జాతీయస్ధాయిలో కేసీఆర్ ఒంటరైపోయిన కారణం ఇదేనా ?

కేసీఆర్ ఒంటెత్తు పోకడలే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను ఎటూ కానీయకుండా చేస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.;

Update: 2025-09-09 08:33 GMT
KCR

నేతలన్నాక క్రెడిబులిటీ చాలాముఖ్యం. క్రెడిబులిటి లేని నేతలను, పార్టీలను జనాలే కాదు ఏ పార్టీ కూడా నమ్మదు. ఇపుడు బీఆర్ఎస్ పరిస్ధితి ఇలాగే తయారైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election)లో పోటీచేస్తున్న ఎన్డీయే(NDA), ఇండియా(INDIA) కూటమి అభ్యర్ధుల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని పార్టీ అధినేత కేసీఆర్(KCR) డిసైడ్ చేశారు. కేసీఆర్ నిర్ణయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయంతో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్(BRS) ను భవిష్యత్తులో ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి ఏదీ దగ్గరకు రానిచ్చేట్లుగా లేదు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను ఎటూ కానీయకుండా చేస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ప్రాంతీయపార్టీ బీఆర్ఎస్ జాతీయరాజకీయాల్లో రాణించాలంటే ఏదోఒక జాతీయపార్టీ నాయకత్వంలోని కూటమిలో చేరటం తప్పనిసరి. అయితే కేసీఆర్ రెండు కూటములకు దూరంగా ఉంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలసమయంలో నరేంద్రమోదీని నోటికొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ ఎన్డీయేకి దూరమయ్యారు. ఇదేసమయంలో కాంగ్రెస్ పై ధ్వజమెత్తి ఇండియా కూటమికీ దూరమయ్యారు. దీని ఫలితంగానే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినతర్వాత జాతీయస్ధాయిలో బీఆర్ఎస్ ను మిగిలిన పార్టీలు పట్టించుకోవటం మానేశాయి. రాష్ట్రంలో పార్టీపరిస్ధితిని చక్కదిద్దుకోవటం మానేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకోవటమే తప్పిదంగా అనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే బీఆర్ఎస్ పై మొదటి దెబ్బపడింది. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎనుముల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అప్పటినుండి బీఆర్ఎస్ కు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. కేసీఆర్-రేవంత్ మధ్య బద్ధవైరముంది. అధికారంలో ఉన్నపుడు రేవంత్ ను కేసీఆర్ ముప్పుతిప్పలు పెట్టారు. ఓటుకునోటు ఘటనలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ పై ఏసీబీ కేసులు పెట్టింది. ఫలితంగా చాలారోజులు రేవంత్ జైల్లో ఉన్నారు. తర్వాత 2018 ఎన్నికల్లో ఎంఎల్ఏగా గెలిచిన రేవంత్ ను అసెంబ్లీలో నోరెత్తనీయలేదు కేసీఆర్. రేవంత్ ఎప్పుడు మాట్లాడినా ఏదో కారణంతో సభ నుండి సస్పెండ్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ద్రోన్ ఎగరేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారనే కారణంతో రేవంత్ మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి రిమాండుకు పంపిన ఘటనలు చాలానే ఉన్నాయి.

అయితే వాటిని బయటపడనీయకుండా రేవంత్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్, అధికార దుర్వినియోగం లాంటివి బయటకు తీసి విచారణలు జరిపి కేసులు నమోదు చేయిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి, ఫార్ములా ఈ కార్ రేస్ లో అధికార దుర్వినియోగం, టెలిఫోన్ ట్యాపింగ్, గొర్రెల కొనుగోళ్ళు కుంభకోణాలన్నీ ఇలాంటివే. ఇలాంటి నేపధ్యంలో ఎవరైనా జాతీయస్ధాయిలో ఏదో ఒక గట్టి కూటమిలో చేరటానికి ప్రయత్నిస్తారు. కాని కేసీఆర్ మాత్రం ఆపని చేయకుండా రెండు కూటములకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ కు జరగబోయే లాభం కనబడకపోగా నష్టాలు తప్పవని అర్ధమవుతోంది.

జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలని కేసీఆర్ కు బలమైన కోరికుంది. అప్పుడు జాతీయ పార్టీలతోనో లేకపోతే ప్రాంతీయ పార్టీలతోనే మంచి సంబంధాలు నెరపాల్సుంటుంది. కాని కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాల్లోని కూటములకు దూరంగా ఉంటున్నారు. ఇదేసమయంలో ప్రాంతీయపార్టీల అధినేతల్లో ఎవరితో కేసీఆర్ సన్నిహితంగా ఉంటున్నారో కూడా అర్ధంకావటంలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఒడిసా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ తో చేతులు కలపటానికి ఇష్టపడటంలేదు. గతంలో వీళ్ళని కేసీఆర్ అనేక సందర్భాల్లో కలిసి మద్దతు అడిగినా సానుకూలంగా స్పందించని విషయం గుర్తుండే ఉంటుంది.

ఏమాత్రం విశ్వసించలేని నేతగా కేసీఆర్ పైన ముద్రపడిన కారణంగానే జాతీయ పార్టీలే కాదు ప్రాంతీయపార్టీల అధినేతలు కూడా బీఆర్ఎస్ అధినేతను నమ్మటంలేదు. 2023 ఎన్నికల్లో ఓడిపోవటమే కాదు, 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కసీటులో కూడా గెలవలేదు. జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పాలంటే ఉండాల్సింది పార్లమెంటు సీట్లు లేదా రాష్ట్రంలో అధికారం. ఈ రెండూ లేనపుడు కేసీఆర్ ను ఏ పార్టీ లెక్కచేస్తుంది ? అధికారంలో ఉన్నపుడు తీసుకున్న ఒంటెత్తు పోకడల కారణంగానే ఇపుడు కేసీఆర్ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో తనగొంతును వినిపించక, జాతీయస్ధాయిలో వినిపించే అవకాశాలు లేక నానా అవస్తలు పడుతున్నారు.

ఈ నేపధ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన పార్టీ వాణిని వినిపిస్తారని అనుకున్నారు. తీరాచూస్తే రెండు కూటములకు దూరంగా ఉండాలని, ఓటింగును బహిష్కరించాలని నిర్ణయించారు. కేసీఆర్ తాజా నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాల్సిందే.


కారణాన్ని గ్రహించాలి : కొత్త


ఇదే విషయాన్ని బీఆర్ఎస్, దుబ్బాక ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి వివరించారు. ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం కేసీఆర్ వ్యక్తిగతం కాదన్నారు. ‘‘ఇందులో వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏమీలేదు’’ అన్నారు. ‘‘ఓటింగుకు దూరంగా ఉండటం నిరసన మాత్రమే’’ అన్నారు. ‘‘తమ పార్టీ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే బహిష్కరించిన’’ట్లు చెప్పారు. ‘‘తమ నిర్ణయంతో రైతులు బాగుపడతారేమో అని ఆశపడుతున్న’’ట్లు ఎంఎల్ఏ తెలిపారు. ‘‘తమ పార్టీకి జాతీయ రాజకీయాలకన్నా రైతు ప్రయోజనాలే ముఖ్యమ’’ని కొత్త స్పష్టంచేశారు. ‘‘రైతుల సమస్యల్లో నుండే బీఆర్ఎస్ పుట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే’’ అన్నారు. ‘‘తెలంగాణ ప్రయోజనాల కోసం ఏత్యాగానికి అయినా తాము సిద్ధంగా ఉన్న’’ట్లు ఎంఎల్ఏ తెలిపారు. ‘‘బీఆర్ఎస్ ఓటింగుకు ఎందుకు దూరంగా ఉందో జాతీయ పార్టీల గ్రహించాలన్నదే తమ అధినేత ఉద్దేశ్యమ’’ని కొత్త ప్రభాకరరెడ్డి చెప్పారు.

