జాతీయ విపత్తుగా ప్రకటించాలి: కేరళలో అధికార, ప్రతిపక్షాల డిమాండ్

భారీ ప్రాణనష్టం సంభవించిన వయనాడ్ దుర్ఘటనను జాతీయ విపత్తుగా చూడాలని కేరళ సర్కారు డిమాండ్‌ను బిజెపి నేతృత్వంలోని కేంద్రం వ్యతిరేకిస్తోంది.

Update: 2024-08-02 08:46 GMT
అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌

కేరళ సీఎం పినరయి విజయన్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గురువారం వయనాడ్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించారు. కొండచెరియలు ఎక్కువగా విరిగిపడ్డ చూరల్‌మలాకు వెళ్లే ముందు విజయన్ అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. రాహుల్ తన సోదరి ప్రియాంక, కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత VD సతీశన్‌, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి బాధిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను సందర్శించారు. అయితే ఇద్దరి నేతల నుంచి వస్తున్న డిమాండ్ ఒక్కటే. వయనాడ్ దుర్ఘటనను 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. 

విపత్తు వేళ ఐక్యంగా..

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి రావడం ఇదే తొలిసారి కాదు. 2018 వరదల సమయంలో అప్పటి ప్రతిపక్షనేత రమేష్ చెన్నితాలతో కలిసి ముఖ్యమంత్రి విజయన్ ఏరియల్ సర్వే చేసి వార్తల్లోకెక్కారు. అయితే కోవిడ్ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సవాల్ చేశాయి.

ఐఎండీ ముందుగానే హెచ్చరించిందా?

కేరళలో భారీ వర్షాలకు సంబంధించి సాధారణ హెచ్చరికను ముందుగానే జారీ చేశామని భారత వాతావరణశాఖ (ఐఎండీ) చీఫ్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. జులై 30వ తేదీ ఉదయమే రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేశామని చెప్పారు. అయితే అదే రోజు తెల్లవారుజామునే జల ప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే.

'జాతీయ విపత్తు' హోదాపై కేంద్రం-రాష్ట్ర మధ్య విభేదాలు..

భారీ ప్రాణనష్టం సంభవించిన వయనాడ్ దుర్ఘటనను జాతీయ విపత్తుగా చూడాలని కేరళ సర్కారు డిమాండ్‌ను బిజెపి నేతృత్వంలోని కేంద్రం వ్యతిరేకిస్తోంది.అయితే భారత వాతావరణశాఖ (ఐఎండీ) పంపిన హెచ్చరికపై స్పందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో అన్నారు. అయితే కేరళకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌నే జారీ చేసిందని ముఖ్యమంత్రి విజయన్‌ అంటున్నారు. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తింది. కొండ చెరియలు విరిగిపడ్డ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన రాహుల్ గాంధీ కూడా ఇదే డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు.

కేరళ ఎంపీలు పార్లమెంట్‌లో తమ వాణిని బలంగా వినిపించారు. వయనాడ్ దుర్ఘటనను “జాతీయ విపత్తు”గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విపత్తు నిర్వహణ జాతీయ విధానం ప్రకారం అలా ప్రకటించడం కుదరదని హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.

అమిత్ షాకు శశిథరూర్ లేఖ..

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. "తీవ్ర ప్రకృతి విపత్తు"గా ప్రకటించాలని ఆయన కోరారు. ఉత్తరాఖండ్‌లో 2013 ఆకస్మిక వరదలు, 2014 నాటి హుద్‌హుద్ తుఫాను "తీవ్రమైన ప్రకృతి" విపత్తులుగా ప్రకటించారు.   

Tags:    

Similar News