తమిళనాడులో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నోట చంద్రబాబు మాట..
రాష్ట్రాలపై త్రిభాషా విధానాన్ని కేంద్రం బలవంతంగా రుద్దుతుందన్నది.. కేవలం 'రాజకీయ ప్రేరేపితం' - కేంద్ర విద్యాశాఖ మంత్రి
రాష్ట్రాలపై మూడు భాషల విధానం కేవలం రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan). ‘‘మేము ఎవరిపైనా ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదు. 1, 2 తరగతులకు రెండు భాషల సూత్రం ఉంటుంది. ఒకటి మాతృభాష అవుతుంది. ఇక్కడ అది తమిళం అవుతుంది. ప్రాథమిక పాఠశాలలో మీరు తమిళంలో బోధించాలన్నది భారత ప్రభుత్వ షరతు. మీకు ఇష్టమయితే మరో భాష బోధించవచ్చు." అని క్లారిటీ ఇచ్చారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి సమక్షంలో ఏర్పాటుచేసిన 'థింక్ ఇండియా దక్షిణాపథ సమ్మిట్ 2025'కు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
త్రిభాషా విధానాన్ని (Three language row) వివరిస్తూ.. 6 నుంచి 10వ తరగతి వరకు త్రిభాషా సూత్రం ఉందన్నారు. “ఒక భాష మాతృభాషగా ఉంటుంది. మిగిలిన రెండు ఆప్షనల్‌గా ఉంటాయి. భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా ఏ భాషను బలవంతంగా రుద్దదు” అని స్పష్టం చేశారు.
'యూపీ విద్యార్థులు కూడా తమిళం నేర్చుకోవచ్చు'
ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని ఎలా అమలు చేస్తున్నారన్న ప్రశ్నకు.. "మేము ఆ రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేస్తున్నాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానానికి ముందే త్రిభాషా విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక విద్యార్థి హిందీని మాతృభాషగా నేర్చుకుంటాడు. ఆ తర్వాత మరాఠీ లేదా తమిళం కూడా నేర్చుకోవడానికి ఇష్టపడొచ్చు. యూపీలోని కొంతమంది విద్యార్థులు తమిళాన్ని మూడో భాషగా ఎంచుకోవచ్చు. అయితే యూపీ ప్రభుత్వం ఆ భాషను నేర్పించే అవకాశం కల్పించాలి" అని సమాధానమిచ్చారు ప్రధాన్.
భారతదేశ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారని చెబుతూ మిగిలిన జనాభా తమ మాతృభాషలో మాట్లాడటానికి ఇష్టపడతారని పేర్కొన్నారు.
‘‘పెరిగిపోతోన్న పోటీతత్వం తెలుగు మాట్లాడే విద్యార్థులు 10 భాషలు నేర్చుకోవాలని, అందుకు తాను ప్రోత్సహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రధాన్ ఈ సందర్భంగా ఉటంకించారు.
భాష ఎప్పుడూ సహాయకారిగా ఉంటుంది. రాజకీయ సంకుచిత ఆలోచనలున్న వారు అనవసరంగా సమస్యను సృష్టిస్తున్నారు" అని పేర్కొన్నారు.
“నేను తమిళనాడులోని అన్ని ప్రాంతాలు పర్యటించాను. ఇది తప్పనిసరిగా భాషా ప్రయుక్త రాష్ట్రం. నేను ఒడియాను. ఒడియా భాషంటే నాకు గర్వం. ఇతర భారతీయ భాషల పట్ల నాది అదే భావన. భాషా విభజనను సృష్టించాలనుకునే వారు విఫలమయ్యారు. సమాజం వారి కంటే చాలా ముందుంటుంది" అని అన్నారు.