జనాలు ‘పులస’ వెంట ఎందుకు పడుతున్నారు?

గోదావరి జిల్లాల్లో ‘పులస’ సందడి మొదలైంది. ఎంత ఖర్చయినా పులసను సొంతం చేసుకోవాలని జనాలు ప్రయత్నిస్తున్నారు. అసలు పులస ఎందుకింత ఫేమస్? వీటి సందడి ఏదంతా ఎందుకు ఉండదు?

Update: 2024-07-13 07:12 GMT

‘పుస్తెలమ్మైనా పులస తినాలి’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పులస ప్రియులు ఆ పనిలోనే పడినట్లు తెలుస్తోంది. పుస్తెలు అమ్మట్లేదు లేండి.. ఏం చేసైనా పులసను సొంతం చేసుకోవాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. అందుకు గోదావరి జలాల్లో పులస వేట ప్రారంభం కావడమే కారణం. రేటు ఎంతైనా పర్లేదు పులస పులుసు రుచి చూడాల్సిందేనని భోజన ప్రియులు ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోదావరికి వరదనీరు చేరడంతో పులస చేపల సందడి మొదలైంది. చేపల కోసం వల వేస్తున్న మత్స్యకారులు.. వల లాగిన ప్రతిసారి అదృష్టం బాగుండి పులస ఏమైనా పడిందా అని కూడా చూసుకుంటున్నారు. గోదావరికి వరద నీరు రావడం మొదలు కావడంతో భోజన ప్రియులకు పులస పులుసు తినాలన్న ఆత్రుత కూడా అంతే పెరిగిపోయింది. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు.

కిలోన్నర రూ.24 వేలు

పులసలో ఏముందో తెలియదు కానీ దానికి డిమాండ్ మాత్రం భారీగానే ఉంది. ‘ఎంతైనా పర్లేదు నాకు పులస కావాల్సిందే’ అనే వారు అనేక మంది ఉన్నారు. తాజాగా కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరి మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర పులస పడింది. దాన్ని అమ్మడానికి వారు వేలం పాట నిర్వహించారు. ఇందులో భారీ సంఖ్యలోనే పులస ప్రియులు పాల్గొన్నారు. దీనిని అక్కడి మాజీ సర్పంచ్ బర్రే శ్రీను సొంతం చేసుకున్నారు. ఈ కిలోన్నర పులస కోసం ఆయన అక్షరాల రూ.24 వేలు చెల్లించారు.

చాలా ఫేమస్

పులస ఎంత ఫేమస్ అంటే.. మాంసాహారం తినని వారికి కూడా దీని గురించి తెలుసు. దీనికెంత డిమాండ్ ఉందో కూడా బాగానే తెలుసు. అది పులస చేపకు ఉన్న రేంజ్. వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ పులస ఇంత ఫేమస్ కావడానికి చాలానే కష్టపడుతుంది. ఇదే చేప సముద్రంలో కూడా లభిస్తుంది. కానీ అప్పుడు దీనికి ఇంత డిమాండ్ ఉండదు. సముద్రంలో ఇది లభించినా ‘విలస’ చేప అని మళ్ళీ నీళ్లలోనే వదిలేసే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఒక్కసారి గోదావరి నీటిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చేపను పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతుంటారు. కొనుగోలు చేయడానికి ప్రజలు కూడా అంతుకుమించి పోటీ పడతారు. ఈ పులస ఎంత ప్రత్యేకం అంటే.. రాజకీయ నాయకులు, బడా బడా వ్యాపారస్తులను కలవడానికి వెళ్లినప్పుడు దీనిని బహుమతిగా ఇస్తే దాదాపు మన పని అయిపోయినట్లే అని చెప్తుంటారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ పులస ఎంత ఫేమస్సో. ఒకప్పుడు పులస చేపను కూడా చాలా సాధారణ చేపగానే చూసే వారు. కానీ ఇప్పుడునే పులస దొరికిందంటే వేలం పాట వేస్తున్నారు.

