బీసీ బంద్ విజయవంతం
కాంగ్రెస్, బిజెపి సహా అన్నిపార్టీలు మద్దత్తు
బిసి బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. బిసీలకు 42 రిజర్వేషన్ కల్పించాలని బిసి జెఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బిసీ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు మద్దత్తుగా నిలిచాయి. తాజా బంద్ కు మావోయిస్ట్ పార్టీ కూడా మద్దత్తు తెలిపింది. తెలంగాణలో బిల్లు పాసైనప్పటికీ కేంద్రం ఆమోదించకపోవడంతో ఈ బిల్లుకు చట్టబద్దత లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిసీ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక జీవోజారి చేసింది.
ఎంజీబిఎస్ లో మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బంద్ లో పాల్గొన్నారు.
బిసీ బంద్ నేపథ్యంలో జూబ్లి బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోయాయి. దీపావళి పండుగతో బాటు వారాంతపు సెలవులు ఉండటంతో బస్టాండ్ లోనే బస్సులు నిలచి పోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కుటుంబ సభ్యులతో ప్రయాణికులు బస్టాండ్ లోనే పడిగాపులు కాస్తున్నారు. చిన్నారులు, వయోవృద్దులు బస్టాండ్ లోనే వేచి ఉన్నారు.
క్రిందపడ్డ విహెచ్
బిసీ బంద్ నేపథ్యంలో అంబర్ పేటలో కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతగా ముద్రపడ్డ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో ర్యాలి జరిగింది. ర్యాలిలో ప్లెక్సిలు పట్టుకుని నడుస్తుండగా వి హనుమంతరావు క్రిందపడిపోయారు. కార్యకర్తలు ఆయనను పైకి లేపిన తర్వాత ఆయన ర్యాలీలోపాల్గొన్నారు.
బిసీ బంద్ లో భాగంగా అంబర్ పేట చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బంద్ విజయవంతమైందని, ప్రజలు స్వచ్చందంగా బంద్ కు సహకరించారన్నారు. బిసీలకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్త శుద్ది ఏ పార్టీకి లేదన్నారు.
ట్యాంక్ బండ్ వద్ద మంత్రులు
తెలంగాణ వ్యాప్తంగా బంద్ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటీ శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఇతర నాయకులు బంద్ లో పాల్గొని నిరసన చేపట్టారు. రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదిక 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని వాళ్లు బిజెపిని డిమాండ్ చేశారు. బీసీ బంద్ కు బిజెపి మద్దత్తు ఇస్తూనే కేంద్రం వెనకడుగు వేస్తుందని వారు ఆరోపించారు. బిసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పని చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ మోసం చేస్తుంది: ఈటెల
బిసీల రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. జూబ్లి బస్ స్టేషన్ లో నిర్వహించిన బిసీ బంద్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అమలవుతుందన్నారు. తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సారి సర్వేచేసిందని, కమిషన్ కూడా వేసిందని నిజాయతీ లేక అమలు కాలేదన్నారు. బిసీలు యాచించే స్థితిలో లేరని, శాసించే స్థితిలో ఉన్నారన్నారు. బిసీలు 52 శాతం ఉంటే కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ అని కాకి లెక్కలు చెబుతుందన్నారు. ‘‘నేను చెప్పేది అబద్దం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒకే కుటుంబానికి చెందిన వారికే పదవులు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఒకసారి కూడా బిసీని, ట్రైబల్ ని ముఖ్యమంత్రి చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో బిసీ మంత్రులు ఎనిమిది మంది ఉండాల్సింది కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని ఈటెల విమర్శించారు.
నామినేటెడ్ పోస్టుల్లో బిసీలకు స్థానం దక్కలేదన్నారు. బిజెపి అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే ప్రకటించారని, కేంద్రంలో 27 మంది బిసీ మంత్రులు ఉన్నారని ఆయన అన్నారు.
ఖమ్మం జిల్లాలో
బిసీల రిజర్వేషన్ సాధన కోసం బిసి జెఎసీ ఆద్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలు బంద్ లో పాల్గొన్నాయి. జూలూరులో అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో జరిగింది.
నిజామాబాద్ లో
బిసీలకు న్యాయమైన వాటా కోసం బిసి జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన బిసి బంద్ విజయవంతమైంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలు బంద్ కు సహకరించాయి. పలు చోట్ల నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు జరిగాయి.
కరీంనగర్ లో
బిసి జెఏసి బిసి బంద్ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో బిసి బంద్ జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో బంద్ విజయవంతమైంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం మజీద్ చౌరస్తాలో బిసీ జెఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బంద్ కు మద్దత్తుగా సుల్తానాబాద్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.
మెదక్ లో
మెదక్ జిల్లాలో బిసీ జెఏసీ చేపట్టిన బంద్ కు అన్ని పార్టీలు మద్దత్తు ఇచ్చాయి. గజ్వేల్ బస్టాండ్ వద్ద అన్ని ప్రజా సంఘాలు బంద్ కు మద్దత్తుగా నిరసన చేపట్టాయి.
సికింద్రాబాద్ లో కొండా సురేఖ
మంత్రి కొండాసురేఖ బిసీ బంద్ కు మద్దత్తు తెలిపారు. సికింద్రాబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వెంట కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా పాల్గొన్నారు.