ఈ నాలుగు హమీలే కాంగ్రెస్ కు ‘జూబ్లీ’లో కీలకమా ?
ఆ నాలుగు హామీలు ఏవంటే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, పేదలకు ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్, రు. 500 కే గ్యాస్ సిలిండర్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీని రు. 10 లక్షల నుండి రు. 25 లక్షలకు పెంచటం
వచ్చేనెల 11వ తేదీన జరగబోతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ ముఖ్యంగా నాలుగు హామీలపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. కాంగ్రెస్ గెలిస్తే ఈనాలుగు హమీలే కీలకపాత్ర పోషించాయని అనుకోవాల్సుంటుంది. ఇంతకీ ఆనాలుగు హామీలు ఏవంటే మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, పేదలకు ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్, రు. 500 కే గ్యాస్ సిలిండర్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీని రు. 10 లక్షల నుండి రు. 25 లక్షలకు పెంచటం. ఉపఎన్నికలో కీలకపాత్ర పోషిస్తున్న ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ తో పాటు ప్రచారంలో ఉన్న ఇతర మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు.
డివిజన్లలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరుపై సమీక్షించి విశ్లేషించారు. ప్రచారం చేయాల్సిన విధానంపై కొన్ని సూచనలు చేశారు. నియోజకవర్గంలో సుమారు 70 మురికివాడలున్నాయి. నియోజకవర్గంలోని 4 లక్షల ఓటర్లలో అత్యధికులు మురికివాడల్లోనే(బస్తీలనచ్చా) ఉంటున్నారు. అందులోను ముఖ్యంగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వలసవచ్చి స్ధిరపడినవారు, ముస్లింలదే మెజారిటి. అందుకనే వీరిఓట్లపై ఎక్కువగా దృష్టిపెట్టాలని రేవంత్ గట్టిగా చెప్పారు. ప్రతి వంద ఓటర్లకు నలుగురు నేతలను ఇంచార్జిలుగా పెట్టమని చెప్పారు. పోలింగ్ రోజున వీళ్ళంతా వందమంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళి పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు ఓట్లేసేట్లుగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని రు. 10 లక్షల నుండి రు. 25 లక్షలకు పెంచింది. ఈరెండు పథకాల అమలు తర్వాత కొన్ని నెలలకే పేదలకు 200యూనిట్లలోపు ఉచితవిద్యుత్, రు. 500కే గ్యాస్ సిలిండర్ పథకం హమీకూడా అమల్లోకి తెచ్చింది.
బస్తీలు, పట్టణాలు లేదా హైదరాబాద్ లో పరిధిలో ఉంటున్న పేదల్లో చాలామందికి ఈనాలుగు పథకాలు వర్తిస్తున్నాయి. కాబట్టే నాలుగుపథకాల అమలుపైనే పార్టీ తరపున ప్రచారం ఎక్కువగా జరగాలని రేవంత్ పదేపదే చెప్పింది. అలాగే స్ధానికసంస్ధలఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వంచేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించాలని రేవంత్ చెప్పారు. ఇంటింటికి వెళ్ళి ప్రచారంచేయాల్సిన అవసరాన్ని చెప్పారు. ప్రతిఇంటికి ఉదయం 7 గంటలకల్లావెళ్ళి పేదలకోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధికార్యక్రమాలను వివరించాలని నిర్దేశించారు. నియోజకవర్గంలోని షేక్ పేట డివిజన్ లో బీసీలు అత్యధికంగా ఉన్న విషయాన్ని రేవంత్ మంత్రులు తదితరులకు గుర్తుచేశారు.
అలాగే సినీపరిశ్రమకు ప్రభుత్వం మద్దతుగా నిలబడిన విషయాన్ని కూడా విస్తృతంగా ప్రచారంచేయాలని ఆదేశించారు. ఎందుకంటే నియోజకవర్గంలో సినీపరిశ్రమకు చెందిన ఓట్లు సుమారు 25 వేలున్నాయి. అగ్రనటులు, దర్శక, నిర్మాతల నుండి దిగువస్ధాయిలో పనిచేసే లైట్ బాయ్, టచప్ బాయ్ వరకు ఉంటున్నారు. పరిశ్రమలోని ప్రముఖులు ఓటింగుకు వచ్చినా రాకపోయినా కిందిస్ధాయి వాళ్ళయితే కచ్చితంగా వస్తారు. కాబట్టి వీళ్ళల్లో అత్యధికులు ప్రభుత్వ పథకాల లబ్దిదారాలుగా ఉంటారని రేవంత్ అంచనా వేశారు. అందుకనే సినీపరిశ్రమకు చెందిన 25 వేలమందిని కూడా కలిసి ఓట్లను అడగాలని, ఒకటికి రెండుమూడుసార్లు కలిసి పథకాల అమలుపై వివరించాలని గట్టిగా చెప్పారు.
నియోజకవర్గంలోనే ఉన్న కాసుబ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, మధురానగర్ పార్కుల్లో వాకింగ్ చేస్తున్న వారిని కూడా ఉదయమే వెళ్ళి కలవాని నేతలను రేవంత్ ఆదేశించారు. ఇక్కడ వాకింగ్ చేసేవారిలో ఎలైట్ సెక్షన్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రభుత్వంచేస్తున్న అభివృద్ధిని వివరించాలని చెప్పారు. సెటిలర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను కూడా వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ కు ఓట్లేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాలని రేవంత్ పదేపదే చెప్పారు. మంగళవారం సాయంత్రం పోలీసు గ్రౌండులో సినీ కార్మికుల ఆధ్వర్యంలో రేవంత్ కు సన్మానం జరగబోతోంది. ఈ సందర్భన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకోవాలని రేవంత్ తెలిపారు.
మొత్తంమీద జూబ్లీహిల్స్ గెలుపును రేవంత్ ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్ధమవుతోంది. ప్రతిరోజు ప్రచారం తీరుతెన్నులను సమీక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఒక బహిరంగసభలో పాల్గొనటంతో పాటు నాలుగు రోడ్ షోల్లో కూడా రేవంత్ పాల్గొంటున్నారు. అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ గెలుపును రేవంత్ వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టగా తీసుకున్నారు చివరకు ఏమవుతుందో చూడాలి.