ఫోకస్ లేని బంద్ ‘పోరాటం’ అవుతుందా?

బంద్ అంటే ఒక పోరాటం. అక్టోబర్ 18న జరిగిన బంద్ పోరాటం ఎవరి మీద చేశారు?

Update: 2025-10-18 09:09 GMT
Telangana bandh

శనివారం నాడు తెలంగాణలో వెనకబడిన కులాల (బిసి) నేతలు ఏకమై బంద్ నిర్వహించారు. స్థానిక సంస్థలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కావాలనే డిమాండ్ తో ఈ బంద్(Telangana bandh) కు పిలుపునిచ్చారు. కొంతమంది స్వతంత్ర బిసి నాయకులు, ఇతర పార్టీలలో ఉన్న బిసి నాయకులు, బిసి మేధావులు ఒక జాయింట్ యాక్సన్ కమిటీ గా ఏర్పడి బంద్ కు పిలుపు ఇచ్చారు. పిలుపుకు మంచి స్సందన వచ్చింది. అన్ని బిసి కులాలు పాల్గొన్నాయి.

భారత రాష్ట్ర సమితి ( బిఆర్ ఎస్) బంద్ ని సమర్థించింది. తెలంగాణ జాగృతి బంద్ కి మద్దతు ప్రకటించింది, సమర్థించింది. మావోయిస్టులు బలపర్చారు. వామపక్షాలు సమర్థించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలాయాక్టివ్ గా బంద్ పాల్గొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిసి మంత్రులను, బిసినేతలను పంపి మరింత యాక్టివ్ గా పాల్గొని బంద్ ని విజయవంతంగా చేసేందుకు కృషి చేసింది. ఫలితంగా బంద్ బాగానే జరిగిందనాలి. మంత్రులు, ఎంపిలు, ఇతర సీనియర్ నేతలు అంతా రోడ్డెక్కారు. ఒక్క సారి తెలంగాణ ఉద్యమం నాటి సకల జనులు సమ్మెను గుర్తు చేసింది ఈ బంద్ . బిసికులాలు గతంలో ఎపుడు ఇలా ఇంత ఐక్యం చాటలేదు.


ఇక్కడే సమస్య...

బంద్ అంటే ఒక పోరాటం. అక్టోబర్ 18న జరిగిన బంద్ పోరాటం ఎవరి మీద చేశారు?

అదే జవాబులేని ప్రశ్న. బంద్ మీద రాష్ట్ర రవాణ మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలో ని 9 షెడ్యూల్ పెట్టేందుకు బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సహకరించలేదని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులను గవర్నర్ (బిజెపి) ఆమోదించలేదని చెబుతూ ఈ బంద్ కేంద్రానికి ఒక హెచ్చరిక అన్నారు. రిజర్వేషన్లకు సహకరించకపోతే ప్రజలు ముందు దోషిలాగా నిలబడాల్సి వస్తుందని పొన్నం అన్నారు.

బిజెపికి చెందిన బిసి లోక్ సభ సభ్యులు ఈటెల రాజేందర్ (మల్కాజ్ గిరి) బంద్ కు మరొక అర్థం చెప్పారు. “ప్రాంతీయ పార్టీల వల్ల, కాంగ్రెస్ వల్ల బిసిలకు న్యాయం జరగదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తున్నది. అందుకే ఇది కాంగ్రెస్ వ్యతిరేకపోరాటం. ఇదింకా కొనసాగుతుంది,” అని స్పష్టంగా ఇక బిఆర్ ఎస్ ను బిజెపి జోలికి వెళ్లకుండా కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. కోర్టు కొట్టివేస్తుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల మీద జివొ ఇచ్చి మోసం చెసిందని బిఆర్ ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. తెలంగాణ జాగృతి కవిత కూడా 42 శాతం రిజర్వేషన్లు అమలుకాకపోవడానికి కాంగ్రెసే కారణమని అన్నారు.



మొత్తానికి తేలుతున్న దేమిటి ?

రిజర్వేషన్లు తెచ్చాం, 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్రం సహకరించలేదు, కారణం బిజెపియేనని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ కు చిత్త శుద్ధి లేదని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు రావని బిజెపి, బిఆర్ ఎస్ లు అంటున్నాయి.


బిసి యాక్టివిస్టులు ఈ తమాషాకు బలయ్యారని పిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ బంద్ లోకి ప్రవేశించి యాక్టివిస్టు చేతుల్లోనుంచి బంద్ ను లాగేసుకున్నట్లు ఈ రోజు రోడ్ల మీద జరిగిన తంతు చూస్తే అర్థమవుతుంది. నిజానికి బిఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపిలు ఏవీ కూడా బిసి రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రోయాక్టివ్ గా పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ కులగణన రాహుల్ గాంధీ తీసుకున్న పాలసీ నిర్ణయం వల్ల చేయాల్సి వచ్చింది. బిఆర్ఎస్ మాటల్లో తప్ప ఎప్పడూ బిసిలను సమర్థించిందిలేదు. ఇక బిజెపి సైద్దాంతికంగా రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఈ పార్టీలన్నీ ఇపుడు తమ సంస్థల్లోని బిసి నాయకులను బంద్ లోకి పంపి బంద్ ను గుప్పిట్లోకి తీసుకున్నాయి. మీడియ ఫ్రేమ్స్ నిండా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలే ఉన్నారు.


