపిడీకి పాల్పడి ఆడవారిని భర్తల కళ్లముందే ఇంట్లోనే రేప్ చేశారంటే సభ్య సమాజం కాదు, సభ్యత కలిగిన ప్రభుత్వం తలదించుకోవాలి. ఇంతటి ఘోరాలు పెరుగుతూ పోతున్నాయి. గత సంవత్సరం కంటే మహిళల హత్యలు 22.5 శాతం పెరిగాయి. హోం శాఖ మంత్రి ప్రత్యర్థులపై చూపించే ఆవేశం నేరస్తులపై చూపించడంలో వెనుకపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చెబుతున్న హోం మంత్రి హత్యలు జరుగుతుంటే ఎందుకు నివారించలేకపోయారనేది చర్చగా మారింది. పైగా మహిళలు అత్యాచారాలు, హత్యలకు గురయ్యారు. హోం మంత్రి కూడా మహిళే కావడం విశేషం.

మాదక ద్రవ్యాల మత్తులో కొందరు మహిళపై నేరాలకు పాల్పడితే మరి కొందరు దోపిడీలకు వచ్చి మహిళలపై అత్యాచారం, హత్యలు చేశారు. ప్రేమ పేరుతో కొందరు యువతులను కాల్చి చంపారు. ఎంత దారుణం. ఇంతటి ఘోరాలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని నడిపించే వారికి నిద్ర ఎలా పడుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా? ప్రజలకు బాధ్యత లేదా? అనే వాదన కూడా ఉంది. ప్రజలకు ఆ జానమే ఉంటే సమాజం ఇలా ఎందుకు ఉండేది. మహిళలు పూజింప బడేవారు. ఇలా హత్యలకు గురయ్యే వారు కాదు. అందుకే కదా పోలీస్ ఉంది. నేర పరిశోధనకు సహకరించేందుకు ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వారు మఫ్టీలో ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. వారు గుర్తిస్తున్నది ఏమిటి? జర్నలిస్ట్ ల వద్దకు వచ్చి ఎక్కడ ఏమి జరిగింతో తెలుసుకుని ప్రభుత్వానికి రిపోర్టు చేసే పరిస్థితికొచ్చారంటే ఇబ్బంది కరంగా ఉండక ఎలా ఉంటుందనే విమర్శలు కూడా పోలీస్ శాఖపై ఉన్నాయి.

మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీస్ విభాగం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ శాంతిభద్రతలపై నిత్యం ఉంటుంది. హోం మంత్రి నిత్యం పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతుంటారు. అయినా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది చిన్న పిల్లలు అత్యాచారాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. నేరస్తులుగా మారుతున్న వారు యువకులే కాకుండా నడి వయస్కులు కూడా ఉండటం విశేషం. ఇవన్నీ పరిశీలిస్తే పోలీసుల నిఘా గ్రామాల్లో అసలు ఉండటం లేదు. కొన్ని పంచాయతీల్లో పోలీసులు కేసులు వచ్చినప్పుడు తప్ప అక్కడికి వెళ్లిన దాఖలాలు లేవు. కొట్లాటలో, హత్యలో, అత్యాచారాలో జరిగిన కేసు రిజిస్టర్ అయితే అప్పుడు మాత్రమే ఆ గ్రామానికి పోలీసులు వెళుతున్నారు. అప్పుడప్పుడూ పోలీసులు గ్రామాల్లో కనిపించి అక్కడి పెద్దలతో అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడితే క్రైం చేసే వారిలో భయం పెరుగుతుంది. అటువంటివి లేకపోవడం కూడా నేరాలు పెరిగేందుకు కారణాలని నేర నియంత్రణ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News