రాహుల్ చెల్లి ప్రియాంకకే సీటు.. సీపీఐకి దక్కదా ఓటు..

సమైక్యతా చిహ్నంగా చేతులెత్తి ఫోటోలు తీయించుకుంటారు. కానీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం- ఎక్కడైనా భావే గాని వంగతోట కాదన్నట్టు వ్యవహరిస్తారు.

Update: 2024-10-17 03:34 GMT

ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు.. బీజీపీకి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడైనా మీటింగులు పెడతారు, మోదీని విమర్శిస్తారు, ఆర్ఎస్ఎస్ ను దూదేకినట్టు ఏకేస్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెట్టే ఇండియా కూటమి పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు, సమైక్యతా చిహ్నంగా చేతులెత్తి ఫోటోలు తీయించుకుంటారు. కానీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం- ఎక్కడైనా భావే గాని వంగతోట కాదన్నట్టు వ్యవహరిస్తారు. విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

కేరళ అంటే కమ్యూనిస్టు పార్టీలు గుర్తుకువస్తాయి. ఒకసారి కాంగ్రెస్ మరోసారి కమ్యూనిస్టు పార్టీలు రాజ్యమేలుతుంటాయి. అటువంటి రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ సీటు నుంచి ఓ విపత్కకర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ 2019లో పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేసి గెలిచి రెండు చోట్లా గెలిచి వయనాడ్‌ లోక్‌సభ సీటును వదులుకున్నారు.

నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2008 నుంచి వాయనాడ్ లోక్ సభ సీటు ఏర్పాటైంది. ఆ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి బలం ఉంది. ఒకటి రెండుసార్లు గెలిచారు కూడా. 2019లో కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ తన పూర్వీకుల నియోజకవర్గమైన రాయబరేలీలో పరిస్థితి బాగా లేకపోవడంతో వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. ఇక్కడ గెలిచి రాయబరేలీలో ఓడారు. 2024లోనూ గతంలో మాదిరే రెండుచోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. వయనాడ్ సీటును వదులుకున్నారు.
2024 పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీపై సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజా పోటీ చేసి భారీ మెజారిటితో ఓడిపోయారు. దాదాపు 3 లక్షల 40 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడారు. వయనాడ్ సీటును రాహుల్ గాంధీ వదులుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆ సీటును సీపీఐకి వదిలేయాలన్న వాదన వచ్చింది. అయితే రాజకీయాలు అలా ఉండవని, సూత్రప్రాయంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నా సీట్లు, ఓట్లు దగ్గర కుదరదని మరోసారి తేలిపోయింది.
వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మంగళవారం ప్రకటించిన ఎన్నికల కమిషన్‌ వయనాడ్‌ లోక్‌సభ సీటుతో పాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 13న ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
ఈ ప్రకటన వెలువడిన మర్నాడే వయనాడ్‌ సీటుకు ప్రియాంక అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. రాహుల్‌గాంధీ వయనాడ్‌ (కేరళ) సీటును వదులుకొని రాయ్‌బరేలీ(యూపీ) లోక్‌సభ స్థానానికే ప్రాతినిధ్యం వహిస్తారని పార్టీ గతంలోనే తెలిపింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు వయనాడ్‌లో ఆమె గెలిస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు- ఆమె తల్లి సోనియా, అన్న రాహుల్, ప్రియాంక- తొలిసారి పార్లమెంటు సభ్యులుగా ఉన్నట్టు అవుతుంది.
గతంలో జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంటులో ఉన్నప్పుడు ఆయన కుమార్తె ఇందిరా గాంధీ కూడా పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆ సంప్రదాయం పునరావృతమైనట్టవుతుంది.
వయనాడ్ చాలా అందమైన ప్రాంతం. కేరళ పశ్చిమ కనుమల పర్వతాల మధ్య ఉంది. ఎటుచూసినా పచ్చగా ఉంటుంది. అందుకేనేమో దాన్ని పచ్చని స్వర్గం అంటుంటారు. కోజికోడ్ సముద్ర తీరం నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కేరళలోని 20లోక్ సభ సీట్లలో వయనాడ్ ఒకటి. 2008లో ఏర్పడింది.
వాయనాడ్‌లో లోక్‌సభ సీటు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రకటనతో స్థానిక క్యాడర్ లో ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతున్నారు. ఆమె నిలువెత్తు పోస్టర్లను చేపట్టి ప్రచారానికి దిగారు. గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం, బ్యానర్లు కట్టడం వంటివి మొదలయ్యాయి. పార్టీ స్థానిక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని చుట్టుముట్టారు. ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నితన్‌, ఎమ్మెల్యేలు టి.సిద్ధిక్‌, బాలకృష్ణన్‌ సహా అనేక మంది అప్పుడే ప్రచారం ప్రారంభించారు.
డీలా పడిన విపక్షాలు...
కాంగ్రెస్ ను నమ్ముకున్నా సీటు దక్కదని ఊహించిన సీపీఐ స్థానిక నేతలు కూడా హడావిడి చేస్తున్నారు. గతంలో పోటీ చేసిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజా మరోసారి పోటీకి ససేమిరా అనడంతో స్థానిక ఎమ్మెల్యే బిజిమోల్ ను రంగంలోకి దింపాలని చూస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలతో డీలా పడిన పార్టీ శ్రేణులను ప్రోత్సహించేందుకు సీపీఐ కార్యక్రమాలు చేపట్టింది. సీపీఎం మద్దతు ఇస్తోంది.
ఇక, మరో ప్రత్యర్థి పార్టీ బీజేపీ. ఈ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదనే లెక్కలోనే ఉన్నారు. ప్రతి సారీ పోటీ చేయడం, ఓడిపోవడం రివాజుగా మారడంతో పెద్దగా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మరో ఎన్నికల త్యాగపురుషుణ్ణి ఎంపిక చేసే పనిలో కమలనాథులు ఉన్నారు. బీజేపీ తరఫున శోభా సురేంద్రన్‌ పోటీ చేయవచ్చునని అంచనా.
నియోజకవర్గంలో కాస్త కుడిఎడంగా అన్ని పార్టీల వారు ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తగ్గించడంగానే భావిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్‌కు అత్యంత సురక్షితమైన నియోజకవర్గాల్లో వయనాడ్ ఒకటిగా మారింది. మూడు జిల్లాల్లోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. కాంగ్రెస్ కి బలమైన సీటుగా మారింది. వామపక్ష పార్టీల ఫ్రంట్ కూడా ఆ సీటులో తమకు గట్టి పట్టుందనే వాదిస్తున్నాయి.
అందుకే ఆ సీటు నుంచి గంలో సీపీఐకి చెందిన అన్నే రాజాన బరిలోకి దింపారు. అయితే ఈసారి ఆమె ప్రియాంకపై పోటీకి సుముఖంగా లేరు. రాహుల్‌పై 3.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అయిన అన్నే రాజా వయనాడ్ ఉపఎన్నిక బరిలోకి దించే అవకాశం లేదని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఒకే కూటమిలో రెండు పార్టీలు ఒక్క సీటు విషయంలోనే సర్దుకోలేకపోయాయని, ఇలాంటి కూటమి దేశ ప్రయోజనాలను ఎలా కాపాడతాయని బీజేపీ నాయకులు అప్పుడే విమర్శలు మొదలు పెట్టడం గమనార్హం.
Tags:    

Similar News