Land|రీ సర్వేను ప్రభుత్వం ఎందుకు మళ్లీ స్టార్ట్ చేసింది?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదం పొందింది. తిరిగి ఈ నెల నుంచి ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది.;

Update: 2025-01-18 04:00 GMT

ప్రభుత్వం రీ సర్వే తిరిగి ఎందుకు ప్రారంభించింది? భూమి హక్కు పత్రాలు (Land Title) గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సర్వే పూర్తయిన భూమి యజమానులకు అందించింది. సుమారు 6,688 (40 శాతం) గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలోనే రీ సర్వే జరిగింది. సర్వే చేసినంత వరకు టైటిల్ కూడా అప్పటి ప్రభుత్వం అందించింది. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వేల ఎకరాలు వైఎస్సార్సీపీ వారు దోచుకున్నారని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఆరోపించారు. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వే తప్ప ఆ తరువాత సర్వేలు ఇంతవరకు పూర్తి స్థాయిలో జరగలేదు. కరణం, మునసబుల వ్యవస్థ ఉన్నప్పుడు రికార్డులు వారి ఇష్టం వచ్చినట్లు మార్చారు. వారు మార్పులు, చేర్పులు చేసిన రికార్డులు చాలా మంది విలేజ్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ (విఏఓ) లకు ఇవ్వలేదు. ఆ తరువాత విఏఓ ల స్థానంలో విఆర్ఓ లు వచ్చారు. వారి వద్ద కూడా సరైన రికార్డులు లేవు. అందరికీ బ్రిటీషర్లు తయారు చేసి ఉంచిన రికార్డులే ప్రామాణిక మయ్యాయి.

కేంద్రం ఆదేశాల మేరకే రీ సర్వే...

దేశ వ్యాప్తంగా రీ సర్వే నిర్వహించి భూమి హక్కు దారులకు టైటిల్ ఇవ్వాలని, ఇకపై భూ వివాదాలు లేకుండా చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మరొక వెసులు బాటును కూడా రాష్ట్రాలకు కల్పించింది. రీ సర్వే అనేది రాష్ట్రాల ఇష్టమని చెప్పింది. దీని వల్ల కొన్ని రాష్ట్రాల్లో రీసర్వే జరగలేదు. కొన్ని రాష్ర్రాల్లో రీ సర్వే పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ప్రకారం భవిష్యత్ లో భూమి సమస్యలు రాకుండా ఉండాలనేది ప్రధానమైన ధ్యేయం. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది.

రకరకాల పేర్లతో భూములు..

చాలా చోట్ల భూములకు రకరకాల పేర్లు ఉన్నాయి. బ్రిటీష్ వాళ్లు కేవలం పన్ను వసూలు చేసుకునేందుకు అప్పట్లో భారతీయులకు కాగితాలపై రాసి ఇచ్చారు. ఆ ప్రకారం తమకు రాసి ఇచ్చిన భూమిలో రైతులు సాగు చేసుకుని పన్ను కట్టే వారు. జనాభా తక్కువ, భూమి ఎక్కువగా ఆ రోజుల్లో ఉన్నందున సాగు చేసుకునే వారికి కేటాయించిన భూములు పట్టా భూములు గాను, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో కొన్నింటిని బంజరు భూములని, గ్రామాలు నిర్మించుకున్న చోట గ్రామ కంఠం భూములని, వాగుల వద్ద వాగు పోరంబోకు భూములు, చెరువు తొట్టు ప్రాంతాల్లోని భూములను చెరువు పోరంబోకు భూములు, దేవాలయాలకు కేటాయించిన భూములు దేవదాయ భూములుగా రికార్డుల్లో రాసుకున్నారు. కొన్ని చోట పశువుల బీళ్ల కింద రాశారు. వారు సర్వే చేసే సమయంలో భూములపై రైతులు లేకుంటే ఆ భూముల సర్వే నెంబర్ల వద్ద పెన్నుతో చుక్కలు పెట్టి వదిలేశారు. వాటిని చుక్కల భూములుగా పిలిచారు. కొన్ని వివాదాల్లో ఉన్న భూములను 22ఎ భూములుగా విడగొట్టారు. ఇలా ఒక్కో రకానికి ఒక్కో విధంగా పేర్లు ఉండటం, ఈ తేనె తుట్టెను కదిపితే ఎవరిని కుడుతుందోననే భయంలో ఇప్పటి వరకు పాలకులు ఆ వ్యవహారాల జోలికి పోలేదు.

అన్ని అవసరాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలే..

రైతుల ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకం ఆధారంగా ప్రభుత్వం వైపు నుంచి ఏమి చేయాలో వారికి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయం కూడా పాస్ పుస్తకాల ద్వారానే జరుగుతోంది. మిగిలిన వివిధ రకాల భూములను ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ వస్తున్నారు. ఉదాహరణకు చుక్కల భూములు ఉన్నాయి. ఆ భూములు ఎవరివో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఆక్రమించి సాగులో ఉంటే వారికి పట్టా ఇచ్చేందుకు కూడా సాధ్యం కాని పరిస్థితులు వచ్చాయి.

