మాగంటి సునీతకు బీఆర్ఎస్ ‘ స్పెషల్ క్లాసులు’ తీసుకుంటోందా ?
జూబ్లీహిల్స్(Jubilee Hills by poll) ఉపఎన్నికలో మాగంటి సునీత(Maganti Sunitha) బీఆర్ఎస్(BRS) తరపున పోటీచేయటం దాదాపు ఖాయమైపోయింది
తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక విషయంలో మాగంటి సునీతకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నారు. జనాల్లోకి వెళ్ళినపుడు ఎలా మమేకం అవ్వాలి, ప్రసంగాల శైలి ఎలాగుండాలి ? ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)పై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయాలి ? అనే అంశాలపై సీనియర్లతో సునీతకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. జూబ్లీహిల్స్(Jubilee Hills by poll) ఉపఎన్నికలో మాగంటి సునీత(Maganti Sunitha) బీఆర్ఎస్(BRS) తరపున పోటీచేయటం దాదాపు ఖాయమైపోయింది. అయితే ఎందువల్లో అధికారికంగా అభ్యర్ధిత్వాన్ని ప్రకటించలేదు.
2023ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఇచ్చిన హామీలేమిటి ? అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసింది ఎన్ని ? అనే అంశాలపైన శిక్షణలో ఎక్కువగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ప్రధానంగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, 6 గ్యారెంటీల అమలువంటి అంశాలపైన రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కువగా క్లాసులు తీసుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇక కరెంట్ అఫైర్స్ అంటే యూరియా కొరత, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ఫెయిల్యూర్ లాంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టారు.
సునీత అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా నియోజకవర్గంలోని సీనియర్లు, క్యాడర్ తో కలిపి పర్యటనలు ఏర్పాటు చేసింది పార్టీ. ఇప్పటికే సునీత ఇద్దరు కూతుళ్ళు తల్లిని గెలిపించాలని నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టేశారు. ఒకవైపు కూతుళ్ళు, మరోవైపు సీనియర్ నేతలు, క్యాడర్ తో కలిసి సునీత పర్యటిస్తున్నారు. అంటే జనాలతో మమేకం అయ్యే విషయంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పిస్తోంది పార్టీ. ఇదంతా ఎందుకు చేస్తోంది ? మాగంటి గోపి భార్యకు రాజకీయాలు కొత్తా ? ఎవరితో ఎలాగ మాట్లాడాలో తెలీదా ? అనే సందేహాలు రావటం సహజం. అలాగ అనుకునే దుబ్బాక ఉపఎన్నికలో సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చి పార్టీ దెబ్బతినేసింది.
2020లో బీఆర్ఎస్ ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి మరణించారు. హ్యట్రిక్ ఎంఎల్ఏ సోలిపేట చనిపోయిన కారణంగా దుబ్బాకలో ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకని సానుభూతి ఓట్లతో ఈజీగా మళ్ళీ గెలవచ్చన్న ప్లాన్ వేసి పార్టీఅధినేత కేసీఆర్ ఉపఎన్నికలో రామలింగారెడ్డి భార్య సుజాతారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ప్రచార సమయంలో క్యాండిడేట్ లోని మైనస్సులన్నీ బయటపడ్డాయి. పార్టీనేతలు ఎంతప్రచారంచేసినా ఉపయోగంలేకపోయింది. కారణం ఏమిటంటే జనాలను కలిసినపుడు, సభల్లోను సుజాత మాట్లాడలేకపోయారు. ఉపఎన్నికలో సుజాత ఓడిపోయింది సుమారు వెయ్యిఓట్ల తేడాతోనే అయినా అభ్యర్ధి మైనస్ అవటంవల్లే పార్టీ ఓడిపోయిందనే విశ్లేషణలు ఎక్కువగా వినిపించాయి.
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే మళ్ళీ అదే రిజల్టు రిపీట్ కాకూడదనే ఇపుడు సునీత విషయంలో పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సునీతను జనాల్లోతిప్పటం, పార్టీకార్యక్రమాలకు ఆహ్వానిస్తు, సభల్లో మాట్లాడించటం, ప్రత్యర్ధిపార్టీలపై చేయాల్సిన ఆరోపణలు, విమర్శలపై అవసరమైన క్లాసులు తీసుకుంటున్నది. అంతాబాగానే ఉందికాని బీఆర్ఎస్ అనుకుంటున్నట్లు గోపినాధ్ మరణంతాలూకు సింపథి ఫ్యాక్టర్ పనిచేస్తుందా ? అన్నదే అసలైన పాయింట్.