మిర్చి రైతులను కేంద్రం ఆదుకుంటుందా?
ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. ధరలు పడిపోయి దిక్కతోచని స్థితిలో ఉన్నారు. గత సంవత్సరం నిల్వలు పేరుకు పోయాయి.;
మిర్చి రైతులు కేంద్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధరలకు రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదు. పురుగు మందులు, రసాయన ఎరువులు అప్పులు ఇచ్చిన వారు రైతులను పీడిస్తున్నారు. ఎప్పుడు మార్కెట్లో అమ్ముతారా? అని అప్పులు ఇచ్చిన వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మిర్చి రైతులు గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ (మిర్చి యార్డ్)లో మిర్చిని అమ్మకానికి తెస్తున్నారు. రోజులు గడుస్తున్నాయే కాని ధరలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు. ధర వచ్చే వరకు నిల్వ చేసుకుందామనుకుంటే కోల్డ్ స్టోరేజీలు గత సంవత్సరం నిల్వలతో నిండిపోయి ఉన్నాయి.
దారుణంగా పడిపోయిన ధరలు
గత సంవత్సరం ఇదే సమయంలో ఎండు మిర్చి క్వింటా ధర రూ. 20,000 లకు అమ్ముడు పోయింది. ఈ సంవత్సరం క్వింటా మిర్చి ధర రూ. 8వేలు దాటటం లేదు. వర్షాలకు తడవడం వల్ల కాస్త రంగుమారిన మిర్చి ధర పూర్తిగా పడిపోయింది. క్వింటా రూ. 4వేలకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఎకరం పొలంలో మిర్చి పండించేందుకు పెట్టుబడి లక్షన్నర వరకు అయింది. మిర్చి అమ్మితే వచ్చింది రూ. 70వేలు. అప్పులు కూడా తీరలేదు. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదని గుంటూరు జిల్లా లోయేపల్లికి చెందిన బోగోలు చక్రపాణిరెడ్డి వాపోయారు. రైతులు ప్రతి సారీ నష్టపోతున్నారు. వ్యాపారులు మాత్రం అప్పటికప్పుడు కొనుగోలు చేసి వేలల్లో సంపాదిస్తున్నారని అన్నారు.
కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటసుబ్బారావు మాట్లాడుతూ గత సంవత్సరం నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. క్వింటా రూ. 14000లకు అమ్మా, కొన్ని బస్తాలు కోల్డ్ స్టోరేజీలో ఉంచా. ధర రాలేదు. వాటిని ప్రస్తుతం క్వింటా రూ. 9వేలకు అమ్మా, అప్పులు తీరలేదు. ఈ సంవత్సరం కాయకోసి అమ్ముదామంటే భయం అవుతోంది. కొన్ని బస్తాలు ఇంటి వద్దే ఉన్నాయని తెలిపారు. ఇలా ఏ రైతును కదిలించినా కంట కన్నీరు పెడుతున్నారు. ధరలు లేకపోవడం, పెట్టుబడులు పెరగటంతో దిక్కుతోచని స్థితికి చేరారు. రైతుల ఆత్మహత్యకు ఊరకే రావని, ఇటువంటి పరిస్థితులు అందుకు దారితీస్తాయని తెలిపారు.
తెగుళ్లతో తగ్గిన దిగుబడి
ఆకుముడుత, బొబ్బెర, నల్లి, జెమినీ వైరస్, కొమ్ముకుళ్లు తెగుళ్లు సోకాయి. ఒక్కసారిగా మూడు, నాలుగు రకాల తెగుళ్లు వ్యాపించడంతో చెట్టంతా ముడుచుకుపోయి దిగుబడి తగ్గింది. పైగా సీజన్ ప్రారంభం నుంచే తుఫాన్ ల ప్రభావం కారణంగా కాయల్లో పెరుగుదల లేకుండా పోయింది. బాగా వచ్చిన కాయలు కూడా సరైన రంగు, కారం లేకుండా పోవడంతో ధర పాతాళాన్ని చూసింది. ఎకరాకు రైతులు పెట్టుబడి ఖర్చుల కింద కనీసంగా రూ. 1.50 లక్షలు ఖర్చు చేశారు. తీరా అమ్మే సరికి క్వింటా రూ. 4వేల నుంచి ప్రారంభమవుతోందని గుంటూరు జిల్లా కాకానికి చెందిన నల్లదిమ్మె వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు తగ్గినా పెరగని ధర
గత సంవత్సరం 5.93 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు కాగా ఈ సంవత్సరం 3.53 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. దిగుబడి దాదాపు 5.14 లక్షల టన్నుల్లో వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ వారి అంచనా ప్రకారం ఐదు లక్షల టన్నుల పైన దిగుబడి వచ్చినట్లు లెక్కలు వేశారు. మిర్చి పంటకు రకరకాల తెగుళ్లు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే వచ్చాయి. తెగుళ్ల కారణంగా మిర్చిలో నాణ్యత లోపించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఏ గ్రేడ్ మిర్చి ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో రూ. 11,883 లు పడుతోంది. కాస్త తాలు వచ్చినా, రంగు మారినా మంచి మిర్చే అయినా క్వింటా ధర రూ. 4వేలకు మించడం లేదు. నాలుగు నుంచి పదివేల లోపులో వివిధ గ్రేడ్స్ కింద వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది క్వింటా ధర దాదాపు రూ. 20వేల వరకు అమ్మింది. దీంతో రైతులు చాలా మంది చివరి కాపు ధర తగ్గిందని, తరువాత అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న మిర్చి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు వ్యాపారుల అంచనా.
కేంద్రానికి లేఖ రాసిన సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులు పడుతున్న బాధలు వివరించారు. కనీస మద్దతు ధర కూడా రాక పోవడంతో కేంద్రం కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని వారు మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మిర్చి రైతులను ఆదుకోవాలని రాసిన లేఖను మంత్రికి అందించారు. క్వింటా కనీసం రూ. 11,600లు చెల్లించి రైతుల నుంచి మిర్చిని కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని వివరించారు.