వివాదాలు పరిష్కరించేందుకే రీ సర్వే

భూ సమస్యలు పరిష్కరించాలంటే రీ సర్వే చేయక తప్పటం లేదు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు గత ప్రభుత్వం రీ సర్వే మొదలు పెట్టింది. సర్వే జరుగుతున్న సమయంలో ఒకరి భూమి మరొకరి భూమిలో కలిసిందంటూ సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలు పరిష్కరించేందుకు తహశీల్దార్ స్థాయి నుంచి ఏ అధికారి ఎలా చర్యలు చేపట్టాలో గత ప్రభుత్వ హయాంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. రెవెన్యూ డివిజినల్ అధికారి వద్ద ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమ సమస్యను అర్జీరూపంలో రాసి ఇచ్చి ఆర్డీవో ఇచ్చిన తేదీ ప్రకారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టుకు తమ లాయర్ తో హాజరై పరిష్కరించుకోవచ్చు. లేదా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ వద్ద పరిష్కరించుకోవచ్చు. అలా పరిష్కారం కాకుంటే జిల్లా కోర్టుకు కూడా వెళ్లవచ్చు. అన్ని అభ్యంతరాలు పూర్తయిన తరువాతనే టైటిల్ ఇస్తారు. ఒకసారి టైటిల్ ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఈ భూ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పరిష్కారం కాకుంటే హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. ప్రాథమికంగా సర్వే దశలో అన్ని స్థాయిల్లోనూ సమస్యను పరిష్కరించుకునేందుకు భూ యజమాని ఫైట్ చేసే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఏమి చెప్పారు?

రీ సర్వే చేయడంలో మోసం జరుగుతోందని, ల్యాండ్ టైటిల్ ఇచ్చిన తరువాత హైకోర్టుకు వెళ్లాలంటే సామాన్యుడికి సాధ్యమయ్యే పని కాదని, అందువల్ల ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదే విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల హామీగా ఇచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు పేదల భూములు దోచుకుంటున్నారని, ఆ భూములు కూడా తిరిగి రైతులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన ప్రకారం ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రకటించారు. ఆ మేరకు చట్టం రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశ పెట్టారు. రద్దయిందని అందరూ భావించారు.

రీ సర్వే  రీ స్టార్ట్ ఎందుకు?

గత ప్రభుత్వం 40 శాతం రీ సర్వే చేసిన తర్వాత కూటమి అధికారంలోకి రాగానే సర్వే ఆగిపోయింది. తమ భూములు గతంలో ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారని పలువురు ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం రీ సర్వేను రీ స్టార్ట్ చేసింది. సర్వే పూర్తయిన తరువాత ఎవరి భూములకు ఎంతవరకు హద్దు ఉందో రాళ్లు పాతి నిక్కచ్చి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ భూములు కూడా సర్వేలో తేలుతాయి. ఎవరి ఆక్రమణలోనైనా ఉంటే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ రైతుకు ఆ భూమిని ఇవ్వాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. గతంలో రీ సర్వే తప్పయి నప్పుడు ఇప్పుడు తప్పు కాకుండా ఎలా ఉంటుందనేది పలువురు సర్వే నిపులు (రిటైర్డ్ అయిన వారు) చెబుతున్న మాట. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం. అమలు చేస్తే దానిని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. లేదంటే ఆపి వేయాలి. ఆపివేస్తే ఇకపై కానీ, ఇప్పుడు కానీ భూమి సర్వేకు కేంద్రం డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు రీ సర్వే పూర్తి చేస్తే అందుకు అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుంది. గత ప్రభుత్వం నిర్వహించిన 40 శాతం సర్వే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించింది.

ప్రభుత్వం ఏమి చెబుతోంది?

వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రీ సర్వేను తక్కువ వ్యవధిలో ఏకపక్షంగా నిర్వహించారని, భూముల విస్తీర్ణం తగ్గించి హద్దులు మార్చేశారని ఆరోపించింది. హక్కు పత్రాల్లో తప్పులు దొర్లాయని రైతులు పెద్ద ఎత్తున వినతులు అందించినట్లు చెబుతోంది. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నాం. అందుకే ఆ రైతులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించిన తరువాతే రీ సర్వే ఆ భూముల్లో చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ప్రస్తుత ప్రభుత్వానికి ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, విడిగా మంత్రులకు 2,80,632 వినతులు వచ్చాయని, అందులో 1,80,000 వినతులు పరిష్కరించినట్లు సంబంధిత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భూ హక్కు పత్రాల్లో ప్రస్తుత యజమాని పేరు కాకుండా పాత వారి పేర్లను నమోదు చేశారని కూటమి నాయకులు చెబుతున్నారు. ఆధార్, ఫోన్ నెంబర్లు కూడా మర్చారని, కొన్ని హక్కు పత్రాల్లో భూముల స్వరూపం కూడా మారిందని, ఈ సమస్యలపై వచ్చిన అర్జీలను తీసుకుని ప్రభుత్వం పరిష్కరించే వైపుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఇప్పటికే 40 శాతం సర్వే పూర్తి..

రాష్ట్రంలో 16,816 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 6,688 (40 శాతం) గ్రామాల్లో రీ సర్వే జరిగింది. గ్రామాల్లో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి సర్వే బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో జరిగిన సర్వేలో లోపాలను పరిష్కరించి తిరిగి రీ సర్వే మొదలు పెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ముందుగా ప్రభుత్వ భూముల్లో సర్వే చేయాల్సిందిగా ఆదేశించామని, భూమి యజమానులకు నచ్చజెప్పి మిగిన భూముల సర్వే కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వచ్చిన సమస్యలు రాకుండా రీ సర్వే చేసి టైటిల్ ఎలా ఇస్తారేది ప్రస్తుతం భూ యజమానులను వేధిస్తున్న ప్రశ్న. ఈనెల 10 నుంచి సర్వే మొదలై కొనసాగుతోంది.

Tags:    

Similar News