రాత మారింది.. సీటు దక్కింది...

అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి అమర్‌కు పోటీ చేసే రాత లేదని అందరూ భావించారు. అయితే సీఎం జగన్.. అమర్ తలరాతను తిరగరాశారు.

Update: 2024-03-14 05:44 GMT
Source: Twitter

తంగేటి నానాజీ



విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు తలమునకులై ఉన్నాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ ఇప్పటికే నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించినప్పటికీ కొన్నిచోట్ల మార్పులు, చేర్పులు చేస్తూ వస్తోంది. తాజా మార్పుల్లో గాజువాక నియోజకవర్గం అసెంబ్లీ సీటును పార్టీ అధిష్టానం మంత్రి అమర్నాథ్‌కు కేటాయించింది.

గాజువాక అసెంబ్లీ నుంచే పోటీ...

పార్టీ పదవికే పరిమితమై పోతానేమో అన్న నైరాస్యం నుంచి అమర్‌కు విముక్తి లభించింది. పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సవరణలో భాగంగా గాజువాక సమన్వయకర్తగా మంత్రి అమర్నాథ్, చిలకలూరిపేట సమన్వయకర్తగా మనోహర్ నాయుడులను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్‌ని కాదని భరత్‌ను సమన్వయకర్తగా నియమించడం... ఎన్నికల్లో భరత్‌కు సహకరించాలంటూ సీఎం జగన్ ఆదేశించడంతో తనకు సీటు వస్తుందో రాదోనని మదనపడ్డ మంత్రి అమర్నాథ్.. నిర్వేదంగా కూడా మాట్లాడారు. కొన్ని రోజులు అనకాపల్లి ఎంపీ స్థానం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరికి గాజువాక అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

జగనన్న… నా తలరాత మార్చేవన్న...

జగనన్నా నా తలరాత ఇలా రాసేవేందన్న... పార్టీ పదవులకే పరిమితం చేస్తావా... ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏదో ఒక నియోజకవర్గ నుంచి అవకాశం కల్పించు అన్న... అంటూ తనలో తాను మదన పడిపోయిన మంత్రి అమర్‌కు తాజా ఉత్తర్వులతో జోష్ వచ్చింది. సీటు దక్కదన్న దిగులుతో వేదాంత ధోరణిలో మాట్లాడిన అమర్ ఇప్పుడు నా తలరాతను తిరగరాసినందుకు థాంక్స్ అంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

కలిసొచ్చిన వర్గ పోరు....

అట్టు కోసం రెండు పిల్లుల పోరు పడటం కోతికి కలిసి వచ్చినట్టు... గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నేతల వర్గ పోరు మంత్రి అమర్నాథ్‌కు కలిసి వచ్చింది. గాజువాక నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండేవారు.. మూడు నెలల క్రితం దేవన్ రెడ్డిని ఇన్‌చార్జిగా తప్పించి ఉరుకూటి చందును వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో పార్టీలో వర్గ పోరు ప్రారంభమైంది. అధిష్టానం దృష్టికి రావడంతో పార్టీ పెద్దలు ఇరు పార్టీలను పిలిచి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చందు కు కాకుండా మరి ఎవరికీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే నాగిరెడ్డి పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పడంతో... చందు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి పేరు పరిశీలన చేసినప్పటికీ పార్టీ అధిష్టానం చివరకు మంత్రి అమర్నాథ్ పేరును ఖరారు చేసింది.


Tags:    

Similar News