ఎవరీ నీహారిక, ఆమెకు ఎందుకిస్తున్నారు టికెట్!

తిరుపతి ఎంపీ స్థానం ఏ పార్టీకైనా అత్యంత ప్రతిష్టాత్మకం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన తిరుపతిలో సరైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఇరుపార్టీలు భావిస్తున్నాయి.

Update: 2024-02-03 04:40 GMT
మాజీ ఐఎఎస్‌ రత్నకుమారి కుమార్తె నిహారిక

తిరుపతి ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారుతోంది. సిట్టింగ్‌ ఎంపీని మార్చే ప్రయత్నంలో అధికార వైసీపీకి ఝలక్‌ తగలగా... ప్రతిపక్ష టీడీపీ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలో తేల్చేకోలేక తర్జనభర్జన పడుతోంది. గతంలో ఈ సీటును మిత్రపక్షాలకు వదిలేసిన టీడీపీ... ఈ సారి స్వయంగా పోటీచేయాల్సిన పరిస్థితి ఉండటంతో సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది.

తిరుపతి ఎంపీ స్థానం ఏ పార్టీకైనా అత్యంత ప్రతిష్టాత్మకం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన తిరుపతిలో సరైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ డాక్టర్ గురుమూర్తి విషయంలో వైసీపీ చేసిన ప్రయోగం విఫలమవడంతో వెనక్కు తగ్గింది. ఇన్‌చార్జుల మార్పుచేర్పుల్లో భాగంగా ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించి.. అక్కడి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ముందు ప్రకటించింది. ఐతే ఆదిమూలం ఎంపీగా పోటీచేసే ఆలోచనలేకపోవడంతో వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి... టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో అధికార వైసీపీ ఉలిక్కిపడి.. మళ్లీ సిట్టింగ్‌ ఎంపీ గురుమూర్తినే ఇన్‌చార్జిగా నియమించి తలనొప్పి వదిలించుకుంది. వాస్తవానికి ఎంపీ గురుమూర్తి మళ్లీ లోక్‌సభకే పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, ఆయన్ను సత్యవేడు ఇన్‌చార్జిగా నియమించింది పార్టీ. ప్రస్తుతం పార్టీ నిర్ణయం మారడంతో ఎంపీ గురుమూర్తి హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు.

ఇక లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. నిజానికి తిరుపతి ఎంపీ సీటుపై చంద్రబాబునాయుడికి తొలి నుంచి పెద్దగా ఆసక్తి లేదని చెబుతున్నారు. గతంలో అనేకసార్లు పొత్తుల్లో భాగంగా తిరుపతి సీటును బీజేపీకి వదిలేసేవారు చంద్రబాబు. ఈ సారి కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని తొలుత భావించడంతో ఇన్నాళ్లు.... తిరుపతిపై పెద్దగా ఫోకస్‌ చేయలేదు. ఐతే కమలంపార్టీతో పొత్తుపై పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తుండటం... బీజేపీతో పొత్తు ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు.

పార్టీ అభ్యర్థి అన్వేషణలో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె నిహారిక పేరు తెరపైకి తీసుకువస్తోంది టీడీపీ. రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేయగా, నిహారిక అత్తవారి కుటుంబానికి టీడీపీతో సంబంధాలు ఉండటంతో ఆమె పేరు సీరియస్‌గా పరిశీలిస్తోంది. మాజీ ఎంపీ తలారి మనోహర్ చిన్న కుమారుడి భార్యే నిహారిక. తలారి మనోహర్ గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పని చేశారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, సత్యవేడు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. ఈయన పెద్ద కుమారుడు తలారి ఆదిత్య 2014లో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నిహారిక కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతోందని టీడీపీ.. ఇక బీజేపీ కూడా తిరుపతి నుంచి పోటీ చేయాలని చూస్తున్నా.. ఇంతవరకు సరైన అభ్యర్థి ఎవరూ లభించలేదని చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను పోటీలో పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి పొత్తులు పక్కన పెట్టి వైసీపీ, టీడీపీతో ఢీకొట్టడానికే బీజేపీ మొగ్గుచూపడం ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News