అనాథ పిల్లల కోసం సీఎం స్టాలిన్ కొత్త పథకం..
‘‘రాజకీయాలు అంటే అధికారంలోకి రావడం, అధికారం కోసం జీవించడం అని కాదు. రాజకీయాలు అంటే ప్రజా సేవ చేయడం.’’ - తమిళనాడు సీఎం;
తమిళనాడు(Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ ఉద్యమకారుడు సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 15) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) ‘అన్బుక్కరంగల్’ (Anbukkarangal) పథకాన్ని ప్రారంభించారు. అనాథ పిల్లల విద్యకు లేదా తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయిన 6,082 మంది పిల్లలకు ఈ పథకం కింద నెలకు రూ.2వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. 18 ఏళ్లు నిండే వరకు అందే ఈ ఆర్థిక సాయం.. వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉపయోగపడుతుంది.
‘ప్రజా సేవే మా లక్ష్యం’
‘‘రాజకీయాలు అంటే అధికారంలోకి రావడం, అధికారం కోసం జీవించడం అని కొంతమంది భావిస్తుంటారు. కాని మాకు రాజకీయాలు అంటే ప్రజా సేవ చేయడం. మా నాయకులు, 'పెరియార్' ఈవీ రామసామి, మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి.. కష్టపడి పనిచేసేలా మాకు శిక్షణ ఇచ్చారు. వారి శిక్షణను ఎన్నటికి మరువం.’’ అని అన్నారు సీఎం స్టాలిన్.