తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో కోతే..!

ఉద్యోగులతో పాటు తల్లిదండ్రుల ఖాతాల్లోనూ 1వ తేదీనే డబ్బులు జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.

Update: 2025-10-18 14:31 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తానన్నారు. శిల్ప కళావేదికలో నిర్వహించిన ‘కొలువుల పండగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్.. గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికయినా 783 మందికి పలువురు మంత్రులతో కలిసి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగానే తల్లిదండ్రులు, పుట్టిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను అంకితభావం నిర్వర్తిస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ‘‘ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతాల్లో 10 నుంచి 15శాతం కోత విధిస్తాం. ఆ మొత్తాన్ని ఉద్యోగులతో పాటే ఒకటవ తేదీనే తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేస్తాం. దాని కోసం చట్టం కూడా తెస్తాం’’ అని స్పష్టం చేశారు.

‘‘శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈషాన్ రెడ్డి, యాదయ్య లాంటి విద్యార్థులు తమ ప్రాణాలను ధారపోసి రాష్ట్రాన్ని సాధించారు. యూనివర్సిటీల్లో వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఆనాటి రాజకీయ నాయకులు మాత్రం.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని ఆయుధంగా మార్చుకుని పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారు. అధికారం చేతిలో ఉన్నా నిరుద్యోగులను పట్టించుకోలేదు. వాళ్ల కుటుంబం, బంధు వర్గాన్ని శ్రీమంతులుగా మార్చుకుంటూ పాలన కొనసాగించారు. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం.. కూలేశ్వరం అయ్యుండేదా ? లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్ట్ మూడేళ్లకే కూలేదా..!’’ అని అన్నారు.

‘‘తన ఫామ్ హౌస్‌లో ఎకరా భూమికి రూ.కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను యువత, ప్రజలకు ఎందుకు నేర్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వం పాఠశాలలో చదివిన నేను.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీ ఆశీర్వాదాలే కారణం. గ్రూప్-1 ఉద్యోగాలను రూ.3 కోట్లకు అమ్ముకున్నామని కొందరు విమర్శించారు. రూ.3 కోట్లకు ఉద్యోగం కొనగలరా? అలాంటి మాటలతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన వారిని అవమానించారు. గతంలో ఎన్నడూ జరగని కులగణన.. కాంగ్రెస్ పోరాటం వల్లే సాధ్యమైంది. అతి త్వరలో దేశమంతా జరగనుంది’’ అని తెలిపారు.

Tags:    

Similar News