పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ముకుందన్ రాజీనామా..
నాలుగు నెలల క్రితమే పార్టీలో చేరిన అన్బుమణి రామదాస్ మేనల్లుడు అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి కారణమేంటి?;
పట్టాలి మక్కల్ కట్చి (PMK) యువజన విభాగం అధ్యక్ష పదవికి పి. ముకుందన్ (Mukundan) రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విభేదాలకు కారణాలేంటి?
ఈ మధ్యకాలంలో పీఎంకే చీఫ్ ఎస్ రామదాస్(Dr. S Ramadoss), ఆయన కొడుకు అన్బుమణి రామదాస్ (Anbumani Ramadoss)కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన కొడుకు పార్టీకి ద్రోహం చేశాడని, కుటుంబ విలువలను మంటగలిపాడని గురువారం రామదాస్ బహిరంగంగానే విమర్శించారు. తిండివనం సమీపంలోని తైలపురం నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. 35 ఏళ్ల వయసులో అన్బుమణిని కేంద్ర మంత్రిని చేయడమే తాను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. అసలు అన్బుమణికి నాయకత్వ లక్షణాలే లేవని, అతని నిర్లక్ష్య ప్రవర్తన పార్టీని దెబ్బతీస్తోందని అన్నారు. గతేడాది డిసెంబర్లో పుదుచ్చేరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి కార్యకర్తలను, పార్టీ సీనియర్ నాయకుడు తమిళకుమారన్ను హాజరుకాకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్బుమణిని తప్పించి తానే స్వయంగా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ మార్పు రాబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికేనని రామదాస్ చెప్పుకొచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో రామదాస్ AIADMKతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే అన్బుమణి BJP నేతృత్వంలోని NDAతో కొనసాగాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరానికి ఆజ్యం పోసిందని సమాచారం.
అన్బుమణికి కోపం తెప్పిచిందేమిటి?
పార్టీ చీఫ్గా ఉన్న తనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడంపై అన్బుమణి ఆగ్రహంగా ఉన్నారు. తన మేనల్లుడు ముకుందన్ను పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి నియమకంపై కూడా అన్బుమణి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్లో పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ముకుందన్ను యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించాలని రామదాస్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ముకుందన్ పార్టీలో చేరారు. ఇంతటి కీలక పదవికి తగినంత అనుభవం లేదని ముకుందన్ నియామకాన్ని అన్బుమణి బహిరంగంగానే వ్యతిరేకించారు.
ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం..
తన రాజీనామా ప్రకటనలో ఇద్దరి నాయకుల పట్ల ముకుందన్ విధేయత చాటుకున్నారు. "వ్యక్తిగత కారణాల వల్ల పీఎంకే యూత్ వింగ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. డాక్టర్ రామదాస్ నా కుటుంబ దైవం. అన్బుమణి రామదాస్ నా భవిష్యత్తు" అని పేర్కొన్నారు. ఇద్దరిని ఇలా పేర్కొనడం వెనక పార్టీలో ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నంగా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.