అయ్యయ్యో.. చేతిలో సీటూ పోయేనే! ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ల దారెటు?
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.... తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు టిడిపి ఉత్తరాంధ్ర సీనియర్ నేతల సీటు కిందకు నీళ్లు తెచ్చి పెట్టింది.;
By : The Federal
Update: 2024-02-29 09:37 GMT
(తంగేటి నానాజీ విశాఖపట్నం)
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.... తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు టిడిపి ఉత్తరాంధ్ర సీనియర్ నేతల సీటు కిందకు నీళ్లు తెచ్చి పెట్టింది. నిన్నటి వరకూ పార్టీ టికెట్ తమకేనన్న ధీమాతో ఉన్న టీడీపీ మాజీ మంత్రులూ, మాజీ ఎమ్మెల్యేలూ ఇప్పుడు ఆ ధీమాను కోల్పోయి ఆందోళన చెందుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... పొత్తులు ఎత్తులపై పార్టీలు తలమునకలైపోయాయి. ఇందులో భాగంగా జనసేన టిడిపి మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాల్లో జనసేన మిగిలిన 151 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది. ఇంతవరకు బాగానే ఉంది అయితే అత్యధిక స్థానాలు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి తమకు కావాలంటూ జనసేన టిడిపిని కోరింది. అందుకు టిడిపి అంగీకారం తెలపడంతో జనసేన, తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల తొలి జాబితా ఇటీవల విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల నుంచి 24 మందిని ప్రకటించారు. జనసేన 24 సీట్లు గాను ఐదు సీట్లు ప్రకటించగా అందులో నాలుగు స్థానాలు ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల నుంచే కావడం విశేషం.
ఈ జిల్లాలపైనే జనసేన గురి...
తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేన ఉత్తరాంధ్ర , ఉభయగోదావరి జిల్లాల నుంచే ఎక్కువ సీట్లు కోరింది. జనసేన తొలి జాబితాలో అనకాపల్లి, విజయనగరం, కాకినాడ రాజమండ్రి స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడత జాబితాలో ప్రకటించేందుకు విశాఖ ఉమ్మడి జిల్లాలోని పెందుర్తి,విశాఖ ఉత్తర, దక్షిణ, భీమిలి, గాజువాక, యలమంచిలి, , పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు సీట్లను కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటిలో పెందుర్తి, భీమిలి పై గట్టి పట్టు పట్టినట్లు చెబుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో పట్టు వున్న టీడీపీ సీనియర్లు తాజా పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణ ,మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జి, పీలా గోవింద్ నియోజకవర్గాల్లోనే గందరగోళం నెలకొనడంతో వారు భవిష్యత్ ప్రణాళిక ఏమిటనేది ఆసక్తిగా మారింది.
భీమిలిలో గంటా గల్లంతేనా ..
భీమిలి నియోజకవర్గంలో అటు జనసేన తరఫున, ఇటు టీడీపీ తరఫునా నేతలంతా క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి మరోసారి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. టీడీపీ నేత కోరాడ రాజబాబు తన కు అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్నారు. మరోవైపు టీడీపీ నుంచి నారా లోకేష్ లేదా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. భీమిలి నియోజకవర్గం కావాలని జనసేన మొదటి నుంచీ పట్టు పడుతోంది. ఇటీవలే వైసీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్, జనసేన యువ నాయకుడు పంచకర్ల సందీప్ ఎవరికి వారే తమ రాజకీయ భవిష్యత్తును ఇక్కడే ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ తానూ భీమిలి నుంచే పోటీ చేయ్యడానికి తొలిప్రాధన్యత అని ఈ మేరకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా వున్నారని చెప్పుతున్నారు. ఒక వేళా భీమిలి జన సేనకు కేటాయియిస్తే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కు ఇక్కడ సీట్ గల్లంతు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్స పై పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
గాజువాకలో పల్లా కు చుక్కెదురే....
పొత్తులో భాగంగా గాజువాక సీటు జనసేనకు ఇస్తే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు టికెట్ గోవిందా అని అంటున్నారు. పల్లాకు వేరే సీటు ఇస్తారా? లేదా అనేది క్లారిటీ రావాలి. ఇన్నాళ్లుగా పార్టీలో కీలగంగా ఉన్న తన పరిస్థితి ఏమిటని పల్లా శ్రీనివాసరావు మండిపడుతున్నారు. నియోజకవర్గాన్ని వదులుకుంటే ఇక రాజకీయాల్లో పక్కకు తప్పుకోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ... గాజువాక సీటును వదులుకునేది లేదని చెబుతున్నట్టు సమాచారం. గాజువాక నుంచి మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అంటున్నారు.ఐతే గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు.
విశాఖ దక్షిణంలో బాబ్జీకి"గండి"
విశాఖ దక్షిణంలో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వ్యవహరిస్తున్నారు. పెందుర్తి టికెట్ ఆశించిన ఆయనను విశాఖ దక్షిణంలో పోటీ చెయ్యడానికి అధిష్టానం హామీ ఇచ్చి ఇక్కడికి పంపించారు. రెండేళ్లుగా ఆయన ఇక్కడ పూర్తి సమయం కేటాయించుకొని కష్టపడుతున్నారు.సొంత నియోజకవర్గం కాకపోయినా స్థానిక నేతలు అందరినీ కలుపుకొని వెళ్తూ ,పాదయాత్ర లు చేస్తూ ఈ ఎన్నికల్లో విజయం కోసం బాటలు వేసుకొంటున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన తరఫున విశాఖ దక్షిణం నుంచి పోటీ చెయ్యడానికి పావులు కదుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద వంశీ కృష్ణ విశాఖ దక్షిణం టికెట్ అడిగారని ఆ పార్టీ ఇన్సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన తరఫున వంశీకి సీటిస్తే బాబ్జీ పరిస్థితేంటంటూ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
పెందుర్తిలో బండారు నెత్తిన బండ....
మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరాక పెందుర్తి పరిధిలో అనేక కార్యక్రామాలు చేపడుతున్నారు.. పార్టీ తరఫున నిరంతరం శ్రమిస్తున్నారు. బైక్ ర్యాలీ, కారు ర్యాలీ అంటూ పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పరిస్థితేంటో అర్థం కావడం లేదు. జనసేన`టీడీపీ పొత్తులో భాగంగా పంచకర్లకు సీటిస్తారా.. ఆయన్ను మరోచోటకు పంపించి బండారుకే సీటిస్తుందా అని రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. ఒక వేళ జనసేనకు పెందుర్తి కేటాయిస్తే బండారు పరిస్థితేంటి?టీడీపీ స్థాపించిన నాటి నుంచీ పార్టీలో వున్న బండారు సత్యనారాయణ కు టికెట్ నిరాకరించేంత సాహసం చంద్రబాబు చేస్తారా?లేదా బండారు ను వేరే నియోజకవర్గానికి పంపిస్తారా అనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు పాడేరు, యలమంచిలి నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ,`జనసేన నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురు చూస్తున్నారు.