‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బచ్చాగాడిని గెలిపిస్తా’
కేటీఆర్‌కు పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్.;
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వీటిలో గెలిచి తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బచ్చాగాడిని నిలబెట్టి గెలిపిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో మూడు సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా ఇప్పుడు అతి త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గురించి ఆలోచించాలని సూచించారు. ఈ ఉపఎన్నికలో బచ్చాగాడిని పెట్టి గెలిపిస్తానని అన్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత కేటీఆర్ ఎక్కడుంటారు? అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు అదే నెంబర్ రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎక్కడుంటావ్ కేటీఆర్..
‘‘మూడున్నర సంవత్సరాల తర్వాత మీరెక్కడ ఉంటారు కేటీఆర్.. ఇండియాలోనా? ఫారిన్‌లోనా? సీఎం రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు కనిపించనిది, వినిపించనిది.. ప్రతిపక్షంలో కనిపిస్తుంది అంటే విడ్డూరం, హాస్యాస్పదంఆ ఉంది. విభజన సమయంలో రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రధాన పార్టీ కాంగ్రెస్. నాడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చింది. మా ప్రభుత్వం పేదోళ్లకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే అది చూసి ఓర్వలేక కొంతమంది విషం కక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు?. కమిషన్‌లు వచ్చే కాళేశ్వరం కట్టాలనుకున్నారు కానీ.. పేదోడికి డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. పేదోడికి ఇల్లు కట్టించి ఉంటే మీకు నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు. పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటే.. మీకు ఒళ్ళంతా విషం ఉంటుంది. రెండు పర్యాయాలు మీకు బుద్ధి చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పాలి’’ అని అన్నారు.