దీనితో బంద్ కి ఒక ఫోకస్ లేకుండా పోయింది. పోకస్ లేని బంద్ పోరాటం ప్రభావం తక్కుగా ఉంటుంది అని ఉస్మానియాయూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి ప్రశ్నించారు.

“రిజర్వేషన్లను అమలు చేయాలన్న చిత్త శుద్ధి తెలంగాణాలోని ప్రముఖ పార్టీలలో వేటిలో కూడా కనిపించదు. కులగణనలో నిజాయితీలేదు. అసెంబ్లీలో బిల్లులు పెట్టడంలో నిజాయితీ లోపం. కేంద్రంలో బిజెపి ఎలాగూ వీటికి సహకరించదు,’ అని సమాజ్ వాది పార్టీ నేత కూడా అయిన ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. వ్యాఖ్యానించారు.


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో బిల్లులు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అలాగే ఆర్డినెన్స్ జారీచేసి గవర్నర్ కు పంపింది. తర్వాత 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేసేందుక్ జీవో ఎంఎస్ 9ని జారీచేసింది. కేంద్రానికి పంపిన రెండు బిల్లులు పెండింగులోనే ఉన్నాయి. గవర్నర్ దగ్గరకు పంపిన ఆర్డినెన్స్ ఇంకా రాజ్ భవన్లోనే మూలుగుతోంది. వీటిని పక్కనపెట్టిన ప్రభుత్వం జీవో 9ని జారీచేస్తే హైకోర్టు స్టే ఇవ్వటంతో జీవో అమలు నిలిచిపోయింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని మార్చలేమని చెప్పింది. ఇంతవరకు అందరికీ క్లారిటి ఉంది.


అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతున్నది ఎవరు చేసిన అన్యాయనికి వ్యతిరేకంగా. ఇంతకి బిసిలకు అన్యాయం చేసిందెవరు? ఈ ప్రశ్నలకు బంద్ లో సమాధానం లేదు. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది, ఇక చేయగలిగింది కూడా ఏమీలేదు. ఇపుడు రిజర్వేషన్ల బంతి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దగ్గరే ఉందని కాంగ్రెస్ చేతులు కడిగేసుకుంది.

అయితే విచిత్రం ఏమిటంటే బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఉన్నట్లుండి బిసి జేఎసి నాయకత్వం తీసుకున్నారు. ఆ జేఏసీ బంద్ నిర్వహిస్తోంది. ఆయన ఎవరి మీద ఈబంద్ పోరాటం ప్రకటించారు. సొంత పార్టీ మీదనా, లేక కాంగ్రెస్ పార్టీ మీదనా. దీనికి బంద్ లో సమాధానం లేదు.


తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చాల్సింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే. అయినా కృష్ణయ్య కేంద్రం మీద వత్తిడి తెచ్చేందుకు సుముఖంగా లేరు. ఇదే మల్కాజ్ ఎంపి ఈటల రాజేందర్ కు కూడా వర్తిస్తుంది. తెలంగాణ బిజెపిలో ఉన్న చాలా మంది ప్రముఖలు బిజెపి నేతలే. వాళ్లంతా తమ బాధ్యతలు నిర్వర్తించారా?

42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చే విషయం చర్చించేందుకు ప్రధాని మోదీ అవకాశం ఇవ్వలేదు, ఇస్తే అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లేవాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి తప్పుకున్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు కాంగ్రెస్ వైఫల్యానికి వ్యతిరేకంగా బంద్ కు సహకరిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ పొరబాటున కూడా మోదీ ప్రభుత్వం దగ్గిర రాష్ట్రం పంపిన 9 షెడ్యూల్ బిల్లు పెండింగులో ఉందని, దానిని అమోదించకపోవడం తప్పని ఎక్కడా చెప్పలేదు.

తెలంగాణ బిసి బంద్ లో గంగిరెద్దు. బంద్ లో అన్ని కులాలు పాల్గొనడం విశేషం.

బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ మీద బంద్ ను ఎక్కు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ గేమ్ కు నిరసనగా తాము బంద్ లో పాల్గొంటున్నట్లు మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతు కేంద్రప్రభుత్వం వైఖరికి నిరసనగా బంద్ జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుకు మోదీ ప్రభుత్వం వెంటనే ఆమోదంతెలిపి షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇక వామపక్షాలేమో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా బందులో పాల్గొన్నట్లు ప్రకటించాయి.