పులస పుట్టుక కూడా చిత్రమే

పులస చేప జీవనమే కాదు దాని పుట్టుక కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ‘హిల్సా ఇలీషా’ అనేది దీని శాస్త్రీయ నామం. ఈ చేప ఆరోహక వలస జాతికి చెందింది. వీటిని సుమద్రంలో ఉన్నప్పుడు ‘విలస’ చేపలుగా చెప్తారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, టాంజానియా వంటి ప్రాంతాల్లో జీవించే ఈ చేపలు సంతానోత్పత్తి కోసం ఖండాలు దాటి ప్రయాణిస్తాయి. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అంతర్వేది గుండా గోదావరి నది నీటిలోకి చేరతాయి. గోదావరి నది చాలా వేగంగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకోవడమే కాకుండా దానికి ఎదురీదుకుంటూ రావడం పులస చేప ప్రత్యేకత. వీటి వలసలు జూన్ నుంచి ఆగస్టు మధ్య జరుగుతంది. గుడ్లు పెట్టి అవి పిల్లలను అయిన తర్వాత అక్టోబర్ మాసానికి చేపలన్నీ తిరికి సముద్రంలోకి చేరుకుంటాయి. ఇలా గుడ్లను పొదగడానికి వచ్చిన సమయంలో మత్స్యకారుల వలలో పడతాయి ఈ చేపలు. వలలో పడిన వెంటనే పులస చనిపోతుంది. కానీ రెండు రోజుల వరకు మాత్రం చెడిపోకుండా అంతే ఉంటుంది. ఇది కూడా పులస చేప విశిష్టతల్లో ఒకటి. సముద్రంలో ఉండగా విలస చేప అనేది ఇవి గోదావరిలోకి ప్రవేశించిన తర్వాత రంగు మారుతుంది.. దాంతో పాటు గోదావరి తీపి నీటి కారణంగానే వాటి రుచి కూడా మారి పులసగా అవతరిస్తుంది. అయితే గోదావరి అంతటా పులసలు దొరుకుతాయని అనుకోవడం భ్రమే. కేవలం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి గోదావరి కలిసే ప్రాంతంలో మాత్రమే ఇవి లభిస్తాయి. వీటికి ఇంతటి డిమాండ్ ఉండటానికి ఇది కూడా కారణం.

నోరూరించే పులస పులుసు తయారీ ఇలా

పులసను కొనుగోలు చేయడం ఎలాగైనా అందరికీ సాధ్యపడదో అంతే వండటం కూడా అందరికీ చేతనయ్యే విద్య కాదు. పులస వండటం వచ్చు అంటే చాలా గొప్పగా చూసేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే అన్ని చేపలను వండినట్లు వండితే పులసకు రుచి రాదు. పులసను వండటానికి ప్రత్యేకమైన తీరు ఉంటుంది. అందులోనూ మట్టి పాత్రల్లో వండిన పులస ముక్కను నోటబెడితే కైలాసం గుర్తుకు రావాల్సిందే. మరి ఈ పులస పులుసును ఎలా వండాలో తెలుసా..

కావాల్సిన పదార్థాలు: పులస చేప (మీకు కావాల్సినంత), వెన్న లేదా నూనె, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవకాయ నూనె, ఉప్పు, కరివేపాకు, కారం, కొత్తమీర, మెంతులు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, దనియాలు.

వండే తీరు: మొదటగా పులస చేపను శుభ్రం చేసుకుని ముక్కలు కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర, దనియాలు, మెంతులు కలిసి నూరి ముద్దగా చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత.. పొయ్యిపైన మట్టికుండ పెట్టుకుని అందులో వెన్న లేదా నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయముక్కలు పసిడివర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా ముద్దను వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ మసాలాలో పులస ముక్కలు, ఆవకాయ నూనె, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత కాస్తంత నీరు పోసి పాత్రపై మూత పెట్టేయాలి. మసాలాలో పులస ముక్కలను ఉడకనివ్వాలి. అలా ఒక పది నిమిషాల పాటు మూత ఉంచిన తర్వాత అందులో చింతపండు పులుసు పోసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి పులస పులుసు చేయడం. పొయ్యిపై నుంచి దింపుకునే ముందు కాస్తంత వెన్న వేసి.. దాన్ని కొత్తిమీరతో గార్షిష్ చేసుకుంటే సరిపోతుంది.

ఇక్కడే ఇంకో ట్రిక్ కూడా ఉంది.. పులస పులుసును వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కానీ ఒక రోజు అయిన తరవాత ఈ పులుసు రుచి చూస్తే ఇంక జీవితంలో మర్చిపోరు. ప్రతి ముద్ద కూడా ముల్లోకాలను చూసిన అనుభూతిని అందిస్తుంది. నాలుక ఆనంద తాండవం చేస్తుంటే.. రుచి గ్రంథులు ఇంకా కావాలని చెప్తుంటే పొట్ట నా వల్ల కాదు మహాప్రభో అని వేడుకునే వరకు తినడం ఆపరు.

Tags:    

Similar News