సంక్షేమం వైఎస్‌ఆర్‌సీపీని గెలిపిస్తుందా?

వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అభివృద్ధిని మరిచింది. కనీస సౌకర్యాలకు అవసరమైన పనులు కూడా నియోజకవర్గాల్లో చేపట్టలేదు. భారీ సంక్షేమ పథకాలనే నమ్ముకుంది, అది చాలా?

Update: 2023-12-30 11:58 GMT
YS Jaganmohan Reddy

వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అభివృద్ధిని మరిచింది. కనీస సౌకర్యాలకు అవసరమైన పనులు కూడా నియోజకవర్గాల్లో చేపట్టలేదు. ఎమ్మెల్యేలు అలంకార ప్రాయమయ్యారు. వార్డు వాలంటీర్లకు ఉండే పని కూడా ఎమ్మెల్యేకు ఉండటం లేదు. ఎమ్మెల్యే బయటకు వెళితే ఆయనతో పాటు నలుగురు కలిసి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అందుకే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో నడక ద్వారా ఎక్కడా కనిపించడం లేదు. కార్లలోనే కనిపించి వెళుతున్నారు. సంక్షేమమే నా బాట అన్న తెలంగాణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను ప్రజలు మట్టి కరిపించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

‘‘నేను నియోజకవర్గంలో సుమారు రూ. 125కోట్ల విలువైన పనులు చేయించాను. ఎన్నికలకు ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 1200 కోట్లు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదు. అభివృద్ధి చేయకుండా పార్టీని ఎవరు గెలిపిస్తారు’’ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో అన్నారు. శనివారం తనను కలిసిన విలేకరులతో మంగలగిరిలోని తన కార్యాలయంలో మాట్లాడారు.
అన్నీ ఉచిత పథకాలే..
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పీట వేసింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టి సక్సెస్‌ అయింది. ఏ పథకమైనా ఉచిత పథకమే కావడం విశేషం. డబ్బులు తీసుకున్న వారు తిరిగి ప్రభుత్వానికి పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
సబ్సిడీ పథకాలకు చెల్లు
గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు సబ్సిడీ పథకాలు ఉండేవి. ఎంతో కొంత బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించి తిరిగి ఆ డబ్బును బ్యాంకులకు లబ్ధిదారు చెల్లించే విధంగా పథకాల రూప కల్పన ఉండేది. మిగిలిన డబ్బు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చేంది. ఐఏఎస్‌లు పథకాలు రూపొందించే విషయంలో చొరవ తీసుకునే వారు. కార్యదర్శుల స్థాయిలో ప్రభుత్వ ప్రయారిటీని బట్టి పథకాలు ఉండేవి. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే పథకం. సీఎం చెప్పిన దానికి మార్గదర్శకాలు మాత్రమే ఐఏఎస్‌లు రూపొందిస్తున్నారు.
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బకాయిలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారు. స్థానిక ఎమ్మెల్యేల చొరవతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసినా బిల్లులు రాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ బిల్లుల నిధులు విడుదల చేయించుకునేందుకు నేతలతో పాటు ఫైనాన్స్‌ ఉన్న తాధికారులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో సచివాలయ ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌ ఎక్కడ ఉంటుందో.. వారు ఏ విధమైన పనులు చేస్తారో సాధారణ వ్యక్తులకు తెలిసేది కాదు. ఇప్పుడు ఫైనాన్స్‌ కార్యదర్శితో పాటు మిగిలిన వారు ఎక్కడెక్కడ ఉంటారో.. వారి నుంచి నిధులు ఎలా విడుదల చేయించుకోవాలో అందరికీ తెలిసిపోయింది. నిధులు ప్రయారిటీల ప్రకారం విడుదలవుతున్నాయి. ముందుగా సంక్షేమ పథకాలకు విడుదల చేస్తారు. ఆ తరువాత ఇతర పనులకు నిధులు విడుదల అవుతున్నాయి. ఒక వేళ కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుంటే వారు కోర్టును ఆశ్రయించి బిల్లులు రాబట్టుకుంటున్నారు.
లబ్ధిదారుల జాబితా స్థానిక ఎమ్మెలకు తెలియదు
లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లు చేపడుతున్నారు. వారు ఎమ్మెల్యేతో చర్చించటానికి కూడా రారు. ఒకే ఒక్కసారి మాత్రం వలంటీర్‌ ఎమ్మెల్యేను కలుస్తాడు. అదెప్పుడంటే ఎంపిక సమయంలో మాత్రమే. ఆ తరువాత అధికారులతోనే వారి పని ఉంటుంది. లబ్దిదారుల ఎంపిక తయారు కాగానే ఎంపీడీవో ద్వారా కలెక్టర్‌కు వెళుతుంది. ఆ తరువాత డైరెక్టర్, కమిషనర్‌ కార్యాలయాలకు జాబితాలు చేరుతాయి. ఈ జాబితాలను బ్యాంకు అధికారులకు రాష్ట్ర కార్యాలయం పంపుతుంది. ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌ నుంచి నిధులు విడుదల అయ్యాయని, వాటిని సీఎఫ్‌ఎంఎస్‌కు పంపించాలని కమిషనర్‌ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. కమిషనర్‌ సంతకంతో ఆన్‌లైన్‌లోనే నిధులు సీఎఫ్‌ఎంఎస్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. ఇదీ ఇప్పుడు జరుగుతున్న తంతు.
అభివృద్ధి పనులు చేసిన ఎమ్మెల్యేలకు ఝులక్‌
ఇప్పటి వరకు నియోకవర్గాల్లో కొద్దోగొప్పో అభివృద్ధి పనులు ఎవరైనా ఎమ్మెల్యేలు చేపడితే ఆ పనులకు నిధులు విడుదల కాలేదు. కాంట్రాక్టర్‌లు ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. తాను చెప్పి ననులు చేయిస్తున్నాడు కాబట్టి చాలా వరకు ఎమ్మెల్యేలు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్‌లకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ‘నా నియోజకవర్గంలో సుమారు రూ. 125 కోట్ల విలువైన పనులు చేయించాను. సుమారు రూ. 8కోట్లు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను. ఈ నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు. సీఎం కార్యాలయం నుంచి చాలా సార్లు ధనుంజయ్‌రెడ్డి ఫోన్‌ చేసి తర్వలోనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ వాటి జాడ కనిపించలేదు. ఇలా అయితే నియోజకవర్గాల్లో తిరిగి ఓటు ఎలా అడుగుతాం.’ అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది.
అందరు ఎమ్మెల్యేల్లోనూ తీవ్ర అసంతృప్తి
రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరిలో పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో ఒక్క పనికూడా చేయించలేకపోయాం. ఇచ్చిన మాట తప్పినవారమయ్యాం. ప్రభుత్వం అభివృద్ది పనులకు పైసా ఇవ్వడం లేదు. ఇంతకు మునుపెన్నడూ ఈ పరిస్థితులు లేవనేది ఎమ్మెల్యేల ఆవేదన. దీనిని ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదు. పైగా మీరు సరిగా పనిచేయలేదని రిపోర్టు ఉందని, అందువల్ల మిమ్మల్ని మారుస్తున్నామని చెబుతున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అనేది కూడా ఎమ్మెల్యేలను నుంచి వ్యక్తమవుతున్న మరో వేదన. దీనిని ఆర్కేలాంటి కొందరు ఎమ్మెల్యేలు బయట పెట్టగా కొందరు మౌనంగా ఉంటున్నారు. పార్టీని వీడే ప్రతి ఒక్కరూ ఈ విషయం స్పష్టం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News