కర్నాటక: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఏడాది.. ఏం మార్పులు జరిగాయంటే..
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఏడాది కాలం పూర్తయింది. ఈ మధ్యలో అనేక సవాళ్లను సీఎం సిద్ధరామయ్య ఎదుర్కొన్నారు. ముఖ్యంగా..
By : The Federal
Update: 2024-05-22 08:06 GMT
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి అప్పుడే సంవత్సరం అయింది. సీఎంగా సిద్ధరామయ్యకి పూర్తి మెజారిటీ ఉండడంతో బండి సాఫీగా సాగుతోంది. అయితే ఆయన పక్కన ఉన్న చాలామంది కుదిరితే కుర్చీ కోసం మంటలు రేపే సమర్థులే. అపాయలన్నీ అలాగే జాగ్రత్తగా కాచుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి.
సీఎం పదవి విషయంలో ఏడాది క్రితం జరిగిన సంఘటనలు అలాగే ఫ్రెష్ గా ఉన్నాయి. అనేకమంది ఆశావహులు సీఎం సీటు కోసం పోటీ పడిన తరువాత సిద్దరామయ్యకి అది దక్కింది. అప్పటి నుంచి ఆయన జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. అయితే సంక్షేమ రాజకీయాలు, లౌకికవాదిగా ముద్రపడ్డ 75 ఏళ్ల వ్యక్తి నుంచి వాటిని ఎవరూ సులభంగా వెనక్కి తీసుకోలేరు.
బ్రాండ్ సిద్ధరామయ్య
ఈ కారణంగానే కాంగ్రెస్ అగ్రనాయకత్వం సిద్దరామయ్య ను గేమ్ చేంజర్ గా భావించింది. హిందూత్వ ఎజెండాను సమర్థవంతంగా ఎదుర్కొవడం, అభివృద్ధి ఎజెండా, సోషల్ ఇంజనీరింగ్ సంపూర్ణ సమ్మేళన కలగలిపి ఉపయోగించే వ్యక్తిగా ఏఐసీసీ ఆయనపై నమ్మకముంచింది.
"సిద్దరామయ్య తన చతురతతో ప్రతి సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించారు. బ్రాండ్ కాంగ్రెస్, బ్రాండ్ సిద్ధరామయ్యను నిర్మించడంలో విజయం సాధించారు" అని కాంగ్రెస్ నాయకుడు కొండజ్జి మోహన్ అన్నారు.మరో సహాచర మంత్రి, హెచ్‌సి మహదేవప్ప, ముఖ్యమంత్రి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని అందులో ప్రతిపక్షాల నుంచి సొంత సహచరులు సైతం ఉన్నారని ఆయన అంగీకరిచారు.
"అయితే (అతను) తన పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేస్తాడు," అని మహదేవప్ప ఫెడరల్‌తో అన్నారు.
మోదీ ప్రభుత్వం
సిద్ధరామయ్య కర్నాటకలో మోదీని ఎదుర్కొన్ని మరి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. తరువాత కూడా మోదీ ప్రభుత్వం పై సిద్ధరామయ్య చేసిన పోరాటాలను ఆ పార్టీ మర్చిపోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్లకు వాగ్దానం చేసిన సంక్షేమ పథకాల ఆర్థిక చిక్కులను భరించడానికి సిద్ధంగా ఉంది కానీ, గతేడాది కర్ణాటకలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా కర్ణాటకలో ఇంతటి కరువు కనిపించలేదు. 236 తాలూకాల్లో 226 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి.
కరువు యుద్ధం
రాష్ట్ర ప్రభుత్వం రూ. 18,171 కోట్ల సాయం కోరగా, కేంద్రం అంగీకరించలేదు. కర్ణాటక సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత కేంద్రం రూ.3,454 కోట్లను విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, బీజేపీకి చెందిన 25 మంది ఎంపీలు కర్ణాటక ప్రయోజనాల కోసం పోరాడటంలో విఫలం అయ్యారని ఆరోపించడానికి సిద్ధరామయ్యా సర్కార్ కు మంచి అవకాశం దొరికింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో ఇది చర్చనీయాంశంగా మారిందని అంచనా.
సవాళ్లు
కాంట్రాక్టర్ల సంఘం ద్వారా లంచం తీసుకున్నారనే ఆరోపణలు మునుపటి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే కర్ణాటకలో అవినీతి కొనసాగుతోందని కాంట్రాక్టర్ల నేత డి కెంపన్న ఆరోపిస్తూ సిద్ధరామయ్యను ఇబ్బంది పెట్టారు. అయితే ఆ వెంటనే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో కొంత భాగాన్ని ముఖ్యమంత్రి వెంటనే విడుదల చేశారు.
బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు తరువాత కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఇదే సమయంలో హుబ్బల్లిలో ఒక ముస్లిం యువకుడు హిందూ యువతిని దారుణంగా హత్య చేయడం కర్నాటక ప్రభుత్వాన్ని తీవ్రంగా ఒత్తిడికి గురి చేసింది.తరువాత బసవరాజ రాయరెడ్డి, బిఆర్ పాటిల్, బికె హరిప్రసాద్‌తో సహా ఆయన పార్టీ నాయకులు కొందరు సృష్టించిన అడ్డంకులను కూడా సిద్ధరామయ్య దాటవలసి వచ్చింది.
డిప్యూటీ శివకుమార్
సిద్ధరామయ్య తన ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో ప్రేమ-ద్వేషపూరిత సంబంధం రాజకీయ వర్గాల్లో రహస్యం కానప్పటికీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వారు ఐక్యంగా ఉన్నట్లు సంకేతాలు అందించారు. కానీ ఇదే సమయంలో వారి మద్ధతుదారులు వారి మధ్య ఉన్న విభేదాలను బలంగా బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.వారు ప్రత్యర్ధి శిబిరంలోని నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. మరో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు కావాలనే సహకారశాఖ మంత్రి రాజన్న ఆలోచన బయటకు రావడం కూడా సిద్ధరామయ్య ఎత్తుగడలాగే శివకుమార్ వర్గం భావిస్తోంది. ఇది కచ్చితంగా ఆయన దూకుడుకు చెక్ పెడుతుందని అంటున్నారు సిద్ధరామయ్య వర్గం నాయకులు.
గ్రూపుల మంటలు
సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల్లో తనపై పాజిటివ్ పెంచుకోవాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. దీనిని ఆయన ప్రత్యర్థుల సైతం అభినందించేలా చేసింది. ఇలా సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌పై దూసుకుపోతున్నప్పుడు, అది అనేక మంది నాయకుల నుంచి సవాల్లు ఎదుర్కొంది.
సిద్దరామయ్య దళిత వ్యతిరేకి అని బీకే హరిప్రసాద్ ఆరోపించడంతో రాజకీయంగా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. దళితుడైన జి పరమేశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు.
దళిత రాజకీయాలు
హరిప్రసాద్‌కు కాంగ్రెస్ నోటీసు జారీ చేయగా, ఆయనకు పరమేశ్వర్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మద్దతు లభించింది. ఇప్పుడు అధికార పార్టీలో ప్రత్యేకించి దళిత శాసనసభ్యుల్లో అసమ్మతి కార్యకలాపాల నివేదికలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పరిపాలనలో తమ వర్గాలకు ప్రాతినిధ్యం పెంచాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు దళిత ఎమ్మెల్యేలు, నాయకులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళి, హోంమంత్రి పరమేశ్వర్‌ల భేటీ జరిగింది. దీనివెనక అనేక అర్థాలు దాగి ఉన్నాయనిపిస్తోంది.
ఎత్తులకు పై ఎత్తుల వేటలో ప్రత్యర్థులు
జార్కిహోళి, పరమేశ్వర్‌లు ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఆశించేవారు. వారు పదేపదే సమావేశాలు నిర్వహించి పార్టీలో అసమ్మతిని ఉందని చాటి చెప్పే ప్రయత్నాలు చేశారు.ఈ అసంతృప్త శాసనసభ్యుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య, శివకుమార్‌లకు కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం.
కాంగ్రెస్ 20కి పైగా లోక్‌సభ స్థానాలు గెలిస్తే - అధికార మార్పిడి తథ్యమనే అనిపిస్తోంది. అయితే దీనిని అడ్డుకోవాలని సిద్ధరామయ్య లక్ష్యంగా కనిపిస్తోంది.
కుల గణన
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ పరీక్ష రానుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
కర్నాటకలో చాలా చర్చనీయాంశమైన వాటిలో కుల గణన ఒకటి. సిద్ధరామయ్య ఆమోదించిన నిర్ణయం రాష్ట్రంలో వర్చువల్ కుల పోరుకు దారి తీసింది. ముఖ్యంగా లింగాయత్, వొక్కలిగ సంఘాల నేతలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదట లోక్‌సభ ఎన్నికల వరకు వాయిదా వేశారు. అనంతరం జనాభా లెక్కల నివేదికను కేబినెట్‌కు అందజేయాలని నిర్ణయించారు.
అయితే ప్రస్తుతానికి, జనాభా లెక్కల సమస్య అపరిష్కృతమైన సవాలుగా మిగిలిపోయింది. దీనికి మోక్షమెప్పుడో అధికారంలో ఉన్న నాయకులే నిర్ణయించాలి.