తమిళనాడులో జల్లికట్టు విజేతలకు ఈసారి భారీ ప్రైజ్‌లు..
తమిళనాడులో మూడో చోట్ల జల్లికట్టు (Jallikattu) పోటీలు జరుగుతున్నాయి. ఉత్తమ ఎద్దు యజమానికి ట్రాక్టర్, బుల్ టేమర్‌కు కారును బహుమతిగా ఇవ్వనున్నారు.;
తమిళుల సంస్కృతిలో జట్టికట్టు ఒక భాగం. ఏటా అక్కడ ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈసారి మధురై(Madurai)లోని అవనియపురం గ్రామంలో నిర్వహిస్తున్నారు. తొలిరోజు పోటీలో 1100 ఎద్దులు, 900 మంది యువకులు పాల్గొన్నారు. రేపు (జనవరి 15) న పాలమేడులో, 16వ తేదీన అలంగనల్లూరులో ఈ పోటీలు జరగతాయి. రంకెలేస్తూ పరుగులు తీసే ఈ ఎద్దులను నియంత్రించి, ఆపగలిగిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ సారి పోటీల్లో ఎద్దు యజమానికి రూ.11 లక్షల విలువ చేసే ట్రాక్టర్, ఎద్దును నిలువరించిన వ్యక్తి (బుల్ టేమర్)కు రూ.8 లక్షల విలువైన కారు ఇస్తున్నారు. మదురైలో మరో రెండు చోట్ల కూడా జల్లికట్లు పోటీలు నిర్వహిస్తున్నారు.
జల్లికట్టు గురించి..
జల్లికట్టు.. తమిళనాడు (Tamilnadu)లో 2000 ఏళ్ల ప్రాచీన క్రీడా వారసత్వం. తొలి రోజుల్లో ఎద్దును లొంగదీసుకున్న యువకులను మహిళలు తమ భర్తలుగా ఎన్నుకునేవారట. తర్వాతి కాలంలో యువకులు తమ ధైర్య సాహసాలను నిరూపించుకునే ఆటగా రూపాంతరం చెందింది. ఎద్దు మెడకు బంగారం లాంటి విలువైన పట్టీని కట్టేవారు. పరిగెడుతున్న ఎద్దును పట్టుకొని ఆ పట్టీని తీసుకున్నవారిని విజేతగా ప్రకటించేవారు. ప్రస్తుతం ఎద్దు మెడకు ఏ పట్టీ కట్టడం లేదు. పరిగెడుతున్న ఎద్దును లొంగదీసుకోవడానికే నేటి జల్లికట్టు పరిమితమైంది. 2006లో ఒక వీక్షకుడి మరణంతో మద్రాస్ హైకోర్టు ఈ పోటీలను నిషేధించింది. 2014లో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని సమర్థించింది.
అయితే తమిళనాడు ప్రభుత్వం 2017లో ప్రజల నిరసనల మధ్య, జల్లికట్టును అనుమతించేందుకు ప్రివెన్షన్ ఆఫ్ క్రూరత్వ టు యానిమల్స్ చట్టం (Prevention of Cruelty to Animals Act)లో సవరణ చేసింది. 2023 మేలో సుప్రీంకోర్టు ఈ సవరణలను సమర్థించి మార్గం సుగమం చేసింది.