చీటికి మాటికి రాజీనామా చేస్తానని బెదిరించే నేతులు బీసీ 42 శాతం బిల్లుకు ఆమోదం తెలపకపోతే పదవులకు రాజీనామా చేస్తామని బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజెపి నేతలెవ్వరు హెచ్చరించడం లేదు. ప్రజల నుంచి ఇలాంటి వత్తిడి రాకుండా బంద్ ని ఒక రక్షణ కవచంలాగా అంతా వాడుకున్నారు. బంద్ ను విజయవంతం చేశామని సెలెబ్రేట్ చేసుకోవచ్చు.


మూడుపార్టీలకు వ్యతిరేకంగానే బంద్ : చిరంజీవులు


మూడుపార్టీలకు వ్యతిరేకంగా రిజర్వేషన్ల సాధన సమితి బంద్ లో పాల్గొన్నట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బిసి ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు తొగరాల చిరంజీవులు చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘రిజర్వేషన్ల సాధన సమితి తరపున 20 సంఘాలు బందులో పాల్గొంటున్నట్లు చెప్పారు. ‘‘కేంద్రంలో చేయాల్సింది చేయకుండా బీజేపీ తప్పించుకుంటున్నది. బీసీ రిజర్వేషన్ల కోసం చాలా చేస్తున్నట్లు కాంగ్రెస్ మభ్యపెడుతున్నది. 42శాతం రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎపుడూ స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. అందువల్ల ఈ మూడు పార్టీల విధానాలకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చాం,’’ అని చిరంజీవి చెప్పారు. అదే విధంగా బిఆర్ ఎస్ అధినాయకులు ఎవ్వరూ బంద్ లో పాల్గొనకుండా, పార్టీల బిసినేతలను మాత్రమే బంద్ లోకి పంపరాని ఆయన విమర్శించారు.

‘‘బీసీల న్యాయం కోసం బీఆర్ఎస్ లో బీసీలు మాత్రమే కొట్లాడాలా ? పార్టీల అధినేతలు రోడ్లపైకి రారా? అసెంబ్లీలో రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు హైకోర్టు విచారణలో ఎందుకు ఇంప్లీడ్ కాలేదు,” అని ఆయన ప్రశ్నించారు.

బీసీలకు శతృవులు ఎవరో తెలుసు : కొండలరావు

బిసి రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని అడ్వకేట్, బిసి యాక్టివిస్టు కె. కొండలరావు అన్నారు. పార్టీలో బంద్ లో తమతమ అజెండాలలో పాల్గొన్నా వాళ్ళల్లో బీసీలకు శతృవులు ఎవరో, మిత్రులు ఎవరో అందరికీ తెలుసునని ఆయన కొండలరావు అన్నారు.

‘‘బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రజలకు అందబాటులోకి తీసుకురాకపోవడం తెలంగాణ ప్రభుత్వం తప్పిదం. కమిషన్ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవటాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టంగా ప్రస్తావించింది. రిపోర్టును ప్రజలముందు ఉంచకపోవటంలోనే ప్రభుత్వ దురుద్దేశ్యం కనబడుతుంది’’ అని కొండలరావు మండిపడ్డారు.

‘‘ఈ రోజు ఈ రాజకీయపార్టీల వైఖరికి నిరసనగానే బంద్ పాటిస్తున్నట్లు కొండలరావు కూడా చెప్పారు. ‘‘రిజర్వేషన్లు 50శాతం దాటానికి వీలుగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు బలమైన ఆధారాలను కోర్టుకు చూపటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది,’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 


బిసిల బంద్ ను సెబొటేజ్ చేశారని పేరు చెప్పేందుకు ఇష్టం లేని బిసి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ రిజర్వేషన్లను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు. బిజెపి నేతలు చిత్త శుద్ధితో సహకరించలేదు. బిఆర్ ఎస్ ఎపుడూ బిసిల పక్షాన మాట్లాడలేదు. ఈ పార్టీలన్నీ తమ బిసినేతలను బంద్ లోకి పంపి, బంద్ విజయం చేయించి, లక్ష్యం నీరుగారేలా శబొటేజ్ చేశాయి,” ఆయన చెప్పారు.

అయితే, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ ఇ. వెంకటేశు మాత్రం బంద్ ఒక కొత్త యూనిటి ప్రయోగం, విజయవంతమయిన ప్రయోగం అని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ బంద్ ఒక మలుపు అవుతుంది అని అన్నారు. “బిసిల బంద్ ను తెలంగాణా బిసిల చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. ఇప్పటివరకూ ఎప్పుడూ బిసిలు ఎంత పెద్ద ఎత్తున ఇంత మద్దతుతో బందు నిర్వహించిన దాఖలాలు లేవు. దీనితో బిసిల మధ్య ఐక్యత బలపడినట్టు కూడా చూడొచ్చు. భవిష్యత్తులో ఇదే రకమైన లక్ష్య ఐక్యత కొనసాగితే బిసిలు తృతీయ శక్తిగా తెలంగాణలో ఆశ్చర్యం లేదు,” అని ప్రొఫెసర్ వెంకటేశు అన్నారు.

Tags:    

Similar News