ఏపీలో మద్యం పాలసీపై ఉరింపులు ఎందుకు?
మద్యం పాలసీని ప్రకటించకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా ఊగిసిలాడుతూనే ఉంది. దీంతో కొత్త బ్రాండ్లు వస్తాయన్న మందు ప్రియులకు నిరాశ తప్పడం లేదు.
అదిగో.. ఇదిగో.. కొత్త మద్యం పాలసీ వస్తుంది, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి, రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్ ధరల నిర్థారణ వంటి పలు విధానాలు ఉంటాయని చెబుతున్న ప్రభుత్వం, దుకాణాలు ప్రభుత్వం నిర్వహణలో ఉంటాయా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా? అనేది మాత్రం ఇంత వరకు నిర్థారించ లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది. షాపుల్లో స్టాక్ అయిపోగానే కొత్త మద్యం బ్రాండ్లు మార్కెట్‌లోకి వస్తాయని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. నూతన మద్యం విధానంపై అధ్యయనం చేస్తున్నమని చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు నెలలు పూర్తి అయినా మరో నెల రోజులు పడుతుందని చెబుతోంది. మొత్తానికి నూతన మద్యం పాలసీ అక్టోబరు 1 నుంచి అమలలోకి వస్తుందన్నారు. ఆ పాలసీ ఎలా ఉంటుందో అనేది స్పష్టం చేయడం లేదు. ఇదీ ఇప్పుడు మద్యం ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాలసీ ప్రకటించకుండా, పాత బ్రాండ్లు మార్కెట్లోకి వస్తాయో.. రావో చెప్పకుండా, ఎందుకు ఈ అధ్యయనాలు అనేది మద్యం ప్రియులను వెంటాడుతున్న ప్రశ్న.