కమల్ హాసన్‌కు కేఎఫ్‌సీసీ డెడ్‌లైన్..

‘కన్నడ భాష గురించి వివాదాస్పద వ్యాఖ్య చేసిన సినీనటుడు కమల్ హాసన్ రేపటిలోగా క్షమాపణ చెప్పకపోతే 'థగ్ లైఫ్' సినిమా కర్ణాటకలో రిలీజ్ కాదు’ - KFCC;

Update: 2025-05-29 13:24 GMT
Click the Play button to listen to article

కన్నడ భాష గురించి వివాదాస్పద వ్యాఖ్య చేసిన సినీనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రేపటి (మే 30)లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటక(Karnataka)లో ఆయన నటించిన 'థగ్ లైఫ్' సినిమా విడుదలకు అనుమతించమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) పేర్కొంది.

ఇంతకు కమల్ ఏమన్నారు?

మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. చెన్నైలో జరిగిన ఆ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్‌లో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని అన్నారు. దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేగింది. కన్నడ భాషా ప్రేమికులు నిరసనలకు దిగారు. ఆయన ఫొటోలను కాల్చి నిరసన తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక సంస్థ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

‘కమల్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం’

సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులతో మాట్లాడిన తర్వాత కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఎం. నరసింహలు విలేఖరులతో మాట్లాడారు. "కమల్ సినిమాను నిషేధించాలని చాలా కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేం ఆ విషయంపై చర్చించాం. ఆయన చేసింది తప్పు అని మేమంతా భావిస్తున్నాం. కమల్‌తో కలిసి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం, " అని నరసింహలు అన్నారు.

కాగా రేపటిలోగా కమల్ క్షమాపణ చెప్పకపోతే సినిమాను విడుదలకు KFCC అనుమతించదని KFCC మాజీ అధ్యక్షుడు సారా గోవిందు పేర్కొన్నారు.

"కమల్ పట్ల మాకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన ఈరోజు లేదా రేపు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే.. మేం కన్నడ కార్యకర్తలకు మద్దతు ఇస్తాం," అని గోవిందు అన్నారు.

క్షమాపణ చెప్పడం ఆయన నైతిక బాధ్యత..

2008-2010 మధ్య KFCC కి నాయకత్వం వహించిన నటి జయమాల మాట్లాడుతూ.."భాషా వివాదం తలెత్తినప్పుడల్లా కన్నడిగులంతా ఐక్యంగా ఉండాలి. అది మన కర్తవ్యం. కమల్ హాసన్ తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా ఆయన ప్రకటన తప్పు. కన్నడ తమిళం నుండి పుట్టలేదు.తప్పును సమర్థించుకోడానికి బదులు విచారం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. క్షమాపణ చెప్పడం ఆయన నైతిక బాధ్యత," అని పేర్కొన్నారు.

ఇటు కమల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కన్నడపై తాను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో చెప్పినవని, "ప్రేమ ఎప్పటికీ క్షమాపణ కోరదు" అని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News