ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎన్నికల కోడ్ కేసు కొట్టివేత;

Update: 2025-08-11 10:36 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana high court)లో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎంపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2019 అక్టోబర్ లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.    తనపై  నమోదైన ఎన్నికల కోడ్  కేసు కొట్టేయాలని రేవంత్‌రెడ్డి  గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌  ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా తనపై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. హుజూర్ నగర్ లో 2021లో ఉపఎన్నికల సందర్బంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రేవంత్ రెడ్డి ఉల్లంఘించినట్టు ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి రేవంత్ రెడ్డి సభ నిర్వహించినట్టు  ఫిర్యాదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో బాటు ఎన్నికల అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 9 వ తేదీకి వాయిదా వేసింది.

రేవంత్ రెడ్డిపై కేసు పెట్టిన పిటిష్ నర్ కు చుక్కెదురు

రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటిషనర్ పెద్దిరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది . రేవంత్‌రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును నాగ్‌పుర్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పెద్దిరాజు ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్ దాఖలు చేశారు. అందులో హైకోర్టు న్యాయమూర్తిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పిటిషన్ డ్రాప్ట్ చేసిన ఏఓఆర్, పెద్దిరాజుపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు పిటిషనర్ పెద్దిరాజు క్షమాపణలు చెప్పాలని తెలిపింది. క్షమాపణ చెపుతూ దాఖలు చేసే అఫిడవిట్‌పై నిర్ణయాన్ని జస్టిస్ మౌసమి భట్టాచార్యపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పెద్దిరాజుకు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పెద్ది రాజు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గోపన్నపల్లి ప్రయివేటు భూ వివాదంలో ఎస్సి ఎస్టి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కేసును ఉపసంహరించుకుంటానని పెద్ది రాజు అభ్యర్థించినప్పటికీ సుప్రీం ధర్మాసనం అనుమతించలేదు. హైకోర్టు న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేసిన పిటిషనర్ పెద్ది రాజుపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది.

Tags:    

Similar News