‘ధర్మ రక్షణ బోర్డు కావాలి’.. తిరుపతి లడ్డు వివాదంపై పవన్ కల్యాణ్..

తిరుపతి లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు.

Update: 2024-09-20 06:41 GMT

తిరుపతి లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. కేంద్ర స్థాయిలో కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు ప్రతివిమర్శలు, మాటల యుద్ధాలు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఏ రూపానైనా అపవిత్రం చేసేలా చేసే చర్యలను అడ్డుకోవడానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాలకు చెందిన పాలసీ రూపకర్తలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియా పెద్ద సహా అందరితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన కోరారు. టీటీడీ ప్రసాద తయారీలో కల్తీ జరగడం అనే కోట్ల మంది మనోభావాలను కించపరచడమే అవుతుందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టే ప్రసక్తే లేదని, దీని వెనక ఎవరు ఉన్నా వదిలి పెట్టమని పవన్ కల్యాణ్ అన్నారు. కోట్ల మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే టీటీడీ ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు, చేప నూనెలు కలవడం అనేది చిన్నాచితక అంశం కాదని, ఈ విషయంపై వస్తున్న ప్రశ్నలన్నింటికీ వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు.

ధర్మరక్షణ బోర్డు కావాలి

‘‘తిరుపతి బాలీజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (పంది, గొడ్డు కొవ్వు, చేప నూనె) కలిసినట్లు గుర్తించిన విషయం తీవ్ర కలతకు గురి చేసింది. ఈ అంశంపై భక్తులు, ప్రజల మనసులను అనేక ప్రశ్నలు అతలా కుతలం చేస్తున్నాయి. వాటన్నింటికీ వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డ్ సమాధానం చెప్పాలి. ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ ఇప్పుడు వెలుగు చూసిన ఈ విషయంలో దేవాలయాలను అపవిత్రం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను అందరి ముందుకు తీసుకొచ్చింది. అందులో భాగంగానే టీటీడీని భూవివాదాల్లోకి నెట్టడం సహా ఇతర అనేక సమస్యలను కూడా తెలియజేస్తుంది. భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం కోసం జాతీయ స్థాయిలో ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. దాని అవసరం ఎంతో ఉంది. అందుకు సమయం ఆసన్నమైంది. ఈ వ్యవహారంపై అన్ని రంగాల పెద్దలు, పౌరులతో సమావేశం నిర్వహించాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.

ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది భక్తులను మోసం చేయడం అవుతుందని, అంతేకాకుండా ఆలయ బోర్డు పాల్పడిన అత్యంత పెద్ద పాపమని హిందూ ఐటీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీని వెనక ఎవరు ఉన్నా వదిలి పెట్టకూడదని, ఈ విషయంతో హిందువులు తీవ్రంగా బాధించబడుతున్నారంటూ హిందూ ఐటీ సెల్.. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని హిందూ ఐటీ సెల్ తమ ఎక్స్(ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేసి పోస్ట్ చేసింది. అందుకు సమాధానంగానే పవన్ కల్యాణ్ ఈ పోస్ట్ పెట్టారు.

కేంద్రహోంశాఖకు జగన్‌పై ఫిర్యాదు

తిరుపతి లడ్డూ వ్యవహారం దేశమంతా తీవ్ర దుమారం రేపుతున్న క్రమంలో ప్రముఖ న్యాయవాది వినీతి జిందాల్.. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. జగన్ తన చర్యల ద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని హత్య చేశారని, హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ జిందాల్ మండిపడ్డారు. జగన్ కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జగన్‌తో పాటుగా అప్పటి టీటీడీ పాలక వర్గం, కల్తీ నెయ్యిని శ్రీవారి ప్రసాద తయారీ కోసం సరఫరా చేసిన సంస్థపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. వీరందరిపై న్యాయసంహితలోని సెక్షన్లు 152, 192, 196, 298, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News