మంగళగిరిలో జగన్ మంత్రం పారుతుందా?

లోకేష్‌ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ శ్రేణులు. ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ వర్గాలు.

Update: 2024-03-21 08:27 GMT
మంగళగిరి అభ్యర్థులు లావణ్య, లోకేష్

జి. విజయ కుమార్ 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే మంగళగిరి గెలుపును అటు టీడీపీ, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాయి.
జగన్‌ ఎత్తుగడ ఇదే..
మంగళగిరి అభ్యర్థిగా మహిళా యువ నేతను రంగంలోకి దింపడం వెనుక సీఎం జగన్‌ వ్యూహం ఇదే అని ఆ పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. లావణ్య పుట్టిల్లు, మెటినిల్లు మంగళగిరే కావడం, వారి ఇరువురి కుటుంబాలు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉండటం, నియోజక వరం్గలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, ఇవి తమకు లాభిస్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. నారా లోకేష్‌ లాంటి బలమైన అభ్యర్థిని మంగళగిరిలో ఓడించాలంటే అంతే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళను రంగంలోకి దింపాలని, ఆమె చేతిలో లోకేష్‌ను ఓడించాలన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే సీనియర్‌ నేతలైన ఆర్కే, గంజి చిరంజీవిని పక్కనబెట్టి లావణ్యను మంగళగిరి బరిలో నిలిపినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. అయితే లోకేష అభివృద్ది, రాజధాని ప్రధాన అస్త్రాలుగా ప్రచారం చేస్తున్నారు. 2019లో ఓడిన నాటి నుంచి మంగళగిరి నియోజక వర్గ ప్రజలకు చేరువ అయ్యేందుకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. 2014లో టీడీపీ «అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆ ప్రాంతంలో నిర్మించిన వివిధ కంపెనీల భవనాలు, కల్పించిన ఉద్యోగాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కుప్పం, పులివెందుల తర్వాత మంగళగిరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బరీలోకి దిగుతున్న పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గాల తర్వాత ఆ స్థాయిలో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు ఫ్యూచర్‌ సీఎంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్న లోకేష్‌ పోటీ చేస్తుండటంతో మంగళగిరి నియోజక వర్గానికి అంత హైప్‌ క్రియేట్‌ అయింది. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా లోకేష్‌ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత ఆయన ఎమ్మెల్సీగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అనంతరం మంత్రి పదవి చేపట్టారు.
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహిళా యువ నేత
మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంపికలో అనేక మజిలీలు చోటు చేసుకున్నాయి. తొలుత గంజి చిరంజీవిని నియమించారు. ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. నాడు ఆర్కేకి 44.73 శాతం ఓట్లు రాగా గంజి చిరంజీవికి 44.72 శాతం ఓట్లు లభించాయి. 2019 ఎన్నిల్లో గంజి చిరంజీవికి టీడీపీ టికెట్‌ ఇవ్వ లేదు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ పోటీ చేశారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గంజి చిరంజీవి టీడీపీని వీడి 2022లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత ఆయనకు ఆప్కో చైర్మన్‌ పదవిని కూడా సీఎం జగన్‌ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే మొదట్లో మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కర్తగా నియమించారు. ఆయనకే టికెట్‌ ఖరారు అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా మురుగుడు లావణ్య పేరు తెరపైకి తెచ్చారు. మార్చి 1న ఆమె పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితాను విడుదల చేసింది. దానికి కొన్ని గంటల ముందే తల్లి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మామ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మురుగుడు హన్మంతరావుతో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఇలా లోకేష్‌పైన ఒక యువ మహిళా నేతను సీఎం వైఎస్‌ జగన్‌ బరీలోకి దింపడంతో కూడా మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం ప్రత్యేకతను సంతరించుకుంది.
సామాజిక వర్గాలు
మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పద్మశాలీ సామాజిక వర్గం అత్యంత కీలకమైంది. గెలుపు ఓటములపై ప్రభావం ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. వీరి ఓట్లు సుమారు 90వేల వరకు ఉంటాయి. కాపులు 11 శాతం, ఎస్సీలు 27శాతం, యాదవులు 10 శాతం, కమ్మలు 8 శాతం, ఎస్టీలు 4శాతం వరకు ఉంటారు. ప్రస్తుత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో సమన్వయ కర్తగా ఉన్న గంజి చిరంజీవిది కూడా ఇదే సామాజిక వర్గం. బలమైన సామాజిక వర్గం బ్యాక్‌గ్రౌండ్‌ ఉండటం తమ పార్టీకి సానుకూలత ఎక్కువుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాపులు, కమ్మలు ఈ ఎన్నికల్లో కీలం కానున్నారు. అయితే టీడీపీకి జనసేన కూడా తోడు కావడంతో అధిక శాతం ఈ వర్గాలు లోకేష్‌ను బలపరచే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాన∙అంశంగా స్థానికత
మంగళగిరిలో అభ్యర్థి స్థానికత కూడా ప్రధాన అంశంగా మారింది. లోకలా.. నాన్‌ లోకలా అనే దానిపైన చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం కూడా ఉండనుంది. టీడీపీ అభ్యర్థి నాన్‌లోకల్‌ కావడంతో మైనస్‌గాను, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లావణ్యది లోకల్‌ కావడం ప్లస్‌గాను మారే చాన్స్‌ ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News