కాపు యువతకు చేగొండి హరిరామ జోగయ్య ఎందుకు టార్గెట్ అయ్యారు?
ఉరుమురిమి మంగలం మీద పడింది. పవన్ కల్యాణ్ చేవిలో జోరిగగా మారిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను చీల్చిచెండాడుతోంది కాపు యువత.;
ఉరుమురిమి మంగలం మీద పడింది. పవన్ కల్యాణ్ చేవిలో జోరిగగా మారిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను చీల్చిచెండాడుతోంది కాపు యువత. కాపులు, కాపు సామాజికకాంక్ష అంటూ లేఖాస్త్రాలు సంధించిన చేగొండిపై కాపు యువకులు సెటైర్లు పేలుస్తూ కొందరు ధర్మాగ్రహం, మరికొందరు అధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడంతో కాపు యువత ఆగ్రహం తారాస్థాయికి చేరింది. కాపుల్ని ఎవరు మోసం చేశారో.. నిజ స్వరూపాలు ఇప్పుడు బయటపడుతున్నాయని కాపు సంఘాల నేతలు ధ్వజమెత్తారు. మరోపక్క, ‘చంద్రబాబు కోపాన్ని తన కోపంగా మార్చుకుని ప్యాకేజీలో భాగంగా బాబును ఇంప్రెస్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. పవన్ నిజాయితీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయనకు నిజాయితీ ఉందా? పవన్ ఎప్పుడైనా తాను చెప్పిన మాట మీద నిలబడ్డారా? మాట మార్చకుండా కుండా ఉన్నారా?’ అంటూ అధికార భాష సంఘం అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు పి. విజయ్ బాబు విరుచుకుపడ్డారు.
కాపు సంఘాల వాదన ఎలా ఉందంటే...
చేగొండిపై చేస్తున్న ఆరోపణలు కాస్తంత విడ్డూరంగానూ ఉన్నాయి. చాలామంది కాపు నేతలపై చేగొండి హరిరామ జోగయ్య కుట్రపన్నారంటూ విమర్శలు చేస్తున్నారు. “2006లో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్రమాజీమంత్రి దాసరి నారాయణరావుపై కుట్ర చేసింది జోగయ్యే. ఆవేళ వైఎస్ రాజశేఖరరెడ్డి డైరెక్షన్ లో జరిగింది. 2024లో పవన్ పై కుట్రకు ఆధ్యుడు జోగయ్యే. అప్పుడు డైరెక్షన్ వైఎస్ కుమారుడు జగన్ ది. జగన్ ... జోగయ్య యాక్షన్. 2006లో కేంద్రమంత్రి పదవి కోసం సోనియా గాంధీకి లేఖ రాసింది ఈ జోగయ్యేనని, 2024లో తన కుమారుని MLA కోసం పవన్ కు లేఖ రాసి అది రాకపోయే సరికి కుమారుణ్ణి వైసీపీలో చేర్చారు” అంటున్నారు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు. ఆయన అంతటితో ఆగకుండా “సీఎం జగన్ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలి” అంటున్నారు. జగన్ బెయిల్ ను రాష్ట్ర ప్రజల రక్షణ కోసం రద్దు చేయాలని కాపు ఉద్యమ నేత వేల్పురి శ్రీనివాసరావు సిబిఐ డైరెక్టర్ కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. “నిత్యం పనికిరాని లేఖలు రాసే వీళ్లు (చేగొండి, ముద్రగడ) అధికారంలో ఉన్నప్పుడు కాపులుకు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదన్నది నిజం” అంటూ రాష్ట్ర సంక్షేమం కోసం జగన్ ను అరెస్ట్ చేయాలని కనీసం ఒక్కసారి లేఖలు రాశారా అని ప్రశ్నించారు వేల్పూరి. విజయ్ బాబుకు సమీపబంధువైన విక్రం పూల అనే నాయకుడు.. చేగొండిపై విరుచుకుపడ్డారు. “పాలకొల్లులో ఆనాడు పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఓడిపోవడానికి చేగొండే కారణం. ఇప్పుడాయన కుమారుడు సూర్యప్రకాశ్ ను వైసీపీలో చేరేలా చేశారు. చేగొండి మాత్రం పవన్ కల్యాణ్ కి సలహాలు ఇస్తున్నారు” అంటున్నారు విక్రం. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అధికారంలో వాటా ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్న చేగొండి హరిరామజోగయ్య.. వైసీపీ జెండా కప్పుకున్న తన కుమారుడికి వైసీపీలో పవర్ షేరింగ్ ఇస్తారా? అని ఎందుకు అడగలేదు అని ప్రశ్నిస్తున్నారు పవన్ సేన నాయకుడు తోట నరసింహారావు. పవర్ షేరింగ్ కోసం మాకు లేఖలు రాశారు కదా, ఇప్పుడు మీకు వారు (వైసీపీ) ఏం హామీ ఇచ్చారని ఊడిగం చెయ్యడానికి వెళ్ళారు? అని ప్రశ్నిస్తున్నారు మరో యువనేత బాబ్జీ.
ఇంకా ఏమంటున్నారంటే...
