ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించిన కన్నడ భాషాభిమానులు
బెంగళూర్ లో జరిగిన సమావేశంలో కన్నడ బ్యానర్లు లేకపోవడం పై అసంతృప్తి;
By : The Federal
Update: 2025-03-24 12:25 GMT
బెంగళూర్ లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకత్వ సమావేశంలో మరోసారి కన్నడ భాషా వివాదం తలెత్తింది. ఇక్కడ జరిగిన సమావేశాల్లో బ్యానర్లు మొత్తం హిందీలోనే ఉండటంతో కన్నడ భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ నాట కన్నడ బ్యానర్లు లేకపోవడం ఏమిటని నిలదీశారు.
కర్ణాటక భాషను పూర్తిగా పక్కనపెట్టి అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాన్ని ముగించిన తీరుపై కన్నడ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఆర్ఎస్ఎస్ కన్నడను విస్మరించి వేదికపై కేవలం హిందీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది.’’ అని ఒక సోషల్ మీడియా యూజర్ రాసుకొచ్చారు. ‘‘ఆర్ఎస్ఎస్ కన్నడ కంటే హిందీని ఎక్కువగా ఇష్టపడుతున్నారని రుజువు అవుతుందని స్పష్టం చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెంగళూర్.. కన్నడ..
మరో కర్ణాటక నివాసి మాట్లాడుతూ.. ‘‘ఆర్ఎస్ఎస్ కనీసం ఒక్క కన్నడ పదాన్ని కూడా ఉపయోగించలేదు. బెంగళూర్ ఒక కన్నడ నగరం. కన్నడ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ కాపాడుతుందని మనం అనుకోవచ్చా? కన్నడ లేకుండా ఉంటే బెంగళూర్ లో హిందూ ధర్మం నశించిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. నగరం సమీపంలోని చన్నెనహళ్లి ప్రాంతంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ శుక్రవారం ప్రారంభించారు.
హిందీకి ప్రొత్సాహం...
కొంతమంది విమర్శకుల ఆర్ఎస్ఎస్ సంస్కృతి పేరుతో ఒక భాషను ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. ‘‘బెంగళూర్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక గర్వాన్ని ప్రబోధిస్తుంది.
కానీ కన్నడను పక్కన పెట్టి కర్ణాటకను అగౌరవపరుస్తుంది. ఇది మన భూమి, మన భాష, హిందీ రుద్దడానికి ఇది సరైన వేదిక కాదు. కర్ణాటక హిందీ కాలనీ కాదు’’ అని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కన్నడపై యుద్ధం..
మరో పోస్ట్ ఆర్ఎస్ఎస్ ‘‘కన్నడ, కన్నడిగు గుర్తింపుపై యుద్ధం’’ అని ప్రకటించిందని ఆరోపించింది. అఖిల భారతీయ ప్రతినిధి సభను ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థగా పరిగణిస్తారు. ఇది సంస్థాగత ప్రణాళికలు, జాతీయ సమస్యలను చర్చించడానికి ప్రతి సంవత్సరం సమావేశం అవుతుంది.