తెలంగాణ మహిళా చేనేత కార్మికురాలికి ఫస్ట్ ప్రైజ్
మగ్గంపై 45 రోజుల్లో సిరిపట్టు పీతాంబరం చీర నేసిన వెల్ది రేఖ;
By : Saleem Shaik
Update: 2025-08-02 01:39 GMT
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని సిరిసిల్ల పట్టణం చేనేతకు ప్రసిద్ధి. ఈ సారి సిరిసిల్లకు చెందిన మహిళా చేనేత కార్మికురాలు వెల్ది రేఖ చేనేత మగ్గంపై 45 రోజుల్లో సిరిపట్టు పీతాంబరం చీర నేసి అబ్బురపర్చారు. తన భర్త వెల్ది హరిప్రసాద్ నుంచి నేర్చుకున్న చేనేత పనితనాన్ని రేఖ చూపించి మహిళ బొమ్మతో కూడిన జరీబుటాను పట్టుచీరపై నేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ చేనేత పట్టుచీర బరువు 600 గ్రాములు. ఈ చీర అంచుపై 'కాకతీయ తోరణం' నేశానని, పల్లుపై నేసిన ప్రార్థనా రూపమైన 'వేములవాడ గోడ మొక్కు విధానం' ఉందని వెల్ది రేఖ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఏమిటీ సిరిపట్టు పీతాంబరం చీర?
సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ చేనేత మగ్గంపై సృష్టించిన రాజన్న సిరిపట్టు పట్టు పీతాంబరానికి అరుదైన గౌరవం దక్కింది. రేఖ ఇంటి పనులు చేసుకుంటూనే 45 రోజులపాటు శ్రమించి చేనేత మగ్గంపై సిరిపట్టు పీతాంబరం పట్టుచీరను నేశారు. 48 ఇంచుల వెడల్పు ,అయిదు మీటర్ల పొడవుతో కూడిన ఈ పట్టు చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తు అయిన కమాన్ తో పాటు వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీబుటాలను పొందుపర్చి తన చేనేత కళా ప్రతిభను చాటిచెప్పారు. సిరిసిల్ల చేనేత పనితనానికి గుర్తుగా నూలు పడుతున్న మహిళ బొమ్మతో కూడిన జరీబుటాను పట్టుచీరపై నేశారు.చీర మధ్యలో నేసిన దారంతో తయారు చేసిన స్త్రీ అలంకార రూపాలు 'జరీ బుటాలు' కూడా ఉన్నాయి.
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోనే అవార్డుకు ఎంపికైన తొలి చేనేత కార్మికురాలిగా సిరిసిల్లకు చెందిన వెల్ది రేఖ రికార్డు సృష్టించారు.చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది రేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.చేనేత రంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ చేనేత మగ్గంపై సృష్టించిన రాజన్న సిరిపట్టు పట్టు పీతాంబరానికి ఈ అరుదైన గౌరవం దక్కింది.45 రోజులపాటు శ్రమించి చేనేత మగ్గంపై రూపొందించిన పట్టుచీరను అధికారులు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక చేశారు.
దశాబ్ద కాలంగా అద్భుతాల సృష్టి
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారులైన వెల్ది హరిప్రసాద్,రేఖ దంపతులు గత దశాబ్ద కాలంగా చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నేత పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్ల ఖ్యాతిని ఇముడించేలా వెల్ది రేఖ రాజన్న సిరిపట్టు చీరను రూపొందించారు.
నా చీర ప్రజాదరణ పోందుతుంది : వెల్ది రేఖ
తాను నేసిన పట్టు చీరను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్ది రేఖ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన ప్రసిద్ధ గొల్ల భామ చీరల మాదిరిగానే తాను నేసిన చీర కూడా ప్రజాదరణ పొందుతుందని రేఖ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నెన్నో అద్భుతాలు...
చేనేత రంగంలో వెల్ది హరిప్రసాద్ కనీ వినీ ఎరగని రీతిలో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర,దబ్బనంలో దూరే పట్టుచీరను నేసి రికార్డు సృష్టించారు.
- జి 20 లోగోను మగ్గంపైనేసి సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు.
- ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో సైతం చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన ప్రతిభను ప్రదర్శించారు.
హరిప్రసాద్ నేసిన చేనేత కళారూపాలను చూసి దేశ విదేశాలకు చెందిన సుందరీమణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీల సందర్భంగా జరిగిన ప్రదర్శనలో సైతం హరిప్రసాద్ వేసిన పలు పట్టుచీరలను వస్త్రాలుగా కుట్టి మిస్ వరల్డ్ పోటీ దారులు రాంప్ వాక్ చేశారు చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న హరి ప్రసాద్ దంపతులను కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు.