రాజకీయాల్లోకి రావడం ఎందుకు.. పోవడం ఎందుకు?
జీవితాంతం కష్టపడి సంపాదించింది ఒకెత్తయితే.. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సంపాదించేది మరో ఎత్తు..;
ప్రజలకు ముక్కు ముఖం తెలియని వారు నేడు రాజకీయాల్లోకి వస్తున్నారు. అన్నీ బాగుంటే ఉంటున్నారు. వారికి సరిపడలేదంటే వెళ్లిపోతున్నారు. నాయకులు కూడా బాగా డబ్బులు ఎవరు ఖర్చు పెడతారో చూసి టిక్కెట్ ఇస్తున్నారు. డబ్బు ఖర్చుపెట్టిన వారు ఆ డబ్బును రాబట్టుకొనేందుకు ప్రజలను వాడుకుంటున్నారు. ఇదీ నేటి రాజకీయం. ఇది అందరికీ తెలియదని కాదు. ప్రతి ఒక్కికీ తెలుసు.
డబ్బు సంపాదించుకోవడానికి సులువైన మార్గం రాజకీయం. ఎందుకంటే పవర్ ను అడ్డం పెట్టకుని, అధికార యంత్రాంగం చేత తప్పులు చేయిస్తూ నేతలు అడుగులు వేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారు అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించారా? అంటే దానికంటే ముందు నాయకులు కోట్లు సంపాదించేందుకు అవసరమైన ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. అందుకే వారు ఇరుకున పడుతున్నారు. అలా సంతకాలు పెట్టకుంటే వారికి పోస్టింగ్ లు ఇవ్వటం లేదు. ఉదాహరణకు నేడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ వద్ద పనిచేసినంత మాత్రాన ఒక ఐఏఎస్ అధికారి సీఎం కు బొకే ఇస్తే తీసుకోరా? పైగా పక్కకు తోసేస్తారా? ఇదేనా నేతలకు ఉండాల్సిన మనస్సు. ఇలా అన్నీ చేయగలిగిన వాళ్లే రాజకీయాల్లో రాణించ గలుగుతున్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో అధికారులు పావులుగా మారారు. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్న నేతలు కాస్త నొప్పి తగిలిందంటే ఎవ్వరికీ తెలియకుండా తప్పుకుంటున్నారు. ఈ నాయకుడు ఎందుకు తప్పుకున్నారని ప్రజలు ఆరా తీసేలోపులో మరో పార్టీలో చేరటమో, లేదంటే అధికారం పక్కకు వెళ్లటమో .. లేదా ఎవ్వరికీ కనిపించకుండా పోవడమో చేస్తున్నారు నేతలు. గత ప్రభుత్వంలో పవర్ వెలగబెట్టిన కొంత మంది నేడు కనిపించకుండా పారిపోయారు. అందుకు కారణాలు ఉన్నాయి. నేటి ప్రభుత్వం వారి వెంటపడటం ప్రధాన కారణం. అందుకే వారు ఆ నియోజకవర్గ ప్రజలకు కనిపించకుండా పోయారు.
కాబట్టి రాజకీయాల్లోకి రావడం, పోవడం సాధారణమైంది. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ నాయకులపై వేధింపులు మామూలై పోయాయి. వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టే వరకు ఆయన ప్రజల మనిషి కాదు. అడుగు పెట్టిన తరువాత కూడా ప్రజల మనిషిగా అధికారం చెలాయించలేక పోయారు. అందుకే రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. ప్రజల మధ్య తిరుగుతూ, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటే ఆ నాయకుడి గుండె లోతుల్లో ప్రజల గురించిన భావనలు, వారికి ఎలా మేలు చేయాలనే ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా పైపైన రాజకీయాల్లోకి వచ్చి పైపైన ఉన్నన్ని రోజులు ఉండి ఇబ్బందులు ఎదురవుతున్నాయనగానే కనిపించకుండా వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.
పోరాడే సత్తా ఇటువంటి వారిలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు డబ్బు సంపాదన పైనే దృష్టిపెట్టి ఉంటున్నారు. ప్రజల గురించి ఆలోచించి పనులు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలైతే ఎంతవరకైనా పోరాడ వచ్చు. అలా కాకుండా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వారి పోరాటం ఇలాగే ఉంటుందని స్పష్టమవుతోంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న పరిశీలకులు కూడా నేతల మనోభావాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.
జగన్ కు అన్నీ చెప్పాను. వారి కుటుంబంపై నాకు ఎంతో గౌరవం ఉంది. అంటూనే ఇంత అర్జెంట్ గా రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు. ఒక వేళ రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి భావించారే అనుకుందాం. జగన్ లండన్ నుంచి వచ్చిన తరువాత రాజీనామా లెటర్ ను ఆయన చేతికి ఇవ్వొచ్చు. ఇప్పటికిప్పుడు రాజీనామా లేఖ ఇవ్వకపోతే ఏదో జరుగుతుందనే కదా ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంటే తప్పకుండా ఇది ప్రేరేపిత రాజీనామా అయి ఉంటుందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు.