ఇందిరమ్మ ఇళ్లు రాలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా సుందరగిరిలో చోటుచేసుకున్న ఘటన;
తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు (దంపతులు) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్మాయత్నానికి పాల్పడ్డారు. సుందరగిరి గ్రామానికి చెందిన వంతడ్పుల శ్రీనివాస్ , సృజన దంపతులు కరీంనగర్ లో అద్దెకు ఉంటున్నారు. వీరికి స్వంత ఇల్లు లేదు. గత మే నెలలో గ్రామ కమిటీని వీళ్లు నిలదీసినప్పటికీ మంజూరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, అధికారులకు అనేక పర్యాయాలు విన్నవించుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దంపతులు ఈ చర్యకు పాల్పడ్డారు.
సుందరగిరికి చెందిన ఈ దంపతులు గతంలో ఇందిరమ్మ ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో తాము ఏళ్ల తరబడి పని చేస్తున్నాం’’ అని బాధితులు చెప్పారు . ఇందుకు నిరసనగా కరీంనగర్ హుస్నాబాద్ జాతీయ రహదారిపై దంపతులు బుధవారం ఉదయం కొద్ది సేపు బైఠాయించారు. సడెన్ గా బ్యాగు నుంచి దంపతులు పెట్రోల్ బాటిల్ తీసుకుని ఒంటిపై పోసుకున్నారు. నోట్లో కూడా కొంత పోసుకున్నారు. దీన్ని గమనించిన స్థానికులు దంపతుల నుంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. ఆత్మహత్య చేసుకోకుండా వారించారు. ముందు జాగ్రత్త చర్యగా 108 నెంబర్ కి ఫోన్ చేశారు. వాహనంలో వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని హుస్నాబాద్ ప్రభుత్వాసుత్రికి తరలించారు. ‘ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తన కోటానుంచి మరో 20 ఇందిరమ్మఇళ్లు కేటాయించారు. ఈ జాబితాలో శ్రీనివాస్, సృజన దంపతుల పేర్లు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన తాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని’’ బాధితులు చెప్పారు.