చనిపోతూ పరులకు వెలుగునిస్తున్న తెలంగాణ చైతన్యం...

అవయవ దానంలో అగ్రభాగాన తెలంగాణ, జాతీయ అవార్డుకు ఎంపిక;

Update: 2025-08-04 02:37 GMT
జీవన్ దాన్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తరలిస్తున్న వైద్యులు

స్థలం : అది ఢిల్లీలోని ఆడిటోరియం...సందర్భం : నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ,అవార్డు ప్రదానం : నేషనల్ ఆర్గాన్ అండ్ ఇష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ జీవన్ దాన్ అధికారుల బృందానికి నోట్టో (NOTTO) అవార్డుతో సత్కరించారు.

భారతదేశంలోనే అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో  (TelanganaTopper) నిలిచింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేసిన కృషితో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.




 725 మంది ప్రాణాలు కాపాడారు...

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 అవయవదానాలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 4.88 అవయవదానాలు (OrganDonation)జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. 2024వ సంవత్సరంలో 188 మంది బ్రెయిన్ డెడ్ దాతల నుంచి 725 అవయవాలను సేకరించి అవసరమైన వారికి వాటిని అమర్చి 725 మంది ప్రాణాలు కాపాడిన ఘనతను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సొంతం చేసుకుంది. అవయవదానంలో జాతీయ సగటు రేటు కంటే ఐదు రెట్లు ఎక్కువ సాధించి తెలంగాణ దేశంలోనే టాప్ లో నిలిచింది.


పూజారి ఆరుగురికి పునర్జన్మ

తేదీ : 2024 వ సంవత్సరం నవంబరు 4వతేదీ

రోడ్డు ప్రమాదం : మహారాష్ట్రలోని నాందేడ్ నగరానికి చెందిన 24 ఏళ్ల పూజారి వెంకటేష్ నాగేష్ కులకర్ణి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకువచ్చిన లారీ పూజారి బైక్ ను ఢీకొట్టింది. పూజారి తీవ్రంగా గాయపడటంతో అతన్ని బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా ఉండటంతో నవంబరు 8వతేదీన అతన్ని హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.



బ్రెయిన్ డెడ్ : పూజారి వెంకటేష్ నాగేష్ కులకర్ణి బ్రెయిన్ డెడ్ అయ్యాడని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. బ్రెయిన్ డెడ్ అయిన పూజారి మృతదేహం నుంచి రెండు కిడ్నీలు, లివర్, గుండె, రెండు కార్నియాలను కలిపి మొత్తం ఆరు అవయవాలను దానంగా ఇవ్వాలని మృతుడి తండ్రి నగేష్ కులకర్ణికి వైద్యులు చెప్పి, అవయవదానం గురించి కౌన్సెలింగ్ చేయడంతో అతను తన కుమారుడి ఆరు అవయవాలను దానంగా ఇచ్చేందుకు అంగీకరించాడు. అంతే గ్రీన్ ఛానల్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వెంకటేష్ నాగేష్ కులకర్ణి నుంచి ఆరు అవయవాలను తరలించి ఆరుగురు రోగులకు ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సలు చేశారు. అంతే ఆరుగురికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.


మృతుడి తండ్రికి సన్మానం

తన కుమారుడు బ్రెయిన్ డెడ్ అవడంతో శోకసముద్రంలో మునిగిన నగేష్ కులకర్ణి తేరుకొని తన కుమారుడి అవయవాలను అవయవదానానికి అంగీకరించాడు.ఆరుగురు పేషంట్లకు పునర్జన్మ ప్రసాదించిన నగేష్ కులకర్ణిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో సన్మానించి, అభినందించారు. అవయవదానం చేసిన తండ్రిని కేంద్రమంత్రి ప్రశంసించారు.

తెలంగాణలో 6,309 మందికి అవయవదానం

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న అవయవ దానం చేసే జీవన్ దాన్ (Jeevandan) కార్యక్రమం కింద బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 673 మంది దాతల నుంచి 6,309 మందికి అవయవాలను ట్రాన్సప్లాంట్ చేసేలా వైద్యులు శస్త్రచికిత్సలు చేశారు.జీవన్ దాన్ కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో అవయవదానానికి బ్రెయిన్ డెడ్ కుటుంబసభ్యులు ముందుకు వస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మృతదేహాల నుంచి అవయవాలను సేకరించి వాటిని గ్రీన్ కారిడార్ ద్వారా సత్వరం రోగులున్న ఆసుపత్రులకు తరలించి వాటిని ట్రాన్స్ ప్లాంట్ చేస్తున్నారు.



2025లో అవయవదానం

తెలంగాణలో ఈ ఏడాది 94 మంది అవయవ దానం చేశారని జీవన్ దాన్ నోడల్ అధికారి డాక్టర్ భూషణ్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఏడాది 365 మంది నుంచి అవయవాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా 141 మంది కిడ్నీల ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. లివర్ కోసం 86 మంది, గుండె కోసం 15 మంది, లంగ్స్ కోసం 39 మంది, కార్నియాల కోసం 76 మంది ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. మొత్తంమీద 1644 మంది అవయవాలను దానం చేయగా 6,210 మందికి అవయవాలను అమర్చామన్నారు. అవయవ దానాల్లో 2,476 మందికి కిడ్నీలు, 1507 మందికి లివర్ లు, 225 మందికి గుండె ట్రాన్స్ ప్లాంట్ చేశామని డాక్టర్ వివరించారు.

అవయవాల దానంతో సమాజానికి మేలు
జీవన్ దాన్ పథకం కింద అవయవాలను దానం చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని జీవన్ దాన్ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జీవన్ దాన్ కార్యక్రమం పట్ల తాము ప్రజలకు కౌన్సెలింగ్ చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలోనే అవయవ మార్పిడిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం తమ బాధ్యతను పెంచిందని డాక్టర్ భూషణ్ రాజు చెప్పారు.



 అవయవదానంలో ఆల్‌ఇండియా టాపర్‌‌గా తెలంగాణ

అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. మంత్రి ఈ సందర్భంగా ఎక్స్ లో ట్వీట్ చేశారు.  2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్‌ జరిగితే, తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు 4.88 డొనేషన్స్‌ జరిగాయని మంత్రి పేర్కొన్నారు. అవయవదానంలో తెలంగాణ టాపర్‌‌గా నిలవడం పట్ల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్‌దాన్ ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.



 అవయవాలు దానం చేయండి : మంత్రి దామోదర్ రాజనర్సింహ

పేద,ధనిక బేధం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందేలా ఇటీవలే తోట యాక్ట్‌ను అడాప్ట్ చేసుకున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా పోకుండా, దానం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవమార్పిడి చికిత్సను అందిస్తున్నామన్నారు. 2024లో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి, 725 అవయవాలను ఇతరులకు అమర్చి, వారి ప్రాణాలు కాపాడగలిగామని మంత్రి వెల్లడించారు.




Tags:    

Similar News