నక్సలైట్ లీడర్ కొండపల్లి సీతారామయ్య చివరి రోజులు ఎలా గడిచాయంటే!
యావత్ దేశాన్ని శాసించిన కొండపల్లి సీతారామయ్య జీవిత శరమాంకం చాలా దుర్బరంగా సాగిందా.. ఇంతకీ ఈ కొండపల్లి ఎవరు;
By : The Federal
Update: 2024-04-12 09:09 GMT
కొండపల్లి సీతారామయ్య ఎలియాస్ కేఎస్. ఒకప్పుడు ఈ రెండక్షరాలు యావత్తు దేశాన్నీ ప్రత్యేకించి ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన పేరు. పోలీసులకు టెర్రర్. క్యాడర్ కి ఫేవర్. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ప్రముఖ నక్సలైటు. ఈవేళంటే నక్సలైట్లన్నా కమ్యూనిస్టులన్నా భక్తి లేకుండా పోయింది గాని 1980ల ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్య కేకేస్తే గోల్కొండ ఘొల్లుమనాల్సిందే. సచివాలయం దద్దరిల్లాల్సిందే.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నక్సలైట్లు ఏమి పిలుపిస్తారోనని పోలీసులు గజగజవణాకాల్సిందే. అటువంటి లీడర్ కేఎస్. ఈవేళ అంటే ఏప్రీల్ 12న ఆయన వర్థంతి. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఆయన ఇదే రోజున విజయవాడలోని తన మనుమరాలు సంధ్య ఇంట్లో కన్నుమూశారు. జొన్నపాడు నుంచి ప్రస్థానం...
కమ్యూనిస్టులకు పుట్టిల్లయిన కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్ నందివాడ మండలం లింగవరం కొండపల్లి సీతారామయ్య సొంతూరు. పెరిగింది మాత్రం ఆ పక్కనున్న జొన్నపాడు.చిన్నతనంలోనే కమ్యూనిస్టుల ప్రభావంతో పెరిగి పెద్దయిన సీతారామయ్య ఆనాటి ప్రముఖ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చండ్ర రాజేశ్వరరావే ఆయనకి కోటేశ్వరమ్మకి పెళ్లి చేశారని చెబుతారు.చాలా చిన్నవయసులోనే ఆయన కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా శాఖకు కార్యదర్శిగా పని చేశారు. కమ్యూనిస్టుల సారథ్యంలో నడిచిన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన చురుగ్గానే పాల్గొన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించిన తీరుపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిలో సీతారామయ్య కూడా ఒకరొకరు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ 1964లో చీలిపోయింది.
వరంగల్ లో టీటర్ గా...
ఆ చీలిక సమయంలో తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైన సీతారామయ్య వరంగల్ వెళ్లి సెయింట్ గాబ్రియల్స్ హైస్కూలులో హీందీ టీచర్ గా పని చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో మరో విప్లవనాయకుడైన కేజీ సత్యమూర్తితో కలిసి సీపీఐ ఎంఎల్ లో చేరడం ఆ తర్వాత ఆ పార్టీకే నాయకత్వం వహించడం చకచకా జరిగిపోయాయి. 1977 ఏప్రిల్ తిరిగొచ్చే సమయానికి ఆయన తొలిసారి నాగపూర్ లో అరెస్ట్ అవుతారు. ఇక అప్పటి నుంచి సుదీర్ఘ కాలం అజ్ఞాతవాసంలోనే గడిపారు. ఈ సందర్భంలోనే మరో పార్టీ కామ్రేడ్ తో సహజీవనం చేశారని చెబుతారు. కొండపల్లిని ఆస్పత్రి నుంచి తప్పించడానికి పోలీసుల్నే కాల్చేసి ఆయన్ను బయటికి తీసుకువచ్చారంటే కేఎస్ హవా ఎంతటితో మీరు ఊహించవచ్చు. అటువంటి లీడర్ ఏమాత్రం హంగూ ఆర్భాటం లేకుండా చాలా సౌమ్యంగా లొంగిపోయాడు. ఆయన లొంగిపోయిన తీరు కూడా చాలా విమర్శలకు దారితీసింది. దశాబ్దం పాటు పోలీసుల నుంచి తప్పించుకున్న మిలిటెంట్ పీపుల్స్ వార్ గ్రూప్ (పిడబ్ల్యుజి) వ్యవస్థాపక నాయకుడు కొండపల్లి సీతారామయ్య , 74 ఏళ్ల వయసులో లుంగీ, బనియన్ తో లొంగిపోయాడు.
సీతారామయ్యను అరెస్ట్ చేసిన డీటీ నాయక్...