సూర్యప్రకాశ్ వైసీపీలో చేరిన తర్వాత పేలుతున్న మాటల తూటాలు, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు కొన్ని వాస్తవదూరంగా ఉన్నాయి. విమర్శిస్తున్న వాళ్లలో ఉక్రోషం కనిపిస్తోంది తప్ప వాస్తవాన్ని గ్రహించడం లేదని వైసీపీకి అనుబంధంగా ఉన్న కాపు నేతలు విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నానీ, మంత్రి కొట్టు సత్యనారాయణ లాంటి వాళ్లు ఈ తరహా యువతకు ఇస్తున్న సలహాలు ఎలా ఉన్నాయంటే…. కాపుల మంచి కోరే తమ మీద రెచ్చిపోయే కన్నా కాపుల్ని నిండా ముంచిన పవన్ కల్యాణ్, వారి బృందాన్ని ప్రశ్నించాలని సలహా ఇచ్చారు. పవన్ సీఎం, సీఎం అంటూ రంకెలు వేసిన యువకులు ఇప్పుడు 24 సీట్లతో ఏమి చేస్తారో చెప్పాలని, ఇది టీడీపీకి జనసేనను తాకట్టుపెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కాపు యువకులు, జనసేనకు మద్దతు ఇస్తున్న సంఘాలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి. అయితే ఇవన్నీ చేగొండి, ముద్రగడనే టార్గెట్ చేసేలా ఉన్నాయి.
“ఇన్నాళ్లు కాపులను ఉద్ధరించడం కోసం మీరు జనసేనపై ఒత్తిడి తెచ్చారు అనుకున్నాం. పొత్తు చెడగొట్టడం కోసం వైసీపీ ఇచ్చిన ఇంక్ తో లేఖలు రాశారు” అని ఊహించలేకపోయాం, ఇప్పటికైనా మీ నిజస్వరూపం బట్టబయలు చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు జనసేన కాపు యువత నాయకుడు సుబ్రమణ్యం ఎలియాస్ సుబ్బు. “అందరి వాడైన పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగట్టి రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు తప్ప మనలో ఒకడు అందరి కోసం నిలబడుతున్నాడనే ఇంగిత జ్ఞానం మాత్రం చుపించలేకపోయారు” అని వాపోయారు. మీలాంటి కుల ముసుగులో తలదాచుకునే అవకాశవాద నాయకుల గురించి తెలుసు కాబట్టే మీ కపట ప్రేమ లేఖలను బుట్టలో వేశారు కళ్యాణ్ అని మరో నాయకుడు స్పందించారు.
జగన్ గెలిస్తే కాపుల పని అవుటేనా?
సీఎం కాకముందే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని కాపుల అడ్డా మీదే తేల్చిచెప్పిన జగన్ మళ్లీ సీఎం అయితే కాపుల్ని అణగదొక్కుతారనే అభిప్రాయం కూడా కొందరిలో ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే ఇంతటి ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ అపోహలేననే వారూ లేకపోలేదు. ‘కాపు జాతి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ గాని వైసీపీ వస్తే దాని టార్గెట్ కాపు జాతే. గత 5 ఏళ్లలో కమ్మ జాతిని ఏ విధమైన టార్చర్ చేశారో చూశాం. చంద్రబాబు సహా ఎంతోమంది జైళ్ల పాలయ్యారో చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మున్ముందు పవన్ కళ్యాణ్ మీద కక్ష తీర్చుకోరని ఊహించలేం. మొత్తం కాపు సామాజిక వర్గాన్నే ఇబ్బందులకు గురి చేసినా చేయగలిగిందేమీ లేదు, తస్మాస్ జాగ్రత్త” అంటున్నారు పల్నాడు జిల్లా కాపు ఉద్యమనాయకుడు మిరియాల రామాంజనేయులు. “ వంగవీటి రంగాను భౌతికంగా వదులుకున్నాం. చిరంజీవి రాజకీయంగా వదులుకున్నాం. ఇక మన జాతి ఏకైక ఆశా కిరణం పవన్ కళ్యాణ్. ఆయన తరువాత కాపుల్లో అలాంటి నాయకుడు లేడు” అన్నది సుబ్రమణ్యం వాదన. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఒక సీటు తెచ్చుకుని, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా బాధ్యతకలిగిన ప్రతిపక్షంగా పవన్ కల్యాణ్ వ్యవహరించారని, ప్రజల పట్ల నిబద్ధతకు అదే నిదర్శనం అంటున్నారు కాపు యువత నాయకుడు చలమలశెట్టి శ్రీనివాస్.
ఏమైనా, పవన్ కల్యాణ్ ను విమర్శించి, లేఖాస్త్రాలు సంధించిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ప్రస్తుతం కాపు యువతకు టార్గెట్ అయ్యారు. తన కుమారుని కోసమే ఇంత పని చేశారన్న అపవాదును ఎదుర్కొన్నారు. తన కుమారుడు సూర్య ప్రకాశ్ రాజకీయ భవిష్యత్ కోసం పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారన్న ఆరోపణకు 80వ పడిలో చేగొండి హరిరామజోగయ్య భవిష్యత్ లో నైనా సమాధానం చెప్పుకోకతప్పదేమో.