ఎవరిపనిలో వారు బిజీ
ఎన్నికల వ్యవహారమంటే తమాషానా
(జిపి వెంకటేశ్వర్లు)
చిక్కరు.. దొరకరు.. ఎవరిపనిలో వారు బిజీగా ఉంటారు. ఏమిటా బిజీ.. ఎవరు వారు అనుకుంటున్నారా? ఇంకెవరండీ రాజకీయ నాయకులు. బిజీ ఏమిటనుకుంటున్నారా.. ఓట్ల పండగ వచ్చేసింది కదండీ అందుకే ఓట్లు తీసేయించే వారు కొందరైతే, చేర్పించే వారు మరికొందరు. అధికారులంటారా.. ఎవరికంటా పడకుండా తమ పనిముగించుకుందామని చూస్తుంటారు. అయితే ఇప్పుడు అందరికళ్లూ ఎన్నికల కమిషన్‌పైనే ఉన్నాయి. జరిగే తప్పులు రాజకీయ నాయకులపైన ఉంటే సరిదిద్దాల్సిన అధికారులు పెద్దగా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2023 అక్టోబర్ 27న పబ్లిష్ చేసిన డ్రాప్ట్‌రోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,02,21,450 ఓట్లు ఉన్నాయి. ఇందులో స్త్రీలు 2,03,85,851, పురుషులు 1,98,31,791 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 3,99,84,868గా ఉంది.
ప్రతి సంవత్సరం ఓటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అలాగే మరణించిన వారు, రాష్ట్రం వదిలి వెళ్లిన వారి ఓట్లు తొలగిస్తూ ఉంటారు. 2023 సంవత్సరం అక్టోబరు 27న ఇచ్చిన డ్రాప్ట్ నోటిఫికేషన్ ప్రకారం 2,36,582 ఓట్లు పెరిగాయి. ఈ పెరుగుదల చాలా తక్కువని, టీడీపీ ఓట్లు కావాలని వైఎస్సార్‌సీపీ వారు ఫారం –7 ఇవ్వడం ద్వారా ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారన్నది టీడీపీ ఆరోపణ. ఫారం –7 ద్వారా తొలగింపుకు ఒకరే ఇస్తే బీఎల్‌వో స్థాయిలో తొలగించవచ్చు. అంతకంటే ఎక్కువ ఒకరే తొలగింపుకు ఇస్తే త్రిసభ్య కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బిఎల్‌వోలు ఎన్నిసార్లు ఇంటింటి సర్వే చేసినా 15వేల మంది చనిపోయిన వారి ఓట్లు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉన్నాయని నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి స్వప్నికల్ దినకర్ పుడ్కర్ ఆఫీస్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు చెప్పారు.
పోలింగ్ బూత్‌లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారికి అనుకూలంగా మార్పించుకున్నారని, దొంగ ఓట్లు విపరీతంగా చేర్పిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు.
దొంగ ఓట్లు అంటే..
ఉన్నవాళ్లను తొలగించి లేని వాళ్లను ఉన్న వారుగా ఓటర్ల జాబితాలో చేర్చడాన్ని దొంగ ఓట్లు అనవచ్చు. అలాగే జాబితాలో ఒకే తరహా ఫొటోలతో ఓట్లు ఉండటాన్ని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఫారం 7 ద్వారా తొలగింపులు, షిప్టింగ్‌లు, మరణాలు, డూప్లికేట్స్, అభ్యంతరాల వంటివి ప్రత్యర్థులు ఇస్తున్నారు. ఇవి కూడా దొంగ ఓట్లేనని రాజకీయ నాయకుల పరిభాషలో చెప్పవచ్చు.
గతంలో చంద్రబాబు చేర్పించిన దొంగోట్లను ఇప్పుడు తొలగిస్తుంటే దొంగే దొంగ.. దొంగ.. అన్నట్లుగా ఉందని ఏపీ ఇంటలెక్స్‌వల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం చైర్మన్ పి విజయ్‌బాబు ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.
తెనాలి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అనుమానాస్పద ఓట్లు 6వేలు, డెమోగ్రఫికల్ సిమిలర్ ఎంట్రీ (డీఎస్‌వో) ఓట్లు 2వేలు, ఒకే ఇంటి చిరునామాతో (10కంటే ఎక్కువ ఓట్లు ఉన్న గృహాలు) 1,100 వరకు ఉన్నాయి. ఈ గృహాల్లో 16వేల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోమసుందరపాలెంలోని ఒక ఇంట్లో 12 ఓట్లు ఉన్నట్లు జాబితాలో ఉండగా పరిశీలిస్తే ఆ ఇంట్లో 3ఓట్లు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గంలో 15వేలకు పైగా ఓట్లు గందరగోళంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,60,624ఓట్లు ఉన్నాయి. చనిపోయిన వారు 6వేల వరకు ఉంటే సగం మందిని కూడా తొలగించలేదు. సంగంజాగర్లమూడిలో 1–1 ఇంట్లో 128 ఓట్లు ఉన్నట్లు ఓటర్ల జాబితాలో ఉంది.
ఎక్కువగా ఎన్నికల అధికారుల తప్పులు కనిపిస్తున్నాయి. డిసెంబరు నాటికి ఈ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఎన్నికల కమిషన్‌కు ఉంది.