ప్రతిపక్షాల దాడిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టగలరా?

కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారపక్షంపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి సిద్ధమవుతున్నాయి.

Update: 2024-07-12 14:04 GMT

కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారపక్షంపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి సిద్ధమవుతున్నాయి. అవినీతి, కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నాయి.

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KMVSTDC) లో అవినీతి, మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల వ్యవహారంపై ముఖ్యంగా ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది.

ఇప్పటికే KMVSTDC కుంభకోణంలో నిందితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరు కూడా ఉండడంతో ఈ రెండింటి నుంచి సిద్ధరామయ్య ప్రభుత్వం బయటపడడం అంత సులభం కాకపోవచ్చు. గత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంపై నిందలు మోపి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడి, 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఇప్పుడు సహజంగానే ఇబ్బందికర పరిస్థితి. KMVSTDC కుంభకోణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినా.. బిజెపి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుల దాటిని ఎదుర్కోవడం సిద్ధరామయ్య సర్కారుకు కాస్త కష్టమే.

దూకుడు మీదున్న ప్రతిపక్షం..

బియ్యం ధర, వ్యవసాయ రంగంలో కష్టాలు, సాగునీటి పంపుసెట్లకు, రైతులకు పాల ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందడం లేదనే ఫిర్యాదులతో ఇప్పటికే ప్రతిపక్షాలు దూకుడుమీదున్నాయి. ముడా కార్యకలాపాలపై అందిన ఫిర్యాదులో ముఖ్యమంత్రితో పాటు మరో తొమ్మిది మంది పేర్లు ఉండడం..బీజేపీ, జేడీ(ఎస్)లకు మేలు చేసే అంశం. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు సామాజిక సంక్షేమ హామీల్లో లోపాలున్నాయని, అలాగే డెంగ్యూ కేసులు పెరిగిపోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి.

పోరాడుతూనే ఉంటాం..

కాంగ్రెస్ కుంభకోణాలు, అవినీతిపై బీజేపీ సభ లోపలా, బయటా పోరాడుతుందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ అన్నారు. వాల్మీకి కుంభకోణంలో మాజీ మంత్రి బి.నాగేంద్రను కాంగ్రెస్ ప్రభుత్వం బలిపశువుగా చేసిందని ఆయన ఆరోపించారు. సిద్ధరామయ్య రాజీనామా చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

ప్రతిపక్షాల సామర్థంపై అనుమానాలు?

మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జెడి(ఎస్) ఎంపీ హెచ్‌డి కుమారస్వామి, బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై లేకపోవడంతో..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగల సామర్థ్యం ప్రతిపక్షాలకు ఉందా అనుమానం కొందరిలో ఉంది. సిద్దరామయ్యను ఎదుర్కోవడానికి బొమ్మై, కుమారస్వామితో పోలిస్తే..అశోక్ , సిటి రవి (బిజెపికి చెందిన) చిన్నపాటి రాజకీయ నాయకులు కాదని ఒక బిజెపి సీనియర్ లీడర్ అన్నారు.

సీఎంకు అన్నీ తెలుసు..

పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఇలా అన్నారు “సిద్దరామయ్య రాజకీయ అనుభవజ్ఞుడు. దిగువ సభలో అనుభవం లేని BJP, JD (S) నాయకులను ఆయన సులభంగా హ్యాండిల్ చేయగలరు. బిజెపికి చెందిన రవికుమార్‌ను ఎలా మౌనంగా ఉంచాలో ఆయనకు తెలుసు’’ అని పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల పొడిగింపునకు డిమాండ్..

దూకుడుగా ఉన్న బీజేపీ.. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు పొడిగించాలని కోరుతోంది. సమస్యలపై చర్చించేందుకు పక్షం రోజులు సరిపోవని అశోక్ అంటున్నారు. రాష్ట్రంలో జికా వైరస్‌ వ్యాప్తి, డెంగ్యూ కేసుల సంఖ్య పెరగడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.

శాసనమండలిలో నెగ్గేరా?

శాసన మండలిలో అధికార కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోవడంతో.. ముఖ్యమైన సవరణలు, అవసరమయ్యే బిల్లులను ఆమోదించడం ప్రభుత్వానికి కష్టమవుతుంది. స్వల్ప మెజారిటీతో ఉన్న బీజేపీ, జేడీ(ఎస్) బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేసే అవకాశం ఉంది. అయితే లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల హెచ్‌కే పాటిల్‌కి మాత్రం.. ఇది సమస్య కాదంటున్నారు. "మండలి పెద్దల సభ కాబట్టి.. నేను అడ్డంకులు ఉండవని భావిస్తున్నా." అని అన్నారు.

కాంగ్రెస్ చీఫ్ విప్ సలీమ్ అహ్మద్ ఇలా అన్నారు.. "ప్రాధాన్యత గల అంశాల విషయంలో ప్రతిపక్షాలను ఒప్పించగలమని." పేర్కొన్నారు. ఎగువసభలో ప్రతిపక్ష నేత కోట శ్రీనివాస పూజారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడంతో బీజేపీకి ఇంకా వారసుడిని ఎంపిక చేయలేదు. సిటి రవి, ఎన్ రవికుమార్‌లు పోటీపడుతున్నారు.

చిత్రదుర్గలో భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి రూ.3,000 చెల్లించి, శిబిరం ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా రవి అసెంబ్లీలో లేవనెత్తాలనుకుంటున్నారు.

Tags:    

Similar News