బీఆర్ఎస్ కు విలువలు లేవు : పైడి

‘‘తెలంగాణ వాదన నుండి బీఆర్ఎస్ దూరంగా జరిగి చాలా కాలామైంద’’ని బీజేపీ ఆర్మూరు ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవాచేశారు. ‘‘ఉపరాష్ట్రపతిలాంటి ఉన్నతమైన పదవికి జరుగుతున్న ఎన్నికలో బీఆర్ఎస్ ఓట్లేసుండాల’’న్నారు. ‘‘అభ్యర్ధుల్లో ఎవరో ఒకరికి ఓట్లు వేసుండాల్సింది పోయి బహిష్కరించటంవల్ల ఏమీ ఉపయోగం లేద’’ని చెప్పారు. ‘‘అధికారం లేకపోతే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నార’’ని పైడి అన్నారు. ‘‘కుటుంబ, రాజరిక పాలన అలవాటు అయిపోవటంతో ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ కు చులకనైపోయింద’’ని ఎంఎల్ఏ ఆరోపించారు. ‘‘పార్టీకి ఇష్టమైన అభ్యర్ధికి ఓటు వేసుండాల్సింద’’ని ఎంఎల్ఏ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాల్లో కొన్నివిలువలు పాటించాలని, అలాంటి విలువలు కేసీఆర్ కు లేవని మరోసారి నిర్ధారణ అయ్యింద’’న్నారు. ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికకు యురియాకు ముడిపెట్టడం తగద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘ఫామ్ హౌసులో పడుకునే ప్రతిపక్ష నేత కేసీఆర్ నుండి ఇంతకు మించి ఏమి ఆశించలగమ’’ని పైడి ఎద్దేవా చేశారు. ‘‘తొందరలోనే బీఆర్ఎస్ కనుమరుగైపోవటానికి ఈ నిర్ణయమే నాంది’’గా పైడి చెప్పారు. ‘‘రాష్ట్రంలో పాలన సరిగాలేని కారణంగానే యూరియా కొరత వచ్చింద’’ని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నాయకత్వంలో సరైన నిర్ణయాలు తీసుకునేశక్తి పోయింద’’ని అనుమానం వ్యక్తంచేశారు. ‘‘అధికారంలో ఉన్నపుడు అక్రమంగా సంపాదించిన డబ్బును పంచుకోవటంతోనే కుటుంబసభ్యులకు సరిపోతోంద’’ని ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ఎన్నికలపై విలువలు లేని పార్టీ బీఆర్ఎస్ అని తేలిపోయింద’’న్నారు.

ప్రచారం తప్పించుకోవటానికే : కూరపాటి

‘‘బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని జరుగుతున్న ప్రచారాన్ని తప్పించుకునేందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ బహిష్కరించినట్లుంద’’ని రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు. ‘‘కారుపార్టీకి లోక్ సభలో ఎంపీలు లేకపోగా రాజ్యసభలొ నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నార’’ని గుర్తుచేశారు. నలుగురు ఎంపీలు ఓట్లేసినా ఒకటే వేయకపోయినా ఒకటే అన్నారు. ‘‘బీఆర్ఎస్ ఓటింగుకు దూరంగా ఉన్నంతమాత్రాన ఫలితంలో ఎలాంటి ప్రభావం ఉండద’’ని చెప్పారు.


‘‘తమ అభ్యర్ధికి ఓట్లు వేయాలని నరేంద్రమోదీ లేకపోతే ఎన్డీఏ తరపున ఎవరూ కేసీఆర్ ను అడగలేద’’న్నారు. ‘‘బీజేపీ అడగకపోయినా ఎన్డీయే అభ్యర్ధికి ఓట్లు వేస్తే రెండుపార్టీలు ఒకటే అని జరగుతున్న ప్రచారం నిజమే అని ప్రజలు అనుకుంటారనే ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న’’ట్లు ప్రొఫెసర్ చెప్పారు. ‘‘ఓట్లేయమని బీఆర్ఎస్ ను అడగటం బీజేపీకి ఇష్టంలేదు, అడగకుండా ఓట్లేయటం బీఆర్ఎస్ కు ఇష్టంలేద’’ని కూరపాటి వివరించారు.

Tags:    

Similar News