వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే రాహూల్ గాంధీపై విమర్శలు: కాంగ్రెస్
వామపక్ష పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సతీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి లోపాయికారీగా..
By : The Federal
Update: 2024-04-13 10:58 GMT
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను దృష్టి మరల్చేందుకు, అలాగే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసేందుకు కాంగ్రెస్, రాహుల్‌గాంధీపైనా విరుచుకుపడుతున్నారని కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్ శనివారం ఆరోపించింది.
రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ మాట్లాడుతూ గత 30 రోజులకు పైగా విజయన్ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని విడిచిపెట్టి.. కాంగ్రెస్, గాంధీలపై విమర్శలు చేస్తూ ఒకే అరిగిపోయిన ప్రసంగాన్ని చదువుతున్నారని అన్నారు.
ఈ మార్క్సిస్టు అనుభవజ్ఞుడికి కాంగ్రెస్‌కు ఒక్కటే ప్రశ్న సంధిస్తోందని సతీశన్ అన్నారు -- "మేము లేకుండా మీరు జాతీయ స్థాయిలో మతతత్వాన్ని, ఫాసిజాన్ని ఎలా ఓడిస్తారు?" "ఇండి కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్ నాశనమైతే లేదా బలహీనపడితే అది ఎవరికి సాయం చేస్తుంది? ఇది పినరయి విజయన్‌కు మా ప్రశ్న. కాబట్టి, మీరు (విజయన్) రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ బిజెపికి సహాయం చేస్తున్నారు." సతీషన్ విమర్శించారు.
ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో సీపీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలేమీ లేవని, తమ పాలనా వైఫల్యాలు, నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ను టార్గెట్ చేశారని పరవూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశన్ ఆరోపించారు. వామపక్ష ప్రభుత్వం రూ.1,500 కోట్లతో చేపట్టిన కేఫోన్ ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు గడిచినా నేటికీ పూర్తి చేయలేదని అన్నారు. అవినీతి, దుర్వినియోగం కారణంగా ఇది పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. KFON ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని సతీశన్ అన్నారు.
డిప్లమాటిక్ బ్యాగ్‌ల కేసు, కరువనూరు సహకార బ్యాంకు కుంభకోణంతో సహా పలు ఆర్థిక కుంభకోణాల్లో తమ నాయకులు చాలా మంది ఇరుక్కున్నందున విజయన్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ కేసుల్లో చర్యలు తీసుకుంటామన్న భయం పాలక పినరయి విజయన్, సీపీఐ(ఎం)లో ఉంది, త్రిసూర్, తిరువనంతపురం వంటి కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో వామపక్షాల ఓట్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ దీన్ని సద్వినియోగం చేసుకుంటోంది' అని సతీశన్ ఆరోపించారు.
బీజేపీ, సీపీఐ(ఎం)లు ఎలాంటి ఏర్పాట్లు చేసినా, కాంగ్రెస్, యూడీఎఫ్‌లు కేరళలో కాషాయ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వవని ఆయన సవాల్ చేశారు. కేరళలో ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.