"ప్రజా విప్లవం" కోసం జరిగిన యుద్ధంలో విసిగిపోయిన నక్సలైట్ నాయకుడిని కృష్ణా జిల్లాలోని అనుమనపల్లి గ్రామంలో పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ డి.టి.నాయక్ నేతృత్వంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఆశ్చర్యకరంగా, ఇన్నాళ్లూ ఆంధ్ర ప్రదేశ్‌లో టెర్రర్ అనే పేరును వినిపించిన కె. సీతారామయ్యను అరెస్టు చేసే సమయానికి ఆయనకు ఎలాంటి భద్రత లేదు. రాష్ట్రంలో ఒక నక్సలైట్‌ను అరెస్టు చేసినందుకు ప్రకటించిన అతిపెద్ద మొత్తం - రూ. 3 లక్షల రివార్డు. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లడానికి ఎవ్వరూ రాలేదు. అయితే అది లొంగిపోవడం కాదని సీతారామయ్య పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేందుకు వాహనాన్ని తీసుకురావడానికి తన అంగరక్షకులను పంపినందుకే తనకు ఎస్కార్ట్ లేకుండా పోయిందన్నారు ఆవేళ."నేను ఎటువంటి ప్రతిఘటన చేయలేకపోయాను" అని చెప్పిన కొండపల్లి పోలీసులతో కలిసి నిరాయుధంగా వస్తారు. నక్సలైట్ ఉద్యమ ఉద్దాన పతనాలకు సజీవ సాక్ష్యం సీతారామయ్య.
పోలీసుల ఆత్మస్థైర్యం పెంచిన అరెస్ట్...
తుపాకితో గడగడ లాడించిన పీపుల్స్ వార్ గ్రూపు తమ నాయకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళుతుంటే అసలు ప్రతిఘటనే లేకపోవడమే పోలీసులకు ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత పోలీసుల ఆత్మస్థైర్యం అమాంతం పెరిగింది. దీనికితోడు మావోయిస్టు గ్రూపుల మధ్య విభేదాలు పోలీసులకు బాగా కలిసివచ్చాయి. సీతారామయ్యతో తీవ్రమైన విభేదాలు ఉన్న ఆయన మాజీ లెఫ్టినెంట్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా తన మాజీ గురువుతో ఏ విధంగానూ లాభం లేదనే అభిప్రాయంతోనే ఉన్నారు. తన మద్దతుదారులతో కలిసి సీతారామయ్యపై పార్టీ విద్రోహ ముద్ర వేశారు. 1991లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. 1993లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కొన్నేళ్లు జైల్లో ఉన్న తర్వాత వయసును పరిగణలోకి తీసుకుని మానవతా ధృక్పదంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేస్తారు.
తుది దశలో కోటేశ్వరమ్మ ఇంటికి...
రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమైన కొండపల్లిసీతారామయ్య జీవిత శరమాంకంలో తన భార్య కోటేశ్వరమ్మ ఇంటికి చేరతారు. అయితే ఆమె ఆయన్ను తన భర్త అనే కంటే ఓ మనిషిగా మాత్రమే ఆదరించి ఆశ్రయం కల్పిస్తుంది. ఆ వివరాలన్నింటిని ఆమె తన నిర్జన వారధి పుస్తకంలో సోదాహరణంగా వివరిస్తుంది. తన మనుమరాలు సంధ్య ఉన్న వాటాలోనే ఓ గదిని ఏర్పాటు చేసి ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. జీవిత తుది దశలో ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చింది. కొటేశ్వరమ్మ, సీతారామయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు మనుమరాళ్లు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కొండపల్లి సీతారామయ్య పిలుపిస్తే లక్షలాది మంది తరలివచ్చే నాటి పరిస్థితి నేడు లేదు. అప్పటికే పార్టీ కకావికలైంది. కమ్యూనిస్టుల అస్థిత్వమే ప్రశ్నార్థకమవుతోంది. అటువంటి స్థితిలో కొండపల్లి లాంటి వారి ఆవేదన అరణ్యరోదనగానే మిగిలింది. జీవితాల్ని ఉద్యమాల కోసం త్యాగం చేసిన వారు చివరకు సెల్ఫ్ పిటీ (వాళ్ల మీద వాళ్లే జాలిపడేలా)లో బతకాల్సిన పరిస్థితి. వయసుతో పాటు వచ్చిన రుగ్మతలు, మానసిక సమతూకాన్ని కోల్పోయిన దుస్థితి వంటి వాటితో 2002 ఏప్రిల్ 12న కొండపల్లి సీతారామయ్య కన్నుమూశారు. అశేష ప్రజానీకం తరలివచ్చి ఆయనకు ఆఖరి నివాళులు అర్పిస్తారు.