మండలిని కాదని నాదెండ్లకే పవన్ తొలి బీఫారం ఎందుకిచ్చారు?

తొలి బీఫారమ్‌ను పవన్ కల్యాణ్.. నాదెండ్ల మనోహర్‌కే ఎందుకు ఇచ్చారు? పార్టీ కేడర్‌లో దీనిపై ఎందుకు భారీ చర్చ జరుగుతుందంటే..

Update: 2024-04-17 10:24 GMT

జనసేన తరఫున 21 మంది పోటీ చేస్తుంటే తొలి బీ–ఫారం తెనాలి నుంచి పోటీ చేస్తున్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు అందించారు ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. తొలి బీ–ఫారం నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంపై పార్టీ కార్యాలయంలో ఆసక్తికర చర్చ సాగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేస్తోంది. అభ్యర్థులందరికీ పవన్‌ బీ-ఫారాలు అందించారు.

రేపటి నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ–ఫారాలు అందించారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొందని పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఓట్లు చీలకుండా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డామని.. ఎలాగైనా రాక్షస పాలనను అంతమొందించాలని అన్నారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని అభ్యర్థులతో పవన్‌ కళ్యాణ్‌ ప్రతిజ్ఞ చేయించారు.

ప్రతిజ్ఞ ఇదే..

‘‘మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగరతీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్‌. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకీ తిప్పలు తప్పడం లేదు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలయింది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి, మళ్లీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగు వారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య–ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణకు భూమిక సిద్దం చేయడమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన–బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి గెలుపే కర్తవ్యంగా కృషిచేస్తానని, మన పార్టీ నియమ–నిబంధనలకు కట్టుబడుతూ, కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతిమాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అని అందరి అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

గతంలో గెలిచిన ఒక అభ్యర్థి కూడా ఇలానే ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీ పక్షాన చేరిన నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పార్టీ ఫిరాయించే వ్యక్తి శాసనసభ్యత్వం రద్దు అయ్యేలా చూడాలని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

నాదెండ్ల మనోహర్‌కే ఎందుకు?

నాదెండ్ల మనోహర్‌కి తొలి బీ-ఫారం అందించడం పట్ల పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ సాగింది. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. అయినా పవన్‌ కల్యాణ్‌.. నాదెండ్లకే తొలి ఫారం అందించారు. పార్టీలో ఇటీవలే చేరిన అవనిగడ్డ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కి తొలి బీ-ఫారం అందిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మండలి కన్నా నాదెండ్ల మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌కి కుడి భుజంగా పని చేశారు. అనేక విమర్శలు, ఆరోపణలు ఉన్నప్పటికీ పవన్‌ వాటినేమీ పట్టించుకోకుండా నాదెండ్లకే పెద్దపీట వేశారు. నాదెండ్ల స్పీకర్‌గా పని చేస్తే మండలి బుద్ధ ప్రసాద్‌ డెప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. రాజకీయాల్లో మండలి సీనియర్‌ అయినా పార్టీలో జూనియర్‌ కావడం, టీడీపీలో టికెట్‌ దొరక్కపోతే జనసేన టికెట్‌ దొరకడం వంటి అనేక కారణాలు మండలి సీనియారిటీని గుర్తించక పోవడానికి కారణమై ఉండవచ్చు. పైగా విధివిధానాల రూపకల్పనలో నాదెండ్ల మొదటి నుంచి పవన్‌ వెన్నంటి ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆలోచించే తీరు నాదెండ్లకే తెలుస్తుంది గనుక ఆయనకే ప్రాధాన్యత ఇచ్చారు.

Tags:    

Similar News