సైబర్ నేరగాళ్లకు చిక్కి వృద్ధ దంపతుల ఆత్మహత్య..
‘‘ఉన్న డబ్బంతా పొగొట్టుకున్నాం. ఇంకా మా దగ్గర ఏమీ మిగల్లేదు. మేం మరొకరికి భారం కాదలుచుకోలేదు. మా మృతదేహాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేయండి’’;
కర్ణాటక(Karnataka) రాష్ట్రం బెలగావి జిల్లా ఖానాపూర్ తాలూకా బీడీ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
మహారాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు జాంగో నజరేత్(83). భార్య ఫ్లెవియానా(79). వీరికి పిల్లలు లేరు. పెన్షన్ డబ్బుతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నజరేత్ ఇంట్లో గొంతు కోసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆయనను విగతజీవిగా చూసి తట్టుకోలేకపోయిన భార్య ఫ్లెవియానా అధిక మొత్తంలో డయాబెటిక్ మాత్రలు మింగి ప్రాణాలొదిలింది.
ఇంతకు ఏం జరిగిందంటే..
కొన్ని రోజుల క్రితం.. నజరేత్‌కు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ‘‘మీ న్యూడ్ ఫొటోలు నెట్‌లో సర్క్యూలేట్ అవుతున్నాయి. మీరు నేరానికి పాల్పడ్డారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ. 5 లక్షలు వెంటనే ట్రాన్ఫర్ చేయాలని మాట్లాడిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. కాల్‌ను తర్వాత మరో వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేశాడు. రెండో వ్యక్తి మాటలకు మరింత ఆందోళనకు గురైన నజరేత్ దంపతులు తొలుత వారికి రూ. 5 లక్షలు పంపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి మరింతగా భయపెట్టి ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. దాంతోదాచుతున్న పెన్షన్ డబ్బు, భార్య ఒంటి మీద బంగారు నగలు తాకట్టుపెట్టి తెచ్చిన రూ. 7 లక్షలతో కలిపి మొత్తం రూ. 50 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. చివరకు అనుమానం వచ్చిన నజరేత్ తనకు వచ్చిన నంబర్‌కు తిరిగి కాల్ చేశాడు. ఏ రెస్పాన్సు లేకపోవడంతో మోసపోయామని గుర్తించి నా జీవితాన్ని ముగిస్తున్నానని నజరేత్ వారికి మెసేజ్ పంపాడు.
నూసైడ్ నోట్‌లో..
ఇంట్లో దొరికిన రెండు పేజీల సూసైడ్ నోట్‌ను చదివి పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘‘ నా భార్య బంగారు నగలు కుదువపెట్టి రూ .7.15 లక్షల తీసుకొచ్చా. దానికి వడ్డీ జూన్ 4న చెల్లించాల్సి ఉంది. ఆ బంగారం అమ్మి వచ్చిన డబ్బు లోన్ ఇచ్చిన వాళ్లకు తిరిగి చెల్లించండి. మిగతా డబ్బు నన్ను ఆదుకున్న స్నేహితులను ఇవ్వండి. సర్వస్వం కోల్పోయాం. ఇక మేం ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా మృతదేహాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేయండి’’ అని అందులో రాసి ఉంది.
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు నజరేత్ మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్, కత్తిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
పోలీసు సూపరింటెండెంట్ భీమశంకర్ గులేద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి కేసును సైబర్ ఎకనామిక్, నార్కోటిక్స్ పోలీసులకు బదిలీ చేశారు. సైబర్ నేరాల గురించి ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు ఇలాంటి మోసాలకు గురవుతూనే ఉన్నారని పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేశారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం – 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ — +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం — 1800-599-0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)