హైదరాబాద్ లో బంద్ పాక్షికం

క్షేత్రస్ధాయిలోకన్నా సోషల్ మీడియాలోను, నేతల ప్రకటనల్లోనే బంద్ బాగా సక్సెస్ అయినట్లు అర్ధమవుతోంది.

Update: 2025-10-18 08:41 GMT
Hyderabad traffic

బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా శనివారం జరుగుతున్న రాష్ట్రవ్యాప్త బంద్ హైదరాబాదులో పాక్షికమనే చెప్పాలి. రాజధాని హైదరాబాద్ లో ప్రతిరోజు ట్రాఫిక్ ఎలాగుందో ఈరోజు కూడా అలాగే ఉంది. ముషీరాబాద్ నుండి అమీర్ పేట వరకు బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదు. షాపింగ్ కాంప్లెక్సులు, షాపులు, మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు యథావిధిగా నడుస్తున్నాయి. జనాలు కూడా రోడ్లమీదకు ప్రతిరోజు వచ్చినట్లే వచ్చారు. ముందుజాగ్రత్తగా విద్యాసంస్ధలను ప్రభుత్వమే మూసేసింది. అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ బస్సులు డిపోలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సులు తిరగని కారణంగా ఆటోలు, క్యాబులు బాగా రద్దీగా కనబడ్డాయి.


విచిత్రం ఏమిటంటే తెలంగాణ బంద్ కు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే వామపక్ష పార్టీలు కూడా బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. అన్నీపార్టీల అధినేతలు ఉండేది హైదరాబాదులోనే. అలాంటిది రాజధానిలో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చాలామంది ఊహించారు. బంద్ కారణంగా రాజధాని రోడ్లు నిర్మాణుష్యంగా ఉంటాయని చాలామంది ఊహించారు. ఒకరకంగా ఇపుడు జరుగుతున్న బంద్ ప్రభుత్వ స్పాన్సర్డ్ బంద్ కాబట్టి విజయవంతం అవటంలో ఆశ్చర్యంలేదని కూడా అనుకున్నారు. తీరాచూస్తే తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో సక్సెస్ అయిన బంద్ హైదరాబాద్ నగరంలో మాత్రం పాక్షికంగా జరగటమే ఆశ్చర్యంగా ఉంది. క్షేత్రస్ధాయిలోకన్నా సోషల్ మీడియాలోను, నేతల ప్రకటనల్లోనే బంద్ బాగా సక్సెస్ అయినట్లు అర్ధమవుతోంది.


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బంద్ కు అన్నీపార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపధ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు బంద్ ను విజయవంతం చేయటంలో నగరంలో పర్యటించినట్లు ఎక్కడా కనబడలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం అంబర్ పేటలో మోటారుసైకిళ్ళ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీమంత్రి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ బుల్లెట్లో బొమ్మ వెనకకూర్చుని అంబర్ పేటలో ర్యాలీగా తిరిగారు.


పంజగుట్ట, అమీర్ పేట, ఇర్రమంజిల్, సోమాజీగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైటెక్ సిటి, బేగంపేట, రాజ్ భవన్ రోడ్డు, రాయుదర్గం, మియాపూర్, సికింద్రాబాద్, అబీడ్స్, హిమాయత్ నగర్, నాంపల్లి లాంటి అనేక సెంటర్లలో ట్రాఫిక్ రోజువారి ఎలాగుంటుందో ఈరోజు కూడా అలాగే ఉంది. బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదనే చెప్పాలి.

Tags:    

Similar News