‘సుదర్శన్ రెడ్డి గెలవాలి’.. కవిత హాట్ కామెంట్స్
ప్రజా సొమ్మును దోచుకోవడానికి రేవంత్ మరో ప్లాన్ వేశారంటూ ఆరోపణలు.;
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గెలవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని, ఆయనకు రాజ్యాంగం పట్ల అంకితభావం ఉందని కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా ఆయన అయితే ఎన్నో మార్పులను చూడగలుగుతామని అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి ఆమె నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి కూడా ఆమె నివాళులు అర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా కాళేశ్వరం, కాంగ్రెస చేపట్టిన తాజాగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకమే..
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఎన్‌డీఏ, ఇండి కూటమి రెండూ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేశాయని, అందుకే 70 లక్షల మంది రైతుల తరుపున తాము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నోటా ఉంటే దానికే ఓటు వేసేవాళ్లం అని కూడా తెలిపారు. అటువంటిది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో సుదర్వన్ రెడ్డి గెలవాలంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్‌కు తాను వ్యతిరేకమని ఈ వ్యాఖ్యలతో కవిత మరోసారి వెల్లడించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్‌ను కాకా పట్టడానికే కవిత.. సుదర్శన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారన్న చర్చ కూడా మొదలైంది. ఈ అంశం బీఆర్ఎస్‌లో మరో కలవరం రేపుతోంది.
దోచుకోవాడానికే రేవంత్ కొత్త ప్రాజెక్ట్..
తాగునీటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. గోదావరి ఫేజ్ 2, 3 స్కీమ్ నియో పోలీస్ వాటర్ సప్లై, సేవరేజ్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు గండిపేట దగ్గర సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ఉద్దేశించి కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లూ కూళేశ్వరం అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన రేవంత్.. ఇప్పుడు ఆ కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్‌కు తాగునీటిని తీసుకురావడానికి రెడీ అయ్యారని గుర్తు చేశారు. రూ.1500 కోట్ల ప్రాజెక్టును రూ. 7,500 కోట్లకు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్మును మెగా కృష్ణా రెడ్డికి దోచి పెడుతున్నారంటూ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్ట్ అంచనాలను పెంచడం కూడా పెద్ద కుట్రేనని ఆయన అన